Advertisement


Home > Politics - Gossip
పవన్ పోరాటం స్కెచ్ వెనుక కామినేని!

పవన్ కల్యాణ్ ప్రజా పోరాటాలు చేయడం అనేది కొత్త సంగతి కాదు. కాకపోతే ఇప్పుడు అతిసారం అంశం మీద ఆయన పోరాటం చేస్తున్నారు. అయితే.. అధికారుల వైఫల్యంతోనే ఇన్ని ప్రాణాలు పోయాయంటూ.. పవన్ ఒక రేంజిలో విమర్శించేస్తున్నారు. అతిసారం బాధితులకు సహాయక చర్యలు సత్వరం స్పందించలేదని విమర్శలు చేసేశారు. అంటే ఇదంతా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ సరిగా పనిచేయడం లేదనే అంతరార్థం పుష్కలంగా ఉంది కూడా. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా వారి మీదనే కత్తులు నూరుతున్నారు.

అయితే మొన్నమొన్నటిదాకా వైద్య శాఖకు మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ పవన్ కల్యాణ్ కు చాలా సన్నిహితులు. ఆయన ప్రాపకంతోనే రాజకీయంలోకి వచ్చి వైభవస్థితి సంపాదించుకోగలిగారనే పుకారు కూడా ఉంది. మొన్నటిదాకా ఆయన వైద్య శాఖ పరంగా ఏ చిన్న సంఘటన జరిగినా.. తక్షణం దానికి అనేకానేక ఫాలో అప్ లు చేస్తుండేవారు. ఇప్పుడు ఆయన పదవికి రాజీనామా చేశారు.

అయితే ప్రస్తుత ఎపిసోడ్ లో వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఎలాంటి వైఫల్యాలు ఉన్నాయో సమస్తం కామినేని-పవన్ కు ఇన్ పుట్స్ ఇచ్చినట్లుగా అనుకుంటున్నారు. పరోక్షంగా కామినేని ఆ శాఖను పర్యవేక్షించినంత వరకూ అంతా చాలా సవ్యంగా నడిచిందని.. ఇప్పుడు అంతా అవకతవకలుగా శాఖ నడుస్తున్నదని అంతా అనుకునేలా పరిస్థితి మారుతోంది.

అయితే పవన్ కల్యాణ్ హెచ్చరికపై చంద్రబాబునాయుడు సత్వరమే స్పందించినట్లే కనిపిస్తోంది. పవన్ 48గంటల డెడ్ లైన్ ఇస్తే అంతకంటే ముందుగానే సహాయక చర్యల విషయంలో ఓ కొలిక్కి తెచ్చేలా చంద్రబాబు స్పందిస్తున్నారు. అధికారుల మీద ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. హుదుద్ ను గుర్తుచేస్తూ మధ్యలో తన ఘనతను కూడా చాటుకుంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. భాజపాను వీడి జనసేన చెంత చేరవచ్చుననే ప్రచారంలో ఉన్న కామినేని.. పవన్ కు తెరవెనుక సాయం అందిస్తున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.