Advertisement


Home > Politics - Gossip
సరైన పని... మన సిఎంల మాదిరి కాదు..!

మన దేశంలో నదులకు పుష్కరాలు రావడం, వాటిల్లో పుణ్య స్నానాలు చేయడం, గతించిన పెద్దలకు తర్పణాలు వదలడం... ఇదంతా కల్చర్‌లో ఓ భాగం. ఇది హిందూ మత విశ్వాసాలకు సంబంధించింది. అందులోనూ వ్యక్తిగతమైంది కూడా. క్రమం తప్పకుండా పుష్కరాలకు వెళ్లేవారున్నారు. అసలు పట్టించుకోనివారున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఎలా జరిగిందో పక్కన పెడితే, రాష్ట్ర విభజన తరువాత వచ్చిన గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబునాయుడు చేసిన హడావుడి, ప్రచారం అంతాఇంతా కాదు.

రెండు పుష్కరాలకు వందల కోట్లు ఖర్చు చేశారు. పోటీపడి వ్యయం చేశారు. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా పుష్కరాల పనుల్లో దించి పుష్కరాల ప్రాశస్త్యాన్ని, దాని సెంటిమెంటును విపరీతంగా ప్రచారం చేశారు. ఇద్దరు సిఎంలు విమర్శల్ని పట్టించుకోలేదు. ప్రజలను మత్తులో ముంచడానికి, తమను గొప్పగా ప్రమోట్‌ చేసుకోవడానికి పాలకులకు భక్తి, ఆధ్యాత్మికం, పండుగలు, ఉత్సవాలు సాధనాలుగా దొరికాయి. వాటిని అడ్డం పెట్టుకొని వారు చేసిన హడావుడి ప్రహసనంగా (కామెడీ) మారింది.

ఈ విషయంలో కేసీఆర్‌ కంటే చంద్రబాబునాయుడు జోరు ఎక్కువ. ఏపీలో పుష్కరాలను చంద్రబాబు పెద్ద కార్పొరేట్‌ సంస్థ నిర్వహించే మెగా ఈవెంట్‌లా తయారుచేశారు. ఈవెంట్‌ మేనేజర్‌లా, బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. చాలాకాలం పుష్కరాల గురించి మాట్లాడటం తప్ప మరో ధ్యాసలేదు. కృష్ణా పుష్కరాలప్పుడు 'పాడిందే పాడరా' అన్నట్లుగా పాడారు.

గోదావరి పుష్కరాల తొలిరోజునే జరిగిన భీకరమైన తొక్కిసలాట ఘటన ప్రజలకు గుర్తొస్తుందేమోననే ఉద్దేశంతో మరీ అతిగా మాట్లాడారు. అధికారులతో నిర్వహించిన ప్రతి సమీక్షా సమావేశంలో పుష్కరాల విశిష్టతను ఏకరువు పెట్టారు. తానే ప్రవచనకారుడై ప్రజలకు ఏమీ తెలియనట్లు పురాణ శ్రవణం చేశారు. కుల మత ప్రాంతీయ భేదాల్లేకుండా రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజలూ పుష్కర స్నానాలు చేయాల్సిందేనన్నారు. కృష్ణానది రుణం తీర్చుకోవాలన్నారు.

పుష్కరాల పన్నెండు రోజులూ దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో, గురుద్వారాల్లో పూజలు, ప్రార్థనలు జరగాలన్నారు. ఒక మతానికి సంబంధించిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రచారం చేయవచ్చా? అనే ప్రశ్నకు జవాబులేదు.  ముఖ్యమంత్రి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, శాంతిభద్రతలు మొదలైనవాటి గురించి చెప్పాలిగాని అందరూ స్నానాలు చేయాల్సిందే, అన్ని ఛానెళ్లు ప్రసారం చేయాల్సిందేనని ఆదేశించకూడదు.

'దేశం ఆశ్చర్యపోయేలా పుష్కరాలు నిర్వహించాలి'... 'దటీజ్‌ ఏపీ అనుకోవాలి' అని బాబు అన్నారు. ముఖ్యమంత్రి తన పేరుతో ఆహ్వాన పత్రికలు అచ్చువేయించుకొని ఢిల్లీ నాయకుల నుంచి సినిమా వాళ్ల వరకు పంచిపెట్టి ఆహ్వానించడం కూడా ప్రహసనమే. పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం విదేశీ సంస్థలు పోటీపడ్డాయంటే చంద్రబాబు ఎంత డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు పుష్కర ప్రహసనం చెప్పుకోవాలంటే చాలాఉంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు అయిపోయాక ఇద్దరు ముఖ్యమంత్రుల నిర్వాకాలు చెప్పుకోవడం ఎందుకనే సందేహం కలగడం సహజం. ఈ నేపథ్యం చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే... ఈరోజు (సెప్టెంబరు 12) నుంచి కావేరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు జరుగుతాయి. కర్నాటకలో పుట్టిన కావేరి నది తమిళనాడులోనూ ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. కావేరి పుష్కరాలు వచ్చాయి కాబట్టి కర్నాటక సర్కారు బాగా హడావుడి పడుతోందని, బ్రహ్మాండంగా ప్రచారం చేస్తోందని తెలుగు రాష్ట్రాల్లో అనుకోవచ్చు. ప్రభుత్వమే అన్ని నెత్తినేసుకొని చేస్తోందని భావిస్తుండొచ్చు.

కాని అలాంటిదేమీ లేదు. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యంలేదు. ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో పుష్కరాల నిర్వహణ సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలను ముఖ్యమంత్రులు పూజలు చేసి ప్రారంభించగా, కర్నాటకలో దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం కూడా పుష్కరాల విషయంలో జోక్యం కల్పించుకోదు. అక్కడ ఉన్నది ద్రవిడ సిద్ధాంతాల ప్రభుత్వమే కాకుండా ప్రస్తుతం చికాకుల్లో ఉంది. పుష్కరాలు, పండుగలు, ఉత్సవాలు ఎలా చేసుకోవాలో పాలకులు ప్రజలకు నేర్పక్కర్లేదు. వారు జోక్యం చేసుకుంటే అనర్థాలు తప్ప మేలు ఏమీ ఉండదు.