Advertisement


Home > Politics - Gossip
జగన్‌ సారూ.. గౌరవం ఇచ్చేస్తే పోలా.?

పాపం చంద్రబాబు.. ఆయనగారికి గౌరవం కావాలాయె. తప్పదు మరి, ఆయన వయసు అలాంటిది. చంద్రబాబు వయసుకే కాదు, ఆయన అనుభవానికీ గౌరవం ఇచ్చి తీరాలి. కానీ, వైఎస్‌ జగన్‌ - చంద్రబాబుకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడంలేదు. ముఖ్యమంత్రిగానూ, సీనియర్‌ పొలిటీషియన్‌గానూ.. ఇలా ఏ కోణంలోనూ చంద్రబాబు - జగన్‌ నుంచి గౌరవం దక్కించుకోలేకపోతున్నారు.! 

ఇదంతా ఏంటో తెలుసా.? మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆవేదన. చంద్రబాబు ఎలాంటోడైనాసరే, ఆయన వయసుకి వైఎస్‌ జగన్‌ గౌరవమివ్వాలట. వాయిస్‌ కొంచెం తేడాగా వున్నట్లుంది కదూ.! ఆయన పేరు తెలుసు కదా.? ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ఆయన్ని కొందరు రాజకీయ ప్రత్యర్థులు 'ఊసరవెల్లి' అని కూడా అంటుంటార్లెండి. ఒక్కోసారి కాంగ్రెస్‌ని వెనకేసుకొస్తారు, ఇంకోసారి చంద్రబాబు గురించి పాజిటివ్‌గా మాట్లాడేస్తారు, మరోసారేమో వైఎస్‌ జగన్‌ని ప్రశంసలతో ముంచెత్తేస్తారు. 

ఇక, 'గౌరవం' విషయానికొద్దాం. చంద్రబాబుకి, వైఎస్‌ జగన్‌ గౌరవమివ్వాల్సిందే.! కానీ, ఎప్పుడు.? ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌కి, చంద్రబాబు గౌరవమిచ్చినప్పుడు.! గౌరవం అనేది, ఒకరు ఇస్తే వచ్చేది కాదు. ఇచ్చి, పుచ్చుకునేది గౌరవం అవుతుంది. అవతలి వ్యక్తి గౌరవిస్తే, ఆ గౌరవం దక్కినట్టు కాదు.. ఇవతలి వ్యక్తి కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేలా ప్రవర్తించాలి. 

వైఎస్‌ జగన్‌ మీద అక్రమాస్తుల కేసు వుండొచ్చుగాక. అలాగని, ఆయన ప్రతిపక్ష నేత కాకుండా పోతారా.? ఓ పార్టీకి అధినేత కాకుండా పోతారా.? ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వున్నదే ఒకే ఒక్క విపక్షం. అదే వైఎస్సార్సీపీ. ఆ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు 'మోనార్కిజం' ప్రదర్శిస్తే, ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ - ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇవ్వాల్సిన గౌరవమెలా ఇస్తారు.? ఛాన్సే లేదు. 

చాలా విషయాల్లో వైఎస్‌ జగన్‌ నోట తొందరపాటు వ్యాఖ్యలు వస్తున్నాయి. విమర్శనాస్త్రాల విషయంలో ఒక్కోసారి జగన్‌ దుస్సాహసమే చేస్తున్నారు. కానీ, ఆ వెంటనే చంద్రబాబు నుంచి వచ్చిన ప్రతిస్పందన చూస్తే, వైఎస్‌ జగన్‌ నోట దొర్లిన తప్పులూ తప్పులు కాకుండా పోతున్నాయి. 'నా అనుభవం అంత లేదు నీ వయసు..' అన్న మాట జగన్‌ని ఉద్దేశించి, చంద్రబాబు పదే పదే అనడమే, ఆయన అహంకారాన్ని చెప్పకనే చెబుతోంది. 

జగన్‌కి రాజకీయ అనుభవం లేదు కాబట్టి, నోరుజారేస్తున్నారనుకోవచ్చు. మరి, అనుభవం చంద్రబాబుకి ఏం నేర్పింది.? అందుకే, ఇక్కడ దొందూ దొందే అనేది.! ఇచ్చే స్థితిలో జగన్‌ లేరు, పుచ్చుకునే అర్హతా చంద్రబాబుకి లేకుండా పోయింది. ఇది స్వయంకృతాపరాధం.