Advertisement


Home > Politics - Gossip
'కాపు' కాయగలరా!

ఉత్తరాంధ్ర మంత్రులకు అగ్ని పరీక్ష

టీడీపీ కంచుకోటను కాపాడే బాధ్యత

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత కాపులకు అయిదు శాతం రిజర్వేషన్‌ ప్రకటిస్తూ కీలకమైన పావును ముందుకు కదిపారు దాంతో, కాపులను ఓ వైపున, బీసీలను మరో వైపున ఉంచుకుని ఎన్నికల గోదాలోకి ఎంచక్కా దిగిపోవాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. ఆ దిశగా రెండు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను పార్టీ వైపుగా నడిపించాల్సిన బృహత్తర బాధ్యతను బాబు ఉత్తరాంధ్రలో ఇద్దరు మంత్రుల మీదన పెట్టారు.

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరపు అచ్చెంనాయుడు కాపు, బీసీల తరఫున సారధ్యంవహించడమే కాదు, వైరి పక్షంగా ఉంటూ వస్తున్న రెండు సామాజిక వర్గాలను సమన్వయం చేసుకుంటూ సైకిల్‌ను మూడు జిల్లాలలో పరుగులు తీయించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్‌ ప్రకటించగానే ఇది తమ జాతికి పండుగ రోజంటూ మీడియా ముందు గొప్పగా చెప్పిన మంత్రి గంటా దాన్ని ఓట్ల పండుగగా మార్చేందుకు ఇకపై చాలానే కసరత్తు చేయాల్సి ఉంటుంది.

విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కూడా బాధ్యతలు వహిస్తున్న గంటా తన రాజ కీయ నేర్పును సరిగ్గా ఇపుడే ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. అగ్ర కులానికి చెందిన కాపుగా ఉన్న గంటా బాబు రిజర్వేషన్‌ పుణ్యమాని బీసీ మంత్రిగా మార బోతున్నారు. విశాఖ జిల్లాలో, నగరంలో ఓసీ కాపులే అధి కంగా ఉన్నారు. చాలా నియోజకవర్గాలలో వారి ప్రభావం కచ్చితంగా ఉంది. ఈ జిల్లాలో పాతికేళ్లుగా రాజకీయం చేస్తున్న మంత్రి గంటా కాపుల మద్దతును బాగానే సంపా దించుకున్నారు. ఆయనతో పాటు, ఆయన అనుచర వర్గం కూడా అరడజను మంది వరకూ ఎమ్మె ల్యేలుగా, ఎంపీగా ప్రస్తుతం కొనసా గుతున్నారు.

వీరంతా కూడా ఇకపై కాపు ఓట్ల ను టీడీపీకి అను కూలంగా మళ్లించ గలగాలి. ఇది ఓ విధంగా గంటా దీక్షా దక్షతలకు సవాల్‌ వంటిదే. బాబు మంత్రివర్గంలో ఎందరో కాపు మంత్రులు ఉన్నా ఉత్తరాంధ్ర విష యానికి వచ్చేసరికి గంటా పేరు ప్రముఖంగానే ఉంటుంది. పైగా ఆయన ఆర్ధికంగా, సామాజికంగా ఇతర కాపు మంత్రుల కంటే కూడా బలవంతుడన్న పేరు సంపాదించుకున్నారు. ఈ పేరును ఇపుడు తనకు, తన అనుచరులకు విభజన కష్ట కాలంలో టిక్కెట్లు ఇచ్చి మరీ ఆదరించిన పసుపు పార్టీకి పూర్తిగా మళ్లించవలసిన అవసరం, అగత్యం తప్పనిసరిగా ఉంది.

బాబు సైతం ఇదే ఆలోచనతో మంత్రి గంటాను రంగంలోకి దించి నట్లుగా తెలుస్తోంది. ఇక, మరో మంత్రి, నోరున్న నేతగా పేరున్న సిక్కోలు నాయకుడు కింజరపు అచ్చెంనా యుడుకు కూడా బాబు అగ్ని పరీక్షనే పెట్టారు. కాపులను బీసీలలో చేర్చే తీర్మానంపై మాట్లాడిన అచ్చెన్న బీసీలకు ఎటువంటి అన్యాయం జరగబోదని అసెంబ్లీ సాక్షిగా ఢంకా భజాయించారు. ఇపుడు అదే దూకుడుతో ఆయన వెనుకబడిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూరల్‌ జిల్లాలలో లక్షల సంఖ్యలో ఉన్న బీసీలను టీడీపీకి అనుకూలం చేయాల్సిన బాధ్యతను మోయాల్సి వస్తోంది.

కాపులను బీసీలలో చేరుస్తామనగానే ఒక్కసారిగా బీసీలలో అగ్రహం కట్టలు తెంచుకుంది. తమ కంచం లోని కూడును వారికి పంచి పెడుతున్నారన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో వెలమలు, కాళింగలు, గవరలు, యాదవులు ప్రధానంగా బీసీలుగా ఉంటున్నారు. వీరంతా రాజకీయంగా కాపులతో ఎక్క డిక్కడ విభేదిస్తున్న వారే. ఇపుడు కాపులు సైతం బీసీలుగా మారుతున్న వేళ కులాల కలహాలు పార్టీలో మరింతగా పెచ్చరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉండడమే కాదు, నికరమైన ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చిన బీసీలు కనుక వ్యతిరేకమైతే సైకిల్‌ పార్టీ పునాదులు కదిలి పోవడం ఖాయం.

ఇంతకాలం ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపికి కంచు కోటలుగా ఉంటూ వచ్చాయి. ఇపుడు కాపుల రిజర్వేషన్‌ పుణ్యమాని వాటికి బీటలు వారితే 2019లో టీడీపీ అధికారాన్ని అందుకోవడం కష్టసాధ్యమే అవుతుంది. మొత్తం 175అసెంబ్లీ స్ధానాలలో 34సీట్లతో అయిదవ వంతు వాటాను కలిగిన ఈ జిల్లాలలో కనుక పార్టీ వెనుకబడితే నగుబాటే మిగులుతుంది. దాంతో, చంద్రబాబు ముందు చూపుతోనే అటు అచ్చెన్నను, ఇటు గంటాను రంగంలోకి దించారని తెలుస్తోంది. అచ్చెన్నకు ఏకంగా బీసీలను బుజ్జగించే కమిటీలో మరో మంత్రి యనమలతో పాటు స్ధానం కల్పించారు.

ఇక, కాపులకు రిజర్వేషన్‌ కల్పించామన్న ప్రచారాన్ని ఎంత ఎక్కువగా క్షేత్ర స్ధాయిలో తీసుకుపోతే అంత ఎక్కువగా ఆ వర్గం మద్దతు టీడీపీకి దక్కుతుందని, ఫలితంగా వచ్చే ఎన్నికలలో కాపులు, బీసీల జోరు సవారీతో టీడీపీ సైకిల్‌ ఎదురు లేకుండా పరుగులు తీస్తుందన్నది టీడీపీ అధినాయకుని చాణక్య వ్యూహం. మరి, బాబు గారి ఆలోచనలకు తగినట్లుగా ఉత్తరాంధ్రకు చెందిన ఈ ఇద్దరు మంత్రులూ కార్యక్షేత్రంలోకి దిగి తమ సత్తా చాటుకుంటారా, బ్రేకులు లేకుండా సైకిల్‌ పార్టీని పరు గులు తీయిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా ఒకే ఒరలో రెండు కత్తులను చేర్చి కసరత్తు చేసిన టీడీపీకి, ఈ ఇద్దరు మంత్రులకూ ఇది అగ్ని పరీక్షనే చెప్పుకోవాలి.

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌