తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన నాటి నుంచి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల విషయంలో చాలా మౌనంగా వుంటూ వస్తున్నారు. తను, తన సినిమాలు తప్ప మరేం పట్టించుకోలేదు. ఆ మధ్య వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిసినా, సైరా సినిమా విషయంలో తప్ప మరేం కాదు.
అలాంటి వ్యక్తి వున్నట్లుండి, విశాఖలో ఆడ్మినిస్ట్రేటివ్ రాజధాని పెట్టాలి అన్న నిర్ణయాన్ని ప్రస్తుతిస్తూ ప్రకటన చేసారు. ఇలా ప్రకటన చేయడం కొంత ఆశ్చర్యం కలిగిస్తే, అంతకు ముందుగానే తన సోదరుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలకు భిన్నంగా మాట్లాడడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది.
మెగాస్టార్ చిరంజీవి ఇలా స్పష్టంగా తన అభిప్రాయం వెల్లడించడం వెనుక ఇద్దరు మాజీ ప్రజారాజ్యం నేతలు వున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ప్రస్తుత రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు, రెండవ వ్యక్తి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
విశాఖ మీద ముఖ్యమంత్రి నిర్ణయం వెలువడిన వెంటనే పార్టీతో, పార్టీ అభిప్రాయంతో సంబంధం లేకుండా గంటా శ్రీనివాసరావు ప్రస్తుతించారు. ఇక కన్నబాబు సంగతి సరేసరి, ఆయన ప్రభుత్వంలోనే వున్నారు. పైగా విశాఖతో ఆయనకు బోలెడు అనుబంధం వుంది.
ఇలాంటి నేపథ్యంలో ఈఇద్దరు రాజకీయ ప్రముఖుల సలహా, సూచనల మేరకే మెగాస్టార్ చిరంజీవి బహిరంగ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు, చిరు ప్రకటన ఫేక్ అని వచ్చిన ప్రచారాన్ని కూడా మళ్లీ తనే స్వయంగా ఖండించడం వెనుక కూడా వీరి సూచనలు వున్నాయని బోగట్టా. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు కూడగట్టడమే కాకుండా, పవన్ ను ఇరుకున పెట్టే లక్ష్యంగా కన్నబాబు పావులు కదిపినట్లు తెలుస్తోంది.
కన్నబాబును తరచు పవన్ టార్గెట్ చేయడం జరుగుతోందన్న సంగతి తెలిసిందే. అయినా కన్నబాబు మాత్రం మెగాస్టార్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. సైరా సినిమా షో ల విషయంలో కూడా సాయం చేసారు. అందుకే ఇప్పుడు ఈ అవకాశాన్ని కన్నబాబు ట్రంప్ కార్డ్ గా వాడారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైకాపాలోకి రావాలని చూస్తున్నారు. కానీ అవంతి శ్రీనివాస్ అడ్డంగా వున్నారు. ఇలాంటి టైమ్ లో ముఖ్యమంత్రి నిర్ణయానికి తాను మద్దతు పలకడమే కాకుండా, చిరంజీవి మద్దతు తీసుకురావడం ద్వారా జగన్ దగ్గర మార్కులు సంపాదించే ప్రయత్నం చేసారు గంటా శ్రీనివాసరావు.
మొత్తం మీద ఆ విధంగా మళ్లీ మెగాస్టార్ క్రియాశీలక రాజకీయ ప్రకటన చేసినట్లయింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కార్నర్ లోకి వెళ్లి, తన ట్విట్టర్ అక్కౌంట్ కు కాస్త రెస్ట్ ఇచ్చారు. రాజకీయం అంటే ఇలాగే వుంటుంది. సరైన టైమ్ లో సరైన బ్లాక్ ఫిక్స్ చేయడం.