cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆ నలభై మందిలో మీరు లేరా రెడ్డిగారు!

 ఆ నలభై మందిలో మీరు లేరా రెడ్డిగారు!

మొన్ననే చంద్రబాబు గట్టిగా క్లాస్ వేశాడని వార్తలు  వచ్చాయి. జేసీ దివాకర్ రెడ్డికి బాబు గట్టిగా క్లాస్  పీకాడని.. పార్టీ నేతలతో సర్దుకుపోవాలి తప్ప అందరితోనూ గొడవలుపడితే బాగోదని బాబు  గట్టిగా చెప్పాడని అన్నారు. టీడీపీ వర్గాలే ఈ సమాచారాన్ని  ఇచ్చాయి. జేసీకి బాబు గట్టిగా క్లాస్ పీకాడని.. అనంతపురం ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కనీసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకుని వస్తే తప్ప జేసీ తనయుడికి టికెట్ ఇచ్చేది కూడా లేదని బాబు చెప్పాడని టీడీపీ వర్గాలు మీడియాకు సమాచారాన్ని చేరవేశాయి.

మామూలుగా చూస్తే అది గట్టి ఝలక్కే. వేరే వాళ్లు ఆ మాటలకు చిన్న బుచ్చుకుంటారు. అయితే అక్కడ ఉన్నది జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తీరేమీ మారలేదు. ఒకవైపు జేసీకి బాబు క్లాస్ అనే  ప్రచారం జరుగుతూ ఉండగానే.. జేసీ మళ్లీ అవే మాటలే మాట్లాడాడు.

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు నలభై మందిపై వ్యతిరేకత ఉందని జేసీ మరోసారి వ్యాఖ్యానించాడు. వాళ్లకు మళ్లీ టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని జేసీ తేల్చేశాడు. అనంతపురం ఎంపీ సీటు పరిధిలో కూడా అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారని.. వాళ్లను మార్చాలని వ్యాఖ్యానించాడు ఈ ఎంపీ. ఒకవైపు బాబు క్లాస్ పీకాడని ప్రచారం జరుగుతున్నా.. జేసీ మాత్రం పాత  మాటలనే  రిపీట్ చేశాడు.

టీడీపీ సిట్టింగుల పరిస్థితి ఏమంత బాగోలేదని.. వీళ్లకు టికెట్ ఇస్తే పార్టీ మునుగుతుందని అనడంతో పాటు.. తన ఎంపీ సీటు పరిధిలో కూడా ఎమ్మెల్యే  క్యాండిడేట్లను మార్చేయాలని మరోసారి గట్టిగా చెప్పాడు. బాబుకు జేసీ ఏ మాత్రం భయపడలేదు అనమాట! మరి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిట్టింగుల్లో జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్  రెడ్డిలు ఉన్నారో లేరో!