Advertisement


Home > Politics - Gossip
జగన్‌తో మోడీ దోస్తీ దేనికి సంకేతం?

దాదాపు నెలరోజుల క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లి రెండు రోజులకు పైగా బస చేసినప్పటికీ ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ లభించలేదు. అప్పుడు ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి పార్టీ ఫిరాయింపుదారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తన పార్టీకి రాజీనామా చేయకుండా తెలుగుదేశంలో చేరిన వారికి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిపదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేయడమేనని జగన్‌ రాష్ట్రపతికి చెప్పారు. తర్వాత ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌ను, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులను కలుసుకున్నారు. కాని దాదాపు రెండురోజుల పాటు ఢిల్లీలో ఉన్నప్పటికీ జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ లభించలేదు. చంద్రబాబు అవినీతి భాగోతం గురించి కూడా జగన్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వివరించారు.

సరిగ్గా నెలరోజుల తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇస్తూ ఫోన్‌ వచ్చింది. జగన్‌ మళ్లీ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని జగన్‌ను చిరునవ్వుతో పలకరించారు. దాదాపు 40నిమిషాల పాటు జగన్‌ చెప్పింది విన్నారు. చంద్రబాబు అవినీతి గురించి జగన్‌ ఇచ్చిన డాక్యుమెంట్లను స్వీకరించారు. తన పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్‌ సహా తెలుగుదేశం మంత్రులు, నేతలు అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, వారిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన ప్రధానిని కోరారు. చంద్రబాబు ప్రత్యక్షంగా ఓటుకు నోటు కుంభకోణంలో ఇరుక్కున్నారని సుప్రీంకోర్టు ముందు ఆ కేసు విచారణకు రానున్నదని తెలిపారు. అంతా విన్న ప్రధాని రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థికి మద్దతునీయమని వైసీపీ నేతను కోరారు. అందుకు జగన్‌ అంగీకరించారు.

ఆ తర్వాత జగన్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునిస్తామని చెప్పారు. అధికారపార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలుంటాయని, రాష్ట్రపతి వంటి ఉన్నత పదవికి పోటీ అవసరం లేదని తాను భావిస్తున్నానని జగన్‌ చెప్పారు. గతంలో కూడా తాను అధికార పార్టీ అభ్యర్థికే మద్దతునిచ్చానని జగన్‌ చెప్పారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి పోటీచేసినా గెలిచే అవకాశాలు లేవని ఆయన అన్నారు. నెలరోజుల క్రితం జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని నరేంద్రమోడీ ఇప్పుడు ఎందుకు జగన్‌ను పిలిపించారు? ఇందుకు కారణాలు లేకపోలేదు. వచ్చేనెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా లేదా భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రధానమంత్రి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాను సూచించిన అభ్యర్థి  ఎవరైనా మెజారిటీ పార్టీలు మద్దతునిచ్చేందుకు ఆయన పావులు కదుపుతున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంపై నరేంద్రమోడీ చాలారోజుల క్రితమే చర్యలు ప్రారంభించారు. గత నెలలోనే ఆయన ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్‌, వామపక్షాలు, జెడి(యు), తృణమూల్‌తో పాటు ఒకటి రెండు చిన్నాచితక పార్టీలు తప్ప తమ పార్టీ అభ్యర్థిని ఎవరూ వ్యతిరేకించని పరిస్థితిని ఆయన కల్పించదలుచుకున్నారు. ప్రతిసారీ బీజేపీ అభ్యర్థిని వ్యతిరేకించే శివసేన కూడా ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునిచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా స్వచ్చందంగా ఇప్పటికే మద్దతుని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రసమితికి కూడా వేరే అభిప్రాయాలు ఉండే ఆస్కారంలేదు.

నిజానికి బీజేపీ వృద్దనేత లాల్‌కృష్ణ అద్వానీనే అభ్యర్థిగా నిలబెట్టదలుచుకుంటే నరేంద్రమోడీ ఇంత ఎక్సర్‌సైజ్‌ చేయనక్కర్లేదు. అద్వానీపై ఉన్నట్లుండి బాబ్రీ మసీదు విధ్వంసానికి చెందిన కేసును సుప్రీం చేపట్టడంతో అద్వానీని నిలబెట్టే అవకాశాలు తగ్గిపోయాయి. ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి న్యాయస్థానం బోనులో నిలుచోవడం అన్నది ఊహించలేని సంగతి. కనుక నరేంద్రమోడీ నిలబెట్టే అభ్యర్థి పూర్తిగా వినూత్నంగా ఉండే అవకాశాలున్నాయి. ఆ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికి అమిత్‌ షా, మోడీలకు మాత్రమే తెలుసు. సంఘ్‌ పరివార్‌ను కూడా విశ్వాసంలోకి తీసుకుని ఉండవచ్చు. రాష్ట్రపతి ఎన్నికయ్యే వ్యక్తి మోడీకి కీలకం. ఎందుకంటే మోడీ ఏ కీలక నిర్ణయమైనా తీసుకుంటే రాష్ట్రపతి నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండకూడదు. సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతి మోడీతో పాటు క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలూ ఏర్పడవచ్చు. పాకిస్తాన్‌ మనతో చెలగాటమాడుతున్న రీత్యా రాష్ట్రపతి పాత్రను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌నే మళ్లీ రాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశాలూ కూడా దాదాపు తక్కువే. రాకరాక వచ్చిన అవకాశాన్ని బీజేపీ ఏమాత్రం వదులుకోదు. దేశ చరిత్రలో ఒక సంఘ్‌ పరివార్‌కు చెందిన వ్యక్తి రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టడం రాష్ట్రపతి భవన్‌లో కాషాయ ధ్వజం ఎగురవేయడంతో సమానం. దీన్ని ఎలా వదులుకుంటుంది? అందుకే అత్యంత విలువైన ఈ పదవిలో తమ వ్యక్తిని నిలబెట్టుకోవడం కోసం మోడీ ఆచి తూచి ఎత్తులు వేస్తున్నారు.

అయితే జగన్‌ను పిలిచి మరీ ఆప్యాయంగా మాట్లాడడం మాత్రం కొంత ఆలోచించదగ్గ విషయమే. అధికారంలో లేని ఏ పార్టీ నేతతోనూ మోడీ ఇలా మాట్లాడలేదు. నితీష్‌ కుమార్‌, మమతా బెనర్జీ లాంటి వారిని మోడీ కలుసుకోవడం అనేది ఊహించని విషయం. చంద్రబాబునాయుడుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చే విషయంలో కూడా మోడీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏడాదికి మహా అయితే మూడో నాలుగుసార్లు మోడీని చంద్రబాబు కలుసుకోగలుగుతున్నారు. అలాంటి వ్యక్తి ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నేతను కలుసుకోవడం అందునా తన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతతో చర్చించడం సామాన్యమైన విషయం కాదు.

జగన్‌ తనను ఎందుకు కలుస్తున్నారో నరేంద్రమోడీకి తెలియనిది కాదు. చంద్రబాబు అవినీతి, ఫిరాయింపుదారులను ప్రోత్సహించడం గురించి చెప్పడానికే జగన్‌ ఢిల్లీ వస్తున్నారని మోడీకి సమాచారం ఉన్నది. అయినప్పటికీ జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఎందుకు ఇచ్చారు? ఒక బీజేపీ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడానికి ఎవరైనా వస్తే మోడీ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా? చంద్రబాబుపై మోడీకి మోజు తగ్గిందనడానికి ఇది నిదర్శనం. రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు ఎన్డీఏకు ఎలాగూ మద్దతు ఇవ్వకుండా ఉండలేరు. అయినపప్పటికీ చంద్రబాబును ఆయన వదిలించుకోవడానికి ఎదురు చూస్తున్నారనడానికి జగన్‌ను కలుసుకోవడమే నిదర్శనం.

నిజానికి చంద్రబాబు గురించి మోడీకి పూర్తి సమాచారం ఉన్నది. రాష్టం పూర్తిగా అవినీతి సామ్రాజ్యంగా మారడం, ఒకవర్గం వారినే ప్రోత్సహించడం, వారసత్వపాలనను ప్రోత్సహించడం గురించి మోడీకి వివరాలు ఎప్పుడో అందాయి. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి కూడా మోడీకి తెలుసు. అందుకే లెక్కలు చూసేందుకు ఆయన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా చంద్రబాబు అమెరికా వెళ్లడం, అక్కడ ఆయన ఎన్‌ఆర్‌ఐల నుంచి నిధులు సేకరించడం గురించి మోడీకి తెలిసింది.

అందువల్ల జగన్‌తో అపాయింట్‌మెంట్‌ కేవలం రాష్ట్రపతి ఎన్నికతోనే ముడివడిందని చెప్పడానికి వీలులేదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తనంతట తాను గెలిచే అవకాశాలు లేవని, ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మోడీకి తెలుసు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీచేయడం కన్నా జగన్‌తో చేతులు కలపడం వల్లే లాభాలు ఎక్కువన మోడీకి తెలుసు. జగన్‌కు కూడా బీజేపీకి వచ్చే లోక్‌సభలో అత్యధిక లోక్‌సభ సీట్లు ఇవ్వడం వల్ల పోయేదేమీలేదు. తనకు ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు విషయంలో తప్ప బీజేపీతో పెద్దగా విభేదాలు ఏమీలేవని జగన్‌ కూడా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇస్తామని కూడా జగన్‌ ప్రకటించారు. మోడీని జగన్‌ కలుసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామమని చెప్పకతప్పదు. చంద్రబాబు సరిగా పావులు కదపకపోతే ఆయన చాప క్రిందకు నీళ్లురావడం ఖాయం.