Advertisement


Home > Politics - Gossip
జగన్ సైనికుడే కానీ రాజు కాదు

రాజయినా, సైనికుడు అయినా రాజ్యంలో భాగమే. కానీ రాజుకు, సైనికుడికి తేడా వుంటుంది. సైనికుడికి పోరాటం మాత్రమే తెలుసు. కానీ రాజుకు రాజ్యాన్ని నిలబెట్టుకునే ఎత్తుగడలు కూడా తెలుస్తాయి. రాజుకు మంత్రి, సైనాధ్యక్షుడు, కోశాధికారి ఇలా బలగం వుంటుంది. సైనికుడికి కేవలం తన పోరాట పటిమ, తన ఆయుధం తప్ప వేరే సాయం వుండదు. సైనికుడికి పౌరుషం ఎక్కువ, ఆలోచన తక్కువ వుంటుంది. కానీ రాజుకు ఆలోచన ఎక్కువ ఆవేశం తక్కువ వుంటుంది. అతిగా ఆవేశపడే రాజు వున్న రాజ్యానికి ప్రమాదం. ఆవేశంతో పాటు ఆలోచన వున్న సైనికుడికి ఎప్పటికయినా రాజయ్యే చాన్స్ వుంటుంది.

వైకాపా నేత జగన్ కు, తేదేపా నేత చంద్రబాబును చూస్తుంటే సైనికుడు, రాజు అన్నట్లుగా కనిపిస్తుంటుంది. జగన్ కు ఆవేశం, పోరాటం ఎక్కువ. చంద్రబాబుకు ఆలోచన, ఎత్తుగడలు ఎక్కువ. అందుకే జగన్ పోరాడుతూనే వుంటారు. చంద్రబాబు అధికారం నిలబెట్టుకునే పనిలోనే వుంటారు. 

విశ్వనాధ నాయకుడి కథ తెలుసుకదా? విశ్వనాధ నాయకుడి తండ్రి నాగమ నాయకుడు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తే, రాజు అయిన కృష్ణదేవరాయలు ఎవర్ని పంపించాడు అతగాడి మీదకు, కొడుకు విశ్వనాధ నాయకుడినే. అదీ ఎత్తుగడ. రాజ్యతంత్రం. యుద్ధం యుద్ధంలాగే చేయాలి. అంతేకానీ, వాడు పెద్ద కత్తి పట్టుకున్నాడు. తూచ్.. అన్యాయం అనకూడదు. న్యాయం కనీసం మూడుపాదాల నడచిన నాడే యుద్ధంలో తంత్రాలు, కుతంత్రాలు తప్పలేదు. అలాంటిది న్యాయం ఒంటికాలి మీద కూడా సరిగ్గా నిలబడని రోజులు ఇవి. ఇక ఇప్పడు ఇది అన్యాయం అని ఎలుగెత్తి అరవడం ఏమిటి?

శ్రీశ్రీ ఏమన్నాడు. అన్యాయం ఇదంటే.. అనుభవించు నీ ఖర్మం అంటాడు అని అన్నాడు. జగన్ రాజు కావాలనుకుంటున్న సైనికుడు మాత్రమే. అందుకే అతనికి తోడుగా మంత్రీ లేడు, సేనానీ లేడు. ఆఖరికి కోశాధికారీ లేడు. మరి ఎప్పుడైనా అవసరమై 'ఎవరక్కడ?' అంటే పలికేది ఎవరు? తానే తప్పట్లు కొట్టేసుకుని, తానే మంచినీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి జగన్ ది.

తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా అలిగారు అని తెలిస్తే చంద్రబాబు తరపున లగెత్తుకు వెళ్లి, బుజ్జగించడానికి బోలెడు మంది రెడీగా వుంటారు. అలిగినది ఎవరు? ఎవరు చెబితే వింటారు? ఏం చెబితే వింటారు? ఇలా చాలా ఆప్షన్లు సిద్దంగా వుంటాయి. బాబు తన ఆఫీసు రూమ్ లో వుండే పనులు చక్క బెట్టుకుంటారు. అవసరం అయితే బాబు తరపున వరాలు ఇచ్చి, లేదా వరహాలు ఇచ్చి పరిస్థితి దారిలోకి తేవడానికి అంకితభావం కలిగిన ఓ బృందం వుంటుంది.

కానీ జగన్ పరిస్థితి ఏమిటి? కర్నూలులో వున్నవాడు సమస్య వస్తే కాకినాడకు అయినా ఆయనే పరుగెట్టాలి. రేపు అధికారం అందితే అనుభవించానికి చాలామందే వున్నారు. కానీ ఇప్పుడు సమస్య వస్తే చక్కదిద్దడానికి మాత్రం ఒక్కండును కానరాడు.

అధికారం వుంటే అంతా వుంటుంది. అధికారం లేకుంటే ఇలాగే వుంటుంది అని ఎవరన్నా అనేయడం సులువే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో అధికారం అనుభవించిన దానికన్నా, అది లేకుండానే నాయకుడు అనిపించుకున్న రోజులే ఎక్కువన్న సంగతి మరిచిపోరాదు. మరి ఆయనకు సాధ్యమైనది జగన్ కు ఎందుకు సాధ్యం కావడంలేదు? ఎందుకంటే మళ్లీ అదే పాయింట్.

వైఎస్ రాజు, జగన్ సేనాని. వైఎస్ చుట్టూ ఆయనను నమ్ముకున్న, ఆయన నమ్మిన అపార బలగం వుండేది. జగన్ చుట్టూ ఆయనను నమ్ముకున్నవారు కొందరయినా వుండొచ్చు. కానీ జగన్ నమ్మిన వారు మాత్రం తక్కువ. ఎందుకంటే గడచిన అయిదారేళ్లలో జగన్ నమ్మిన వారంతా ఏదో విధంగా ఆయనను దెబ్బతీసారు. దీంతో ఈయనకు ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అన్న డైలామా?

రాజు అయితే మాత్రం?

చరిత్రలో ఎంతమంది రాజులు కుట్రల కారణంగా రాజులు కాలేదు. రాజులు, రాజ్యాలు అన్నీ కుట్రలు, కుతంత్రాలతో నిండిని కథలేగా. సరే, ఇప్పుడు అధికారం లేదు. జగన్ చుట్టూ వున్నవారిని కొనేస్తున్నారు. సరే అధికారం వుంటే మాత్రం అమ్ముడు పోయేవారు అమ్ముడుపోరా? ఇప్పుడు పాతిక ఇస్తే వెళ్లిన వారు రేపు యాభై అంటే వెళ్లరా? అలా అని గ్యారంటీ ఏమన్నా వుందా? అమ్మకాలు, కొనుగోళ్లు సర్వ సామాన్యం అయినపుడు, భవిష్యత్ లో అధికారం అందినా జగన్ నిలబెట్టుకోగలరా? అన్న అనుమానం పార్టీ శ్రేణులకు కలగదా?

గట్టిగా రెండువేల కోట్లు పట్టుకుంటే వంద మందిని లాగేయవచ్చు కదా? ఇన్నాళ్లు అధికారంలో వున్నవాళ్లు, పైగా జగన్ ఆరోపిస్తున్నట్లు ఒక్కో ప్రాజెక్టులో వందల కోట్లు మిగులుతున్నపుడు, రెండు వేలకోట్లు ఏ పాటి? పోనీ అప్పుడేమన్నా ప్రజాస్వామ్య సూత్రాలు, గవర్నర్లు, స్పీకర్లు అడ్డం పడతారా? ఇప్పుడు కనిపించని పద్దతులు, పెద్ద మనుషులు అప్పుడు వుంటారా?

తిలక్ అంటాడు.. 'ఏం లోకం తల్లీ? ఇట కనిపించడు కాలనేమి?' అని అలాగ్గానే వుంది. ఏం ప్రజాస్వామ్యం తల్లీ. ఇక్కడ స్పీకరు వున్నారు. గవర్నర్ వున్నారు. న్యాయస్థానాలు వున్నాయి. చట్టాలు వున్నాయి. అయినా ఫిరాయింపులు పదిలంగా సాగుతూనే వున్నాయి. రాజు గదిలో కూర్చుని బంట్లను కదుపుతున్నారు. అక్కడ అవతలి రాజు తన గళ్లలో తాను గడిబిడిగా తిరిగేస్తూ, పోరాడేస్తున్నా అనుకుంటున్నారు. ఈలోగా ఆటకట్టు అనేయబోతున్నారు. 

అంతే ప్రజాస్వామ్యంలో నడుస్తున్న రాజరికం ఇది.

- చాణక్య