cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు ఆర్థిక వనరుపై జగన్ మెరుపుదాడి

బాబు ఆర్థిక వనరుపై జగన్ మెరుపుదాడి

చంద్రబాబుపై జగన్ ముప్పేటదాడి మొదలైంది. ప్రభుత్వ పథకాల్లో జరిగిన అవినీతిని ఎండగట్టడం ఒకటైతే, ప్రత్యేకహోదా తేవడంలో విఫలమైన బాబుని ప్రజాకోర్టుకీడ్చడం రెండోది. ఇక మూడోది చంద్రబాబు ఆర్థిక వనరులపై దెబ్బ. అంటే వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకి చంద్రబాబు పారించబోతున్న నోట్ల ప్రవాహాన్ని అడ్డుకోవడం.

చంద్రబాబు ఆర్థిక వనరుల్లో ఒకరు మంత్రి నారాయణ. తెరవెనక ఎన్నోఏళ్లుగా టీడీపీకి ఆర్థికసాయం చేస్తూ వచ్చిన నారాయణ, గత స్థానిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర వ్యూహకర్తగా తెరపైకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిపదవిలో కూర్చున్నారు. ఇదంతా చాలా క్యాలిక్యులేటెడ్ గా జరిగింది. మంత్రికి తోడు రాజధాని అభివృద్ధి కమిటీ పేరుతో మరోపదవి. మొత్తానికి గతంలో పార్టీకి ఖర్చుపెట్టిన సొమ్మే కాకుండా, భవిష్యత్ లో ఓట్ల కొనుగోలుకి కావాల్సిన డబ్బంతా ఇప్పటికే నారాయణ సమకూర్చుకున్నారని టాక్.

2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి నారాయణే ప్రధాన ఆర్థిక వనరు. అయితే నారాయణకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం విద్యా వ్యాపారం ద్వారానే. ఈ నాలుగేళ్లలో బాబు చల్లని చూపుతో ఈ వ్యాపారం పదింతలు పెరిగింది. అందుకే మంత్రి నారాయణపైనే తొలిదెబ్బ వేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇటీవల కార్పొరేట్ విద్యపై చాలా నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్సీ అధినేత.

నారాయణ సొంతజిల్లా నెల్లూరులో ఏకంగా 7 జూనియర్ కాలేజీలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని ప్రధాన ఆరోపణ. బావగారు విద్యామంత్రి అయితే బావమరిదికి పర్మిషన్లు అవసరమా. వైఎస్ జగన్ సూచన మేరకు నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యాసంస్థలకి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే పురుడుపోసుకుంది. దీనికి వచ్చిన మద్దతు చూసుకుని జగన్ తన ప్రజాసంకల్ప యాత్రలో ఇదే అంశంపై ఫోకస్ పెంచారు. అడుగడుగునా విద్యావ్యాపారంపై మండిపడుతున్నారు.

బాధితులంతా ఏకమై జగన్ కి మద్దతు తెలిపితే ఫలితం ఒక రేంజ్ లో ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో, ప్రతి కుటుంబం నంచి ఎవరో ఒకరు కార్పొరేట్ స్కూల్ లేదా కాలేజీల్లో చదువుకుంటున్నవారే. స్థోమత ఉన్నా లేకున్నా.. వీరంతా లక్షలకు లక్షలు కట్టేవాళ్లే. జగన్ అధికారంలోకి వస్తే ఫీజుల విషయంలో వీరందరికీ ఊరట లభించే అవకాశం ఉంది. ఒకరకంగా ఇప్పటి వరకూ జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలకంటే ఫీజుల తగ్గింపే ఆయనకు ఎన్నికల్లో మరో కీలక అస్త్రంగా మారే అవకాశముంది.

మరోవైపు ప్రభుత్వ జీవో ప్రకారమే ఫీజులు వసూలు చేయాలంటూ కార్పొరేట్ విద్యాసంస్థలకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు కోర్టు మెట్లెక్కబోతున్నారు. కోర్టు జోక్యం చేసుకుంటే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టే. మంత్రి నారాయణ విద్యాసంస్థలకు ఇది చాలా పెద్దదెబ్బ. ఇక తాముకట్టిన ఫీజుల కోసం ఇప్పటిదాకా మోసపోయన తల్లిదండ్రులు తిరగబడ్డారా..? అంతే సంగతులు, కార్పొరేట్ కాలేజీలు కూడా బోర్డ్ తిప్పేయాల్సిన రోజు వస్తుంది.

సో.. ఒకేదెబ్బకు రెండుపిట్టలు. ఒకటి నారాయణ నడ్డివిరచడం, రెండోది మధ్యతరగతి ఓటు బ్యాంక్ ని తనవైపు తిప్పుకోవడం. జగన్ స్ట్రాటజీ ఏరేంజ్ లో వర్కవుట్ అవుతుందో వేచిచూడాలి.