cloudfront

Advertisement


Home > Politics - Gossip

హరీష్ మీద కంచ ఐలయ్య చేస్తాడా

హరీష్ మీద కంచ ఐలయ్య చేస్తాడా

ఇంతకూ తెలంగాణ ముందస్తు ఎన్నికల బరిలో ఎవరెవరు పోటీచేస్తున్నారు? ఎవరి మీద ఎవరు తొడకొట్టబోతున్నారు.. ఇవన్నీ సహజంగానే ఆసక్తి కరమైన విషయాలు! ఇప్పటిదాకా.. కేవలం తెరాస అభ్యర్థుల జాబతా మాత్రమే ఖరారైంది గనుక.. మిగిలిన పార్టీలకు సంబంధించి.. అసలు పొత్తులే ఇంకా తేలలేదు గనుక... ప్రత్యర్థులు ఎవరనేది తేలడంలేదు. ప్రధాన పార్టీలు తేల్చలేదు గానీ.. గెలవడానికి కాకుండా.. ఏదో సంచలనం లేదా నిరసన నమోదు చేయడానికి పోటీచేసే వారు మాత్రం ముందే పేర్లు ప్రకటించేస్తున్నారు.

తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీమాస్ ఫోరం) ఛైర్మన్ కంచ ఐలయ్య మాట్లాడుతూ కేసీఆర్ మీద గద్దర్, కేటీఆర్ మీద విమలక్క పోటీచేస్తారని ప్రకటించేశారు. నిజానికి ఈ ఫోరం అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. కానీ, కంచ ఐలయ్య ప్రకటిస్తున్నారు గనుక.. ఫోరం తరఫున ఈ ప్రజా పోరాటాల నాయకులు ఆయా ప్రముఖుల మీద ఇండిపెండెంట్లుగా పోటీచేస్తారని అనుకోవాలి.

తమాషా ఏంటంటే.. గద్దర్, విమలక్క పోటీచేస్తారనే సంగతి.. కంచ ఐలయ్య ప్రకటించడం. ఆ ఇద్దరు నాయకులు ఈ విషయాన్ని ఇప్పటిదాకా ధ్రువీకరించలేదు. విమలక్కను మీడియా అడిగితే.. తన నిర్ణయం తర్వాత చెబుతా అని అంటున్నారు. గద్దర్ సంగతి కూడా తెలియదు. గద్దర్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి కూడా అవుతానని అన్నారు.

కానీ, ఆయనకు ఏకంగా ముఖ్యమంత్రి మీదనే సవాలు చేసేలా.. అదే నియోజకవర్గంలో నిలబడే ఉద్దేశం ఉందా లేదా అనేది మాత్రం తెలియదు. కాస్త లోతుగా చూసినప్పుడు అధికార పార్టీ మీద తమ నిరసనలను తెలియజేయడానికి వీరు పోటీచేస్తున్నట్లుగా మాత్రమే ఉంది. అయితే వీరి పేర్లను ప్రకటించిన కంచ ఐలయ్య, తాను ఎవరి మీద పోటీచేస్తానో మాత్రం చెప్పలేదు.

కేసీఆర్ సర్కారులో మూడో ప్రబలమైన నాయకుడు హరీశ్ రావే. ఇక కంచ ఐలయ్య, హరీశ్ మీద పోటీచేస్తారా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. ఓడిపోవడం గ్యారంటీ అని తెలిసినా.. తమ నిరసనలు తెలియజేయడానికి ప్రజా నాయకులు ఇలా రంగంలోకి దిగితే ఆసక్తికరమే!