ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తమ ఆప్తులు, అధికార గణాలతో కలిసి సుమారు ఆరుగంటల పాటు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఇరుగు పొరుగున ఉన్న, ఇటీవలే రెండు సొంత అస్తిత్వాలుగా ఏర్పడిన రాష్ట్రాల మధ్య ఇలాంటి భేటీలు అవసరం. మంచి పరిణామం. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొనడానికి, అభివృద్ధి దిశగా సరైన రీతిలో ముందడుగు వేయడానికి ఇలాంటి భేటీలు ఇద్దరికీ ఉపయోగపడతాయి. అయితే పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి.. వారు చర్చించిన ప్రాధాన్యాంశాలను గమనిస్తే.. ఏపీ సీఎం జగన్ కొంచెం అప్రమత్తంగా, అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఈ భేటీ గురించిన వార్తలను గమనిస్తే.. గోదావరి కృష్ణ నదుల అనుసంధానమే అన్నింటికంటె ప్రాధన్యాంశంగా కనిపిస్తోంది. దాని మీద తక్షణ కార్యాచరణలోకి దిగడానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. రెండో దశలో అధికార్ల, ఇంజినీర్ల స్థాయి సమావేశాలు జరపడానికి కూడా నిర్ణయించేశారు. అది అవసరమే కావొచ్చు. కానీ అత్యవసరం మాత్రం కాదు. ఇప్పటికే ఆలస్యం అయిపోతున్న వ్యవహారం క దు.
రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు కావస్తోంది. ఇప్పటిదాకా తెగని అంశాలు చాలా ఉన్నాయి. 9,10 షెడ్యూళ్లలోని అంశాల జోలికే వస్తే.. వాటిని తేల్చడం అత్యవసరం. కారణాలు ఏవైనా కావొచ్చు. స్నేహ సంబంధాలు కొనసాగించడంలో ఫెయిలైన చంద్రబాబుదే తప్పు కావొచ్చు. కానీ.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ అంశాలను ఒక కొలిక్కి తీసుకురావడం అనేది జగన్ మీద ఉన్న బాధ్యత. చంద్రబాబునాయుడు ఈ తరహాలో అనేక అంశాల్లో ఫెయిలయ్యాడు గనుకనే.. ప్రజలు జగన్మోహన రెడ్డికి అధికారం కట్టబెట్టారు. అలాంటప్పుడు ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. ఉద్యోగుల పంపకాలు, నిన్నటి ఆరుగంటల భేటీలో.. నదుల అనుసంధానం తప్ప చర్చించిన తతిమ్మా అన్ని విషయాలూ ముందుగా లెక్క తేల్చాలి.
కేసీఆర్ వ్యూహచాతుర్యం మెండుగా గల నాయకుడు. ఆయన వ్యూహాలకు జగన్ తాను బలిఅయిపోయి, రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా బలిపెట్టే పరిస్థితి దాపురించకూడదు. ప్రభుత్వాలు మారిన తర్వాత.. గత ఏడునెలల్లో కూడా జగన్ మరో రెండు మార్లు భేటీ అయ్యారు. హైదరాబాదులో ఏపీ ఆధీనంలో ఉన్న సెక్రటేరియేట్ భవనాలను కేసీఆర్ కు ధారాదత్తం చేసేయడం మినహా, విభజనానంతర సమస్యల్లో జగన్ ఇప్పటిదాకా ఏ ఒక్కటీ తేల్చలేదు. అవి అప్పగించేయడానికి ముందే 9,10 షెడ్యూళ్లలోని సమస్త అంశాలను చక్కబెట్టి ఉండాలి. అందులో ఆయన విఫలమయ్యారు.
కనీసం ఇప్పటికైనా జాగ్రత్త వహించి.. ఇరు రాష్ట్రాల సమన్వయంతో సాగాల్సిన పనులను దశలవారీగా విభజించుకోవాలి. ముందు వివాదాస్పద అంశాలన్నిటినీ చక్కబెట్టిన తర్వాతే… నదుల అనుసంధానం వంటి ఉభయప్రయోజనకరమైన వాటి జోలికి వెళ్లాలి. లేకపోతే.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి వస్తుంది.