Advertisement


Home > Politics - Gossip
జేసీ వార‌సులొస్తున్నారు

రాష్ర్ట రాజ‌కీయాల్లో జేసీ బ్రద‌ర్స్‌ది ప్రత్యేక శైలి. జ‌నం, నేత‌లు ఏమ‌నుకుంటార‌నేది వారికి ముఖ్యంకాదు. తాము ఏది అనుకుంటారో అదే మాట్లాడటం వారి నైజం. త‌మ అధినేత చంద్రబాబైనా, ప్రతిప‌క్షనేత జ‌గ‌న్ అయినా వారికి లెక్కలేదు. సీఎం ర‌మేష్  దీక్ష చేస్తే ఉక్కురాదు తొక్కరాదు అని నిర్మోహ‌మాటంగా చెప్పారు. త‌న రాజ‌కీయ భ‌విష్యత్‌పై కూడా అంతే స‌ర‌దాగా మాట్లాడుతుంటారు. ఈ నేప‌థ్యంలో 2019 సార్వత్రిక ఎన్నిక‌లు జేసీ వార‌సుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకురానున్నాయి. రాజ‌కీయాల నుంచి తాను త‌ప్పుకుంటున్నట్టు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి ప‌దేప‌దే చెబుతున్నారు.

రాజ‌కీయాల్లో కామెడీ షో చేస్తున్నట్టు అనిపించినా అనంత‌పురంలో మాత్రం క్షేత్రస్థాయిలో గ్రూపు రాజ‌కీయాల‌ను వారు సీరియ‌స్‌గానే చేస్తున్నారు. అలా చేయ‌క‌పోతే వారి మ‌నుగ‌డ కూడా ఇంత కాలం ఉండేదికాదు. జేసీ బ్రద‌ర్స్ తండ్రి నాగిరెడ్డి రాజ్యస‌భ స‌భ్యుడు. అంతేకాదు ఒకద‌ఫా జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా కూడా ప‌నిచేశారు. తండ్రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన రాజ‌కీయాల‌ను జేసీ దివాక‌ర్‌రెడ్డి అందిపుచ్చుకున్నారు.

టీడీపీ ఆవిర్భావ స‌మ‌యంలో రాజ‌కీయాల్లో ప్రవేశించిన దివాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి ఎం.కేశ‌వ‌రెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. బ‌హుశా ఆయ‌న‌కు అదే చివ‌రి ఓట‌మి కావ‌చ్చు. 1985 నుంచి కాంగ్రెస్ త‌ర‌పున వ‌రుస‌గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మ‌ర్రి చెన్నారెడ్డి, నేదురుమ‌ల్లి జ‌నార్దన్‌రెడ్డి, కోట్ల విజ‌య‌భాస్కర‌రెడ్డి, డాక్టర్ వైఎస్సార్ కేబినెట్‌లో ఆయ‌న వివిధ మంత్రిత్వశాఖ‌లు నిర్వహించారు. 2009లో మాత్రం ఆయ‌న వైఎస్సార్ త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకోలేదు.

రాష్ర్ట విభ‌జ‌నానంత‌రం ఆయ‌న కుటుంబం సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని టీడీపీలో చేరింది. 2014 ఎన్నిక‌ల్లో జేసీ దివాక‌ర్‌రెడ్డి అనంత‌పురం ఎంపీగా, ఆయ‌న తమ్ముడు జేసీ ప్రభాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల ర‌వితో జేసీ బ్రద‌ర్స్‌కు మొద‌టి నుంచీ పొస‌గ‌దు. ఒక్కసారి మాత్రం తాడిప‌త్రి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జేసీ వ‌ర్గీయులు క‌నీసం నామినేష‌న్ కూడా వేయ‌కుండా ప‌రిటాల ర‌వి అడ్డుకోవ‌డం వారికి చేదుజ్ఞాప‌కంగానే మిగిలింద‌ని చెప్పాలి.

ప్రస్తుతం 74ఏళ్ల జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌మ్ముడు ప్రభాక‌ర్‌రెడ్డి ప్రత్యక్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని త‌మ వార‌సుల‌ను ముందుకు తెచ్చేప‌నిలో ఉన్నారు. ఇప్పటికే జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు జేసీ ప‌వ‌న్‌రెడ్డి, జేసీ ప్రభాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు అస్మిత్‌రెడ్డి త‌మ పెద్దల నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజ‌ల‌కు చేరువ అవుతున్నారు. జేసీ ప‌వ‌న్ అనంత‌పురం ఎంపీ స్థానం నుంచి, అస్మిత్‌రెడ్డి తాడిప‌త్రి అసెంబ్లీ బ‌రిలో నిల‌వాల‌ని భావిస్తున్నారు.

ఫ‌లానా వారి కొడుకులుగానా, లేక ఫ‌లానా వారి తండ్రులు జేసీ బ్రద‌ర్స్ అనేలా త‌మ రాజ‌కీయ భ‌విష్యత్‌ను తీర్చిదిద్దుకుంటారా అనేది ప‌వ‌న్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి చేతుల్లోనే ఉన్నాయి.
-ఎస్వీఆర్ఆర్‌