cloudfront

Advertisement


Home > Politics - Gossip

జేసీ: తాము చేస్తే శృంగారం.. వారు చేస్తే...

జేసీ: తాము చేస్తే శృంగారం.. వారు చేస్తే...

ఇదొక మొరటుసామెత.. తాముచేస్తే శృంగారం పరులు చేస్తే వ్యభిచారం అని పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశంలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు, అనంతపురం ఎంపీ అయిన జేసీ దివాకర రెడ్డి మాట్లాడుతున్న తీరు కూడా అచ్చంగా ఆ సామెత చందంగానే కనిపిస్తోంది.

ప్రత్యేకహోదా సాధించడం కోసం తమ పార్టీ ఎంపీలు అందరూ రాజీనామా చేయడానికైనా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందుకు డెడ్ లైన్ కూడా విధించిన నేపథ్యంలో.. తెదేపా వర్గాలు మొత్తం కంగారు పడుతోంటే.. జేసీ మాత్రం వెరైటీగా ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే ఇక్కడ మనం పైన చెప్పుకున్న సామెత నీతినే అనుసరిస్తున్నారు.

ఇప్పుడు ఎంపీలు రాజీనామా చేసినా కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదని, ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కూడా లేదని ఎంపీగారు తన జోస్యం చెబుతున్నారు. ఏప్రిల్ 6న ఎంపీలు రాజీనామా చేసినా.. వాటిని ఆమోదించడానికి రెండునెలల కనీస వ్యవధి పట్టవచ్చునని.. ఆ తర్వాత.. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి 6నెలల వ్యవధి ఉంటుందని.. ఆలోగా సార్వత్రిక ఎన్నికలే ముంచుకు వచ్చే అవకాశం ఉన్నదని ఆయన అంచనా వేశారు. అదంతా నిజమే కావచ్చు. కానీ నిన్నటిదాకా, ఇవాళ కూడా.. మేం రాజీనామాలు చేసేస్తాం అని తెలుగుదేశం నాయకులు పలికిన ప్రగల్భాల సంగతంతా ఏమిటి?

మొన్నటికి మొన్న బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అనుకునప్పుడు.. తెలుగుదేశం నాయకులు కూడా రాజీనామాల గురించి చాలా భీషణ డైలాగులు వల్లించారు. ముందు కేంద్రంనుంచి మంత్రుల్ని తప్పిస్తాం అని తర్వాత.. ఎంపీలు కూడా రాజీనామాలు సిద్ధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని.. వారు సెలవిచ్చారు. అన్ని రోజుల కిందకు వెళ్లడం కూడా అనవసరం.

తెదేపా మంత్రి దేవినేని ఉమా.. మంగళవారం నాడు కూడా మాట్లాడుతూ.. రాజీనామాలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం అని, అయితే రాజీనామాల విషయాన్ని పార్టీ అధినేత డిసైడ్ చేస్తారని సెలవిచ్చారు. వారి రాజీనామాల ఊసుల్లో నిజాయితీ ఎంతో తెలియడం లేదు.

అదంతా కూడా ఉత్తుత్తిదేనా? ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాజీనామాలు ఆమోదం పొందవు, పొందినా ఉప ఎన్నికలు రావు అనే నమ్మకంతోనే తెదేపా వారు కూడా రాజీనామాల పాట పాడారా, పాడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే రాజీనామాలు అనే మాటను ఇరు పార్టీలు పలుకుతున్నప్పటికీ.. జగన్ మాటలే కాస్త ఎడ్వాంటేజీ పొజిషన్ లో ఉన్నాయి. ఆయన తమ ఎంపీల రాజీనామాలకు డెడ్ లైన్ కూడా పెట్టారు. మరి తెలుగుదేశం వారి తీరు మాత్రం.. రాజీనామాలు అనే మాట చెప్పుకుంటూ.. మరికొంత కాలం సాగతీసే ఉద్దేశమే కనిపిస్తోంది.