Advertisement


Home > Politics - Gossip
జగన్ ఆ సంగతి జనానికి చెప్పాల్సిందే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన అస్త్రాన్ని సంధించారు. ఎక్కడైతే తన రాజకీయ ప్రత్యర్థులు గొంతెత్త లేనిస్థితిలో ఉన్నారు. ఆ అంశంలో మరింత ఫోకస్ పెంచడానికి డిసైడ్ అయ్యారు. ‘రాష్ట్రానికి న్యాయం చేయడం’ అనే నినాదాన్ని నమ్ముకున్నంత వరకూ- సబ్జెక్టు విశాలంగా అయిపోతోంది. సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి.. ప్రత్యర్థుల గళం పెద్దదిగా వినిపిస్తోంది. తమకు రావాల్సిన మైలేజీ రావడంలేదు. అందుకే.. ప్రత్యర్థులు అసలు నోరెత్తలేని.. చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయేటువంటి అంశాన్ని టేకప్ చేసినట్లయితే.. అంతో ఇంతో మైలేజీ తమ పార్టీకి మాత్రమే దక్కతుంది. అని ఆయన అంతిమంగా నిర్ణయించుకున్నారు. 

అందుకే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో తమ పార్టీ ప్రజాప్రతినిధులతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షలను ప్లాన్ చేయడం ద్వారా.. ఆయన తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కూడా అనుకుంటున్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాడాలనే నిర్ణయం తీసుకోవడం ద్వారా.. తన గురించి తన పార్టీ వైఖరి గురించి.. విమర్శించే తెలుగుదేశం వారి నోర్లకు జగన్ తాళాలు వేసినట్లే లెక్క. ఇన్నాళ్లూ జగన్ తన పాదయాత్రలో ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించినప్పుడు గానీ.. వేర్వేరు సందర్భాల్లో హోదా ప్రస్తావన తెచ్చినప్పుడు గానీ.. తెలుగుదేశం వారంతా.. ఆయన ఢిల్లీలో పోరాటం చేయవచ్చు కదా.. అంటూ వెటకారాలు చేసేవారు. 

ఢిల్లీలోనూ జగన్ స్వయంగా దీక్ష చేసిన సంగతిని వారు విస్మరించి మాట్లాడేవారు. చంద్రబాబు స్వయంగా.. ఢిల్లీ సర్కారు ఇవ్వాల్సిన దాని గురించి ఢిల్లీలోనే దీక్ష చేయాలి తప్ప.. రాష్ట్రంలో కాదంటూ... జగన్ ను విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు జగన్ స్వయంగా ఢిల్లీలో దీక్షకే సిద్ధమవుతున్నారు. ఇక తెదేపా వర్గాలు ఏం చెబుతాయో చూడాలి.

అయితే జగన్ ముందుగా మరో వ్యూహాత్మక నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ప్రత్యేక హోదా అనే స్ఫూర్తి ప్రజల్లో మంటగలిసిపోవడానికి తెలుగుదేశం పార్టీ.. చాలా చర్యలు చేసేసింది. కొందరు దానిని మరచిపోతున్నారు కూడా.. ముందుగా ప్రజల్లో ఆ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాలి. 

ప్రధానంగా ప్రత్యేకహోదాకు- ప్రత్యేక ప్యాకీజీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పాలి. హోదా వస్తే ఏం జరుగుతుంది... ప్రస్తుతం దానికి ప్రత్యామ్నాయంగా ప్యాకేజీలో ఏం ఉంది. దానివల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరుగుతుంది. అయినా సరే.. అందుకు చంద్రబాబు సర్కారు ఎందుకు ఒప్పుకుంది.. లాంటి అంశాలను కూలంకషంగా తెలియజెప్పినట్లయితే జగన్ కు మేలు జరుగుతుంది. 

ఆయన పోరాటానికి ప్రజల మద్దతు కూడా లభిస్తుంది. ఆయన పోరు కేవలం రాజకీయ పోరుగా కాకుండా.. ప్రజల పోరుగా తయారవుతుంది. దీనివల్ల.. ప్రయత్నం సఫలమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయని పలువురు అంటున్నారు.