Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ పై జేసీ కోపం..రీజన్ అదే!

జగన్ పై జేసీ కోపం..రీజన్ అదే!

మొన్నామధ్య జగన్ తమ వాడంటూ మాట్లాడాడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి పాలన వంద రోజులు పూర్తి అయిన తరుణంలో దివాకర్ రెడ్డి మాట్లాడుతూ చాలా పాజిటివ్ గా స్పందించేశారు. జగన్ మోహన్ రెడ్డి బాగా పాలిస్తున్నాడంటూ ప్రకటనలు ఏవో చేశారు. జగన్ దొరికిన సమయం ఇంకా తక్కువేనంటూ.. ఇంతలోనే బాగా పాలిస్తున్నాడంటూ కితాబిచ్చారు దివాకర్ రెడ్డి.

కట్ చేస్తే తాజాగా మీడియా ముందుకు వచ్చి దివాకర్ రెడ్డి మరో ప్రకటన చేశారు. అదేమిటంటే.. జగన్ కు పాలనానుభవం లేదట! ఇది మళ్లీ పాత పాటే. జగన్ కు పాలనానుభవం లేదని జనాలకు కూడా తెలుసు. అయినా ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిగా చేశారు. తెలుగుదేశం పార్టీని చిత్తు కింద ఓడించి, దేశంలోనే అత్యంత సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబును ఓడించి, జేసీ కుటుంబీకులను కూడా ఓడించి జనాలు జగన్ ను ముఖ్యమంత్రిగా చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ పాలనానుభవం లేదంటూ మాట్లాడటం జేసీకే చెల్లింది.

అయినా నెల కిందట జగన్ బాగా పాలిస్తున్నాడని చెప్పి.. ఇప్పుడు ఆయనకు పాలనానుభవం లేదంటూ మాట్లాడారు దివాకర్ రెడ్డి. దీని వెనుక వేరే కథ ఉంది. అప్పుడేమో జగన్ ను ప్రసన్నం చేసుకుందామని దివాకర్ రెడ్డి అలా మాట్లాడారు. ఎలాగూ జగన్ ప్రసన్నం అయ్యేలా లేడని ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఈ సీనియర్ రాజకీయ నేత!

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని గట్టిగా నమ్మిన వారిలో జేసీ ఉన్నారు. అందుకే ఆఖరికి తన కులం జనాల ఆత్మగౌరవాన్ని కూడా చంద్రబాబు  దగ్గర తాకట్టు పెట్టే మాటలు మాట్లాడారు. తన పని జరిగితే చాలనుకున్నారాయన. అయితే ఆ మాటలు జనాలకు బాగా విసుగు తెప్పించాయి. దీంతో ఆయన కుటుంబీకులందరినీ ఓడించారు.

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు, అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు ఓడిపోయారు. అలా వీరికి చెక్ పడింది. అలాంటి షాకింగ్ రిజల్ట్ వచ్చే సరికి దివాకర్ రెడ్డి కూడా మారు మాట్లాడలేకపోయారు. జగన్ కు తెల్లజెండా చూపించే ప్రయత్నం చేశారు. అందుకే జగన్ వంద రోజుల పాలన పూర్తి అయినప్పుడు చాలా పాజిటివ్ గా మాట్లాడారు.

అయితే ఇంతలోనే మరి కొన్ని పరిణామాలు జరిగాయి. అందులో ఒకటి మైనింగ్ వ్యవహారాల్లో జేసీ సోదరులకు ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్లాయి. ఇక జేసీ ట్రావెల్ దందాకు కూడా ఝలక్ తగిలింది. ఇరవై మూడు బస్సులను సీజ్ చేశారు అధికారులు. పర్మిట్లు లేకుండా నడుపుతున్న బస్సులకు అలా చెక్ పడింది. జేసీ వ్యాపార సామ్రాజ్యంలో బస్సులు అత్యంత ముఖ్యమైనవి.

ఇవి సహజంగానే దివాకర్ రెడ్డికి చికాకుగా మారాయి. ఇలాంటప్పుడు జగన్ ను పొగడలేరు  కదా దివాకర్ రెడ్డి. అందుకే  ‘జగన్ కు పాలనానుభవం లేదు.’ అని తేల్చేశారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జేసీ దివాకర్ రెడ్డి అక్రమ దందాలకు అడ్డు రాకపోయి ఉంటే.. అప్పుడు జగన్ పాలన జేసీకి చాలా బాగా అనిపించేది. ‘జగన్ మావాడు అంటూ..’ మరోసారి ప్రకటించుకునే వాళ్లు. జగన్ నుంచి పాజిటివ్ రియాక్షన్స్ లేకపోవడంతో.. ఇప్పుడు జగన్ పాలన బాగోలేదని తేల్చారు.

తన  విషయంలో ఎవరు ఎలా వ్యవహరిస్తారనేదాన్ని బట్టే  దివాకర్ రెడ్డి మాటలు ఉంటాయి. అంతకు మించి ఎలాంటి విలువల్లేని రాజకీయ నేత ఈయన అనేది తాడిపత్రి జనాలకు కూడా ఇప్పటికే తెలిసిపోయింది. ఇక తమ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరే వాళ్లు కేసులకు భయపడే చేరుతున్నారని కూడా జేసీ ప్రకటించారు. ఇది మరో కామెడీ. చంద్రబాబు నాయుడే తన వాళ్లను బీజేపీలోకి పంపుతున్నారు. జేసీ కూడా బీజేపీలోకి చేరతారనే ప్రచారమూ ఉంది.

ఈ తరుణంలో జేసీ మళ్లీ పార్టీ మార్పుల గురించి కూడా నీతులు చెబుతూ ఉన్నారు. అలా అయితే మైనింగ్ కేసులు, ట్రావెల్ కేసులు చుట్టుకుంటే జేసీ కూడా పార్టీ మారతారు కాబోలు..ఆయన మాటల ప్రకారమే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?