Advertisement


Home > Politics - Gossip
జనసేన... ఓ కుట్ర కహానీ

జనసేన పార్టీ నుంచి రెండు ప్రకటనలు బయటకు వచ్చాయి. ఒకటి పార్టీ నేత పవన్ కళ్యాణ్ నిరంతర పర్యటన కార్యక్రమం గురించి, ఇందులో అంతగా విశేషాలు లేవు. జస్ట్ టూర్ స్టార్ట్ చేయబోతున్నారని వుంది. ఎప్పుడు? ఎలా? ఏ విధంగా? అన్న వివరాలు తరువాత. అంటే ఒక విధంగా సినిమాకు మైక్రో టీజర్ మాదిరిగా ప్రకటన ఇచ్చారు. ఇంకా టీజర్లు, ట్రయిలర్లు, సినిమా బకాయి వుండనే వున్నాయి.

ఇక మరో పక్కన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఇచ్చింది. ఇది కూడా పవన్ కు తెలియకుండా, డ్రాఫ్ట్ కాపీ ఆయన చూడకుండా ఇచ్చి వుంటారనుకోవడానికి లేదు. ఎందుకుంటే జనసేన పార్టీలో ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీలో కన్నా ఎక్కువగా ఫరిఢవిల్లుతోంది. అక్కడ ఏం జరిగానా పవన్ కనుసన్నలలోనే. అందువల్ల ఈ ప్రకటన పూర్తిగా పవన్ కు తెలిసే వుంటుంది.

ఇంతకీ ప్రకటనలో ఏముంది? కొన్ని శక్తులు, కొంతకాలంగా జనసేన శ్రేణులను, పవన్ అభిమానులను గందరగోళ పర్చడానికి యత్నిస్తున్నాయి. జనసేనపై కుట్రలు జరుగుతున్నాయి. అనే కదా?

సరే, ఇంతకీ జనసేనకు శతృవులు ఎవరు? ఆ పార్టీ ఆంధ్రలో అధికార తెలుగుదేశంతో మంచిగానే వుంది. జనసేన ఏమీ అడక్కుండానే పనులు జరుగుతున్నాయి. జనసేనాధిపతి సినిమా కోసం ఎప్పుడూ లేనిది 24గంటల పాటు, వారం రోజులు థియేటర్ల గేట్లు తెరిచి వుంచేలా జీవో ఇచ్చారు. ఇక తెలంగాణలో తెరాసతో కూడా జనసేన మంచి సంబంధాలతోనే వుంటోంది. పవన్ స్వయంగా వెళ్లి కేసిఆర్ ను అభినందించి వచ్చారు.

ఇక కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా మగత నిద్రలో వుంది తప్ప, పోరాడేంత సీన్ లేదు. మిగిలింది వైకాపా. ఆ పార్టీ నేరుగా జనసేనకు శతృపక్షమే. కాదనడానికి లేదు. కానీ ఏనాడూ పవన్ పై వైకాపా పల్లెత్తు విమర్శ చేయలేదు. పవన్ ఆయనంతంట ఆయన అజ్ఖాతవాసి ముందు చేసిన రాజకీయ పర్యటనలో జగన్ మీద నేరుగా విమర్శలు చేసారు. అప్పుడు కూడా వైకాపా పెద్దగా ప్రతి విమర్శలు చేయలేదు. ఖండించాలి కాబట్టి ఖండించినట్లు వ్యవహరించాయి. ఒక వైకాపాకు జనసేనపై కోపం వుంటే, అది నేరుగా ఫైట్ చేసేయవచ్చు. ఎందుకుంటే శతృపక్షమే కాబట్టి.

కుట్ర అనేది ఎవరు చేస్తారు? తాము చేస్తున్నట్లు తెలియకూడదు అనుకునేవారు ? అంటే ఎవరై వుంటారు?

సోషల్ మీడియా

అజ్ఞాతవాసి సినిమా మీద భయంకరమైన సోషల్ మీడియా దాడి జరిగింది. అది వాస్తవం. సినిమా విడుదలయిన మరుక్షణం నుంచి విడియో క్లిప్ లు, ఫోటో షాప్ పిక్చర్లు, చిన్న చిన్న సెటైర్ రచనలు తెగ చలామణీ అయిపోయాయి. అటు ఫేస్ బుక్ లో, ఇటు వాట్సప్ లో. సినిమా బాగా లేదు. అది వాస్తవం. అలాంటపుడు మామూలు జనాలు అయితే సింపుల్ గా ఓ రెండు వాక్యాలు రాసి పోస్ట్ చేస్తారు. వాట్సప్ లోనో, ఫేస్ బుక్ లోనో. అంతే తప్ప, తమ సృజన అంతా వాడి, ఎప్పటివో పాత సినిమాల క్లిప్ లు తీసి, ఎడిట్ చేసి, జన రంజకంగా తయారు చేసి, అటు ఇటు తెగ సర్క్యులేట్ చేయరు.

సోషల్ మీడియా వ్యవహారాల్లో ఆరితేరిన వారే చేయగలరు. అలాంటి సాధన సంపత్తి తెలుగుదేశం పార్టీకి వున్నంతగా మరే పార్టీకి లేదు. అది నూటికి నూరు పాళ్లు అంగీకరించాల్సిన విషయం. ఎంత తెలుగుదేశం పార్టీకి మద్దతు దారుగా వున్నా పవన్ ను కమ్మ సామాజిక వర్గం ఆమోదించదన్నది అందరికీ తెలిసిన విషయమే. పవన్ మరీ ఎదిగిపోతే తమ అభిమాన పార్టీకి కష్టమే అన్నది ఆ వర్గానికి తెలిసిన విషయమే.

మరో పక్క వెస్ట్ గోదావరిలో ప్రభాస్ ఫ్యాన్స్ కు, పవన్ ఫ్యాన్స్ కు బేధాలు వున్నాయని, వాటి వెనుక సామాజిక వర్గ ఈక్వేషన్లు కూడా వున్నాయన్నది విదితమే. నేరుగా పవన్ నే ఈ విషయంలో ఓ ఎంపీ మీద విమర్శలు చేసారు.

ఇలా జనసేన మీద ఓ పార్టీగా కన్నా, కులాల ఈక్వేషన్లతోనే కుట్ర పన్నే అవకాశాలు ఎక్కువగా వున్నాయన్నదాన్ని ఎవ్వరూ ఖండించలేరు.

ఆ చానెళ్లు ఎవరివి?

తెలుగునాట టీవీ 9, ఎబిఎన్ చానెళ్లు ఎవరి మద్దుతు దారులు అని కామన్ ఓటర్ ను ఎవరిని అడిగినా ఇట్టే సమాధానం వస్తుంది. ఆ రెండు చానెళ్లు తెలుగుదేశం మద్దతుగా వుంటాయని. ఇక మహా టీవీ ఎవరిది? సాక్షాత్తూ తెలుగుదేశం ప్రముఖుడు సుజనా చౌదరిది. ఇటీవలే దానిని తెలుగుదేశం నేతలు కొందరు కలిసి టేకోవర్ చేసారని వార్తలు వున్నాయి.

మరి ఇప్పుడు జనసేనపై కానీ, పవన్ పై కానీ దాడి చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కత్తిమహేష్ కు అండగా నిలిచింది ఈ చానెళ్లే కదా? జనసేన వీక్ అయితే వైకాపాకు మంచి జరుగుతుందని తెలిసీ ఇలా ఎందుకు చేసినట్లు? కేవలం టీఆర్పీల కోసం అయితే కాదు. పోనీ కత్తి మహేష్ కు భయంకరమైన అన్యాయం జరిగింది. అందుకే అండగా నిలిచాయి అనుకోవడానికీ లేదు.

పైగా కత్తి మహేష్ అపారవిజయం సాధించారన్నట్లుగా, దండలు, శాలువాలు హడావుడి చానెళ్లలో. అంటే ఎవరిమీద విజయం సాధించాడని ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు? ఎందుకు ప్రొజెక్ట్ చేయదలుకున్నారు?

కాపులకు రెండో దెబ్బ?

ఒక విధంగా కాపులకు ఇది రెండో దెబ్బ. మొదటి దెబ్బ ముద్రగడ పద్మనాభం మీద పడింది. ప్రభుత్వం ఆయన పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. కానీ కాపులు తమ బలం చూపించలేకపోయారు. ఇదేం అన్యాయం అని అడగలేకపోయారు.

ఇప్పుడు పవన్ వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమం కొంత వరకు జరిగినట్లు కనిపిస్తోంది. అయినా ఒక్క కాపునాయకుడు గొంతు ఎత్త లేకపోయారు.

ఇప్పుడు భవిష్యత్ లో ఏం జరుగుతుంది? నిజంగా పవన్ ఒంటరి పోరు ప్రారంభిస్తే, తెలుగుదేశం పార్టీ ఈ చానెళ్లలో వినిపించిన ఆరోపణలు, విడియో క్లిప్ లు బయటకు తీస్తుంది. తామేం అనలేదు. అన్నవాళ్ల మాటలు వినండి అంటుంది. అవే ప్రచార అస్త్రాలుగా వాడుతుంది.

ఇప్పుడు చెప్పండి బ్రదర్.. కుట్ర ఎవరిది? ఎవరిపై? ఎందుకు? ఎలా? ఇందులో టూల్ గా ఉపయోగపడింది ఎవరు? టూల్ ను వాడింది ఎవరు? పని ఏమిటి? ఫలితం ఏమిటి?

-ఆర్వీ