Advertisement


Home > Politics - Gossip
రాయలసీమలో జియో ఫోన్ల తయారీ కంపెనీ!

మొత్తానికి ఒక కొత్త పరిశ్రమ రాయలసీమకు రాబోతోంది. ఇదేమీ రాష్ట్రప్రభుత్వం సాగించిన విదేశీ టూర్ల వలన కార్యరూపంలోకి వస్తున్నది కాదు. అచ్చంగా.. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న భౌగోళిక ఎడ్వాంటేజీని దృష్టిలో పెట్టుకుని స్వదేశీ కంపెనీనే ఏర్పాటుచేస్తున్న పరిశ్రమ. రాయలసీమలో జియో ఫోన్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రిలయన్స్ అంబానీ అమరావతికి చేరుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో అంబానీ సుదీర్ఘంగా సమావేశం కాబోతున్నారు. ఆయనను ఎయిర్ పోర్ట్ వద్ద లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. అంబానీ గౌరవార్థం చంద్రబాబునాయుడు ఉండవిల్లిలోని తన నివాసంలో ప్రత్యేకంగా విందు కూడా ఏర్పాటుచేశారు. రాత్రి 8వరకు ఆయన చంద్రబాబునాయుడుతోనే ఉండి ఆ తర్వాత తిరిగి ముంబాయి వెళ్తారనేది సమాచారం.

అయితే చంద్రబాబు- అంబానీల భేటీకి సంబంధించిన స్పష్టమైన ఎజెండా వివరాలు బయటకు రాలేదు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం గురించి.. కొత్త పరిశ్రమల స్థాపన గురించి అంబానీతో రాష్ట్రప్రభుత్వం చాలా కాలంనుంచి చర్చలు జరుపుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని వసతులూ కల్పిస్తాం.. వచ్చి పరిశ్రమలు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమలో జియో ఫోన్ల తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు అంబానీ ఇవాళ ఒప్పందం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే అంబానీతో చంద్రబాబునాయుడు ఇంత సుదీర్ఘమైన భేటీ లో ఇంకా అనేక అంశాలు చర్చకు వస్తాయని కూడా పలువురు భావిస్తున్నారు. రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో ప్రస్తుతం వేగంగా జరుగుతున్న మార్పులు, మారుతున్న సమీకరణలు, రాజకీయ పునరేకీకరణలు, తెగనున్న బంధాలు, ఏర్పడనున్న కొత్త బంధాలు ఇలాంటి అనేక అంశాల గురించి కూడా అంబానీ–చంద్రబాబు మధ్య చర్చలు జరగవచ్చునని పలువురు భావిస్తున్నారు.

చంద్రబాబానాయుడుకు అంబానీలతో చాలాకాలంగా సత్సంబంధాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాజకీయంగా కూడా సంక్లిష్ట వాతావరణం ఉన్న నేపథ్యంలో.. అంబానీతో భేటీ ఆసక్తికరమే.