cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు చేసిన మాయనే.. కన్నా చేస్తున్నారా?

బాబు చేసిన మాయనే.. కన్నా చేస్తున్నారా?

ప్రజలను బురిడీ కొట్టించడానికి ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క శైలి ఉంటుంది. ఎవరి మాయల మరాఠీ పద్ధతులు వారికి ఉంటాయి. సీనియారిటీ కూడా పుష్కలంగా ఉన్నది గనుక.. చంద్రబాబునాయుడు వ్యవహార సరళిలో.. ఇలాంటి మాయోపాయాలు పుష్కలంగా కనిపిస్తాయి. తాజా పరిణామాలను గమనించినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ భాజపాకు కొత్త అధ్యక్షుడుగా నియమితుడైన కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబు బాటలోనే ప్రజలను మాయలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మంగళవారంనాడు మర్యాదపూర్వకంగా నరేంద్రమోడీని కలిసిన కన్నా లక్ష్మీనారాయణ.. అచ్చంగా బాబు తరహాలోనే.. భేటీ తర్వాత.. అవాకులు చెవాకులతో కూడిన అర్థసత్యాలను మీడియా ముందు ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు ఇప్పటికి కొన్ని వందల సందర్భాల్లో తాను రాష్ట్రం అభివృద్ధి కోసం 29సార్లు ఢిల్లీ వెళ్లినా సరే.. కేంద్రంలోని పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదని, సాయం అందించలేదని అనే ఉంటారు. మరి ఆయన 29పర్యాయాలు ఢిల్లీ యాత్ర చేస్తుండగా, అప్పట్లో ఆయన ఏం చెబుతుండేవారు? అదే ఇప్పుడు కీలకం.

ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ చంద్రబాబునాయుడు కొందరు కేంద్రమంత్రులను, వీలైనప్పుడు మోడీని కలిసేవారు. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత.. బయటకు వచ్చి ఆయన ఒక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి కేంద్రం చాలా సానుకూలంగా ఉన్నదని, తమ ప్రతిపాదనల పట్ల చాలా సానుకూలంగా స్పందించారని చిలకపలుకులు పలికేవారు. ఆయన ఒక్కడే ఆ విషయం చెప్పేవాడే తప్ప.. ఏ ఒక్క సందర్భంలోనూ కేంద్రమంత్రితో కలిసి.. రాష్ట్రంనుంచి వచ్చిన ప్రతిపాదనలు ఓకే చేస్తాం అని చెప్పినది లేదు. మోడీతో భేటీల విషయంలోనూ అలాగే మాయచేస్తూ వచ్చారు.

ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అదే చేస్తున్నారు. ఆయన రాష్ట్ర సారథ్య పదవిలోకి వచ్చిన తర్వాత.. తొలిసారి మోడీ వద్దకెళ్లి.. మర్యాదపూర్వకంగా కలిశారు. అనగా.. మహా అయితే శాలువా కప్పి, బొకే ఇచ్చి వచ్చేసే భేటీ మాత్రమే. కానీ బయటకు వచ్చిన తర్వాత.. మాత్రం.. ఏపీకి ఇచ్చిన ప్రతిమాటను నెరవేర్చే ఉద్దేశంలోనే ఉన్నారంటూ ఓ మాట వదిలారు. ప్రధాని సంపూర్ణంగా హామీలు నెరవేరుస్తారని మాటలు వల్లించారు.

అయితే నిన్న చంద్రబాబునాయుడు వ్యవహారంలో అయినా, ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారంలో అయినా.. అవతలివైపు నుంచి.. మోడీ కూడా ఒకమాట చెప్పిఉంటే, కనీసం ట్విటర్ లో అయినా ఒక మాట పెట్టి ఉంటే.. అది నమ్మశక్యంగా ఉండేది. ఆయనగా స్పందించలేదు గనుకనే.. కన్నా కూడా చంద్రబాబు మాయనే చేస్తున్నట్లుగా పలువురు అనుకుంటున్నారు.