cloudfront

Advertisement


Home > Politics - Gossip

రసవత్తరం.. టీడీపీకి జేసీ రాజీనామానా..!

రసవత్తరం.. టీడీపీకి జేసీ రాజీనామానా..!

ఒకవైపు నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఇంకా పెండింగ్ కథ చాలానే ఉంది. ఇదే సమయంలో నేతలు కూడా తమ తమ తుది నిర్ణయాలను ప్రకటించుకొంటూ వస్తున్నారు. కార్యకర్తలతో సమావేశం అవుతూ.. వారు రచ్చచేస్తూ ఉన్నారు. నామినేషన్ల పర్వం మొదలైన దశలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొన్ని గట్టి ఝలక్ లు తప్పవని తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటివరకూ ఓపెన్ గా ప్రకటించిన వారు కొందరున్నారు. వీరిలో ముందున్నారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తమ ఎంపీ సీటు పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింట తాము చెప్పిన వారిని అభ్యర్థులుగా నిలబెట్టకపోతే.. తన తనయుడు పోటీచేయడని, ఓడిపోవడానికి పోటీచేయడానికి తాము రెడీగా లేనట్టుగా జేసీ ప్రకటించారు.

ఈ హెచ్చరిక చేసేశారాయన. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ అక్కడ అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. ఇక్కడ అసలైన కథ ఏమిటంటే.. ఒకవేళ జేసీ చెప్పిన వారికే టికెట్లను కేటాయిస్తే.. సిట్టింగులు ఊరికే ఉండరు! వారు కచ్చితంగా రెబల్స్ గా రంగంలోకి దిగుతారు. ఈ రోజు నామినేషన్ వేయబోతున్నట్టుగా కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పేపర్ యాడ్ కూడా ఇచ్చేశారు.

పార్టీ తరఫునే నామినేషన్ అని ఆయన ప్రకటించుకున్నారు. టీడీపీలోనే ఈ చౌదరిపై తీవ్రంగా వ్యతిరేకత ఉంది. జేసీ కూడా ఈయన అభ్యర్థిత్వాన్ని వద్దు అంటున్నారు. అయితే హనుమంతరాయ చౌదరి మాత్రం నామినేషన్ వేస్తున్నారు ఈరోజు. ఇంకా అభ్యర్థుల ప్రకటన జరగలేదు.

అనంతపురం అర్బన్ కథా ఇదే. ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వాన్ని జేసీ గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చౌదరికి ఇవ్వకపోతే టీడీపీ అవకాశాలు తగ్గిపోతాయి. అంతేకాదు.. చౌదరి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినా ఆశ్చర్యంలేదు. గుంతకల్ కథా ఇదే. శింగనమల వ్యవహారమూ ఇదే. సిట్టింగులకు ఇవ్వకపోతే వారు తిరుగుబాటు చేస్తారు. ఇస్తే వారు ఓడిపోవడం ఖాయం, జేసీకి కూడా వాళ్లంటే అస్సలు పడటంలేదు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో మధ్య మార్గంగా జేసీ మాట మేరకు ఇద్దరిని తప్పించడం, ఇద్దరిని అలాగే పెట్టడం అనే ఫార్ములా ఒకటి వినిపిస్తోంది. గుంతకల్, శింగనమల సీట్లలో జేసీ చెప్పిన వారిని అభ్యర్థులుగా పెట్టడం.. అలాచేస్తే గుంతకల్ లో జితేంద్రగౌడ్ రెబల్ కావడంఖాయం. శింగమనలలో జేసీ చెబుతున్న వారికి కనీస గుర్తింపులేదు. వారు గెలవలేరు!

ఒకవేళ జేసీ దివాకర్ రెడ్డి.. ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు మాటకు తలొగ్గినా.. ఎంపీ ఓటు విషయంలో చౌదరి వర్గం దివాకర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించదు. ఎమ్మెల్యే ఓటు విషయంలో జేసీవర్గం చౌదరికి అనుకూలంగా వ్యవహరించదు. ఇలా ఎలా చూసినా.. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని అభ్యర్థిత్వాలతో ముడిపడిన అనంతపురం ఎంపీ సీటు రాజకీయం రసవత్తరంగా మారింది!

తను చెప్పినట్టుగా నాలుగు సీట్లలో అభ్యర్థులను మార్చకపోతే.. పోటీచేసేందుకు రెడీగా లేనట్టుగా చెప్పిన జేసీ టీడీపీకి రాజీనామా చేయవచ్చనే పుకార్లూ క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉదంతంతో.. ఈ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది!

కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు

సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?