cloudfront

Advertisement


Home > Politics - Gossip

జనసేన గెలుపుపై టీడీపీ అత్యుత్సాహమేంటో.!

జనసేన గెలుపుపై టీడీపీ అత్యుత్సాహమేంటో.!

100 సీట్లకు పైగా గెలిచేస్తామంటూ తెలుగుదేశం పార్టీ నానాయాగీ చేస్తోంది తన అనుకూల మీడియా సంస్థల ద్వారా. ఓ పక్క 'మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం..' అని ధీమాగా వున్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే, ఇంకోపక్క ఎన్నికల కమిషన్‌ మీదా, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లపైనా టీడీపీ సృష్టిస్తోన్న గందరగోళం అంతా ఇంతా కాదు. అఫ్‌కోర్స్‌, చంద్రబాబు రాజకీయాల గురించి తెలిసినవారికి ఇది మరీ ఏమంత 'విచిత్రం'గా అన్పించకపోవచ్చనుకోండి.. అది వేరే విషయం.

తన గెలుపు గురించి ధీమాగా చెబుతున్న టీడీపీ, చిత్రంగా జనసేన గెలుపు మీద కూడా పాజిటివ్‌గానే వ్యవహరిస్తుండడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలోనే నాలుగు నుంచి ఐదు సీట్ల వరకు జనసేన గెలిచే అవకాశం వుందంటూ టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పిన విషయం ఒకటి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 'అదేంటీ, జనసేన గెలుపు గురించి టీడీపీ ముఖ్యనేత ఎలా పాజిటివ్‌గా మాట్లాడతారు.?' అని ఇంకొందరు టీడీపీ నేతలు గుస్సా అవుతున్నారనుకోండి.. అది వేరే విషయం.

'టీడీపీకి 100 సీట్లు రావాలి, జనసేనకి ఓ 20 నుంచి 30 సీట్లు రావాలి.. అలా వస్తే, ఏపీ రాజకీయాల్లో జగన్‌ ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది.. పార్టీ ఫిరాయింపులతో వైఎస్సార్సీపీని పూర్తిగా నిర్వీర్యం చేసెయ్యాలి..' అన్నది టీడీపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఓటరు తీర్పు ఏంటన్నది ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో నిక్షిప్తమైపోయింది. ఇప్పటిదాకా వెలుగు చూసిన ఏ సర్వే కూడా అధికారం వస్తుందని చెప్పలేదు. 70 సీట్లు కూడా టీడీపీకి ఏ సర్వే ఇవ్వకపోవడం గమనార్హం.

దాదాపుగా అన్ని సర్వేలూ వైఎస్సార్సీపీకి క్లియర్‌ మెజార్టీని కట్టబెట్టేశాయి. జనసేన పరిస్థితి అయితే అత్యంత దారుణమని చెబుతూ, ఆ పార్టీని చాలా సర్వేలు పట్టించుకోవడమే మానేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం జనసేనకు ఒకటి లేదా రెండుసీట్లు రావొచ్చని పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ తన గెలుపుతోపాటు, జనసేన గెలుపునీ కాంక్షించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి వుండదు. అన్నట్టు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అయితే, చంద్రబాబు మనసుకి గాయం అవకుండా రాజకీయ విమర్శలు 'మమ' అన్పించేశారు.

ఒక్కటి మాత్రం నిజం.. టీడీపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది.. అధికారం దక్కదని ఆ పార్టీకి అర్థమయిపోయింది.. హంగ్‌ వస్తే, పవన్‌కళ్యాణ్‌ని మచ్చిక చేసుకోవడం ద్వారా అధికారం చేజిక్కించుకునే అవకాశం వుంటుందా.? అని మాత్రమే టీడీపీ ఆలోచిస్తున్నట్తుందిప్పుడు. భావదారిద్య్రం అంటే ఇదేనేమో.!

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!