Advertisement


Home > Politics - Gossip
తెలుగు రాష్ట్రాల్లో 'గుడ్‌ పార్టీ' దొరుకుతుందా?

రాజకీయ నాయకులకు ఎప్పుడూ ఒడిదొడుకులు ఉంటూనే ఉంటాయి. ఒక పార్టీలో భవిష్యత్తు లేదనుకుంటే మరో పార్టీని వెదుక్కుంటారు. రాజకీయాల్లో కంటిన్యూగా ఉండటానికి ఏదో ఒక పార్టీ కావాలి. అది సొంత రాష్ట్రమైనా, పొరుగు రాష్ట్రమైనా కొందరు పట్టించుకోరు. ఈ కోవలోకి ఒకప్పటి అందాల తార కమ్‌ సీనియర్‌ రాజకీయ నాయకురాలు కమ్‌ మాజీ ఎంపీ జయప్రద వస్తుంది.

రాజకీయ అరంగేట్రం చేసింది ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో అయినప్పటికీ రాజకీయాల్లో తారగా వెలిగిందీ, దీర్ఘకాలంగా ఎంపీగా ఉన్నది మాత్రం ఉత్తరప్రదేశ్‌లో. ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగి అయిన జయప్రద 'ఐ యామ్‌ వెయింటింగ్‌ ఫర్‌ ఎ గుడ్‌ పార్టీ' అని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ గుడ్‌ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో వెతికే పనిలో ఉంది. మళ్లీ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడి రాజకీయాల్లో ఆజంఖాన్‌తో గొడవలు పడలేనని, ఇప్పటివరకు చేసిన పోరాటం చాలని చెప్పింది. సో... ఆమె యూపీ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లే అనుకోవాలి.

2019 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోగా సినిమాల్లో నటిస్తుందట. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలియదుగాని సినిమాల్లో బిజీగా ఉన్నానని అంటోంది. తెలుగు రాజకీయాల్లో ఉండాలని జయప్రద సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆమెను ఏదో ఒక పార్టీలో చూడొచ్చు. యూపీ రాజకీయాల్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి ఏపీకి వచ్చిన సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రశంసలతో ముంచెత్తింది.

ఒకవేళ తెలుగు రాజకీయాల్లోకి వస్తే టీడీపీలో చేరుతుందేమోనని అనిపించేలా మాట్లాడింది. కాని తాజా ఇంటర్వ్యూలో 'ఎన్టీఆర్‌గారికి నా మీద ఉన్నంత అభిమానాన్ని చంద్రబాబుగారి నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేయలేను' అని చెప్పింది. ఆమె ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో కొంతకాలం రాజకీయాలు చేసి ఉత్తర భారతానికి వెళ్లిపోయింది. ఆ తరువాత ఇటువైపు తిరిగి చూడలేదు.

మళ్లీ తెలుగు రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆలోచన వచ్చేసరికి రాష్ట్రం రెండు ముక్కలైంది. ఇప్పుడామె రాష్ట్రం కూడా ఎంచుకోవల్సివుంటుంది. ఆమె ఏపీలోని రాజమండ్రికి చెందింది కాబట్టి గుడ్‌ పార్టీని అక్కడే ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రాన్ని వదిలేసి చాలా ఏళ్లయిపోయిన నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలను ఆమె అర్థం చేసుకోగలదా? రాజకీయాల్లో సీనియర్‌ అయినప్పటికీ విభజన తరువాత తొలిసారిగా తెలుగు రాజకీయాల గురించి ఆలోచిస్తోంది కాబట్టి ఇక్కడ కొత్తగా అరంగేట్రం చేస్తున్నట్లే లెక్క.

మరి ఆమె దృష్టిలో గుడ్‌ పార్టీ ఏదో, ఆమె అనుకున్న పార్టీ ఆదరిస్తుందో లేదో వేచి చూడాలి. కొంతకాలం కిందట  'నేను ఏ పార్టీలోనైనా చేరడానికి సిద్ధంగా ఉన్నాను' అంటూ బహిరంగంగా చెప్పడాన్నిబట్టి చూస్తే ఉద్యోగం తక్షణం అవసరమనిపిస్తోంది. పార్టీలకు ఆమె అవసరం ఉందో లేదో చెప్పలేంగాని పార్టీలతో ఆమెకు అవసరముంది.

ఏ పార్టీలోనైనా సిద్ధంగా ఉన్నానని ఓపెన్‌గా ఆఫర్‌  ఇచ్చినప్పటికీ 'నన్ను గౌరవంగా ఆహ్వానించాలి' అని మెలిక పెట్టింది. అంటే తనను చేర్చుకునే పార్టీ తనకు సముచితమైన స్థానం ఇవ్వాలని, తగిన పదవి ఇవ్వాలని పరోక్షంగా చెప్పిందన్నమాట. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించినప్పుడు   బీజేపీ వైపు చూపు సారించిందనే భావన కలిగింది. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్లయితే అందులో చేరేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తుందేమోనని విశ్లేషకులు అనుకున్నారుగాని ఆ దాఖలాలు కనబడలేదు. ఒకదశలో  తెలుగు రాజకీయాల్లోకి (ఉమ్మడి రాష్ట్రంలో) వస్తారనే సంకేతాలు వచ్చాయి.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈవిధమైన వార్తలొచ్చాయి. తనకు సొంత ఊరైన రాజమండ్రి నుంచి పోటీ చేయాలనుందని కూడా ఒకసారి  చెప్పింది. మరోసారి టీడీపీలో చేరుతుందని పుకార్లు వచ్చాయి.  కారణాలేవైనా ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలకే అంకితమైంది. ఆ తరువాత ఎప్పుడూ (రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా) తెలుగు రాజకీయాల పట్ల ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. మళ్లీ ఇన్నాళ్లకు తన అభిప్రాయం చెప్పింది.