Advertisement


Home > Politics - Gossip
మంత్రి పదవి కోసం అసెంబ్లీకా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్‌ కుమార్తె కమ్‌ నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపీ కవిత చూపు రాష్ట్రంపై పడిందని కొంతకాలం నుంచి మీడియాలో వస్తున్న వార్తలు క్రమంగా బలపడుతున్నాయి. టిఆర్‌ఎస్‌ శ్రేణులు అలాంటిదేమీ లేదంటున్నా ప్రచారం ఆగడంలేదు. అంటే ఏదో ఉందనే అర్థం. వచ్చే ఎన్నికల్లో కవిత అసెంబ్లీకి ఎందుకు పోటీ చేయాలనుకుంటోంది? అనే ప్రశ్నకు ఫలానందుకని నిర్దిష్టమైన సమాధానం ఇప్పటివరకు దొరక్కపోయినా 'మంత్రి పదవి కోసం' అని కామన్‌గా వస్తున్న జవాబు.

ఒకవేళ ఆమె అసెంబ్లీకి పోటీ చేయడం ఖరారైతే ఈ జవాబే సరైందని చెప్పుకోవచ్చు. కేసీఆర్‌ కుటుంబంలో మంత్రి పదవి లేకుండా ఆమె ఒక్కత్తే మిగిలిపోయింది. ఏ రాజకీయ నాయకుడైనా జీవితాంతం అసెంబ్లీకో, పార్లమెంటుకో పోటీ చేయడు. తానున్న పార్టీ అవసరాలు, రాజకీయ ప్రయోజనాలు, సమీకరణాలు తదితర పలు కారణాల రీత్యా ఏదో ఒక చట్టసభకు పోటీ చేస్తాడు. కొన్నిసార్లు శాసనమండలికి లేదా రాజ్యసభకు ఎన్నికవుతారు.

టీఆర్‌ఎస్‌ స్థాపించినప్పటినుంచి కేసీఆర్‌ పార్లమెంటుకే పోటీ చేశారు. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం భుజానికెత్తుకోకముందు అంటే టిడిపిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు. తెలంగాణను ప్రకటించాక కూడా గత ఎన్నికల్లో ఆయన పార్లమెంటుకు, అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి పార్లమెంటును వదులుకున్నారు. అలా చేయడానికి కారణం ముఖ్యమంత్రి కావడం కోసమే.

దళితుడిని ముఖ్యమంత్రిని చేసి తాను రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్‌ ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన కూతురు కూడా అదే బాటలో నడిచే ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు ఉన్న అంచనా. అదే నిజం కావొచ్చు. ఆ నమ్మకం ఉంది కాబట్టే కవిత అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటోంది. ఈ టర్మ్‌లో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదు. కేంద్రంలో నరేంద్ర మోదీ మహిళను రక్షణ మంత్రిని చేసి రికార్డు సృష్టించగా, అంతకుముందే కేసీఆర్‌ మహిళా మంత్రి ఊసు లేకుండా రికార్డు సృష్టించారు.

బతుకమ్మకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కవిత మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఎప్పుడూ మాట్లాడిన దాఖలా లేదు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఈ లోపం కవితకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా సరిచేసుకుంటారేమో...! గతంలో ఊహాగానాలు చెలరేగినట్లుగా టిఆర్‌ఎస్‌ ఎన్‌డిఎలో చేరివుంటే కవిత కేంద్రంలో మంత్రి అయ్యేది.

మంత్రి పదవి ఆఫర్‌ వచ్చినట్లు ఒకప్పుడు మీడియాలో ప్రచారం జరిగింది. ఓసారి విలేకరులు కవితను అడిగినప్పుడు 'ఆఫర్‌ ఇస్తే ఆలోచిస్తాం' అని చెప్పింది. కేసీఆర్‌ బిజెపికి కొన్నిసార్లు మిత్రుడిగా కనబడతారు. కొన్నిసార్లు శత్రువులా వ్యవహరిస్తారు. ఆయన అధికారానికి రాగానే మోదీని శత్రువులా చూశారు. ఆ తరువాత మిత్రుడిలా వ్యవహరించారు. మోదీ చేసిన పలు నిర్ణయాలను సమర్థించారు. కేసీఆర్‌ సూచన మేరకే రాష్ట్రపతి పదవికి రామనాథ్‌ కోవింద్‌ను ఎంపిక చేశామని మోదీ చెప్పారు. 

కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్‌ పథకాలు బ్రహ్మాండం అంటారు. రాష్ట్రంలో బిజెపి నాయకులేమో తీవ్ర విమర్శలు చేస్తుంటారు. కాబట్టి మోదీ-కేసీఆర్‌ సంబంధాలను నిర్వచించడం కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎలాగు మంత్రి పదవి దక్కదు. అసెంబ్లీకి పోటీ చేసి గెలిస్తే మంత్రిగా ఉండటమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుగ్గా ఉంటూ క్షేత్రస్థాయిలో పట్టు సాధించవచ్చు.

కవిత రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనుకోవడమే నిజమైతే నిజామాబాద్‌ ఎంపీగా ప్రముఖ సినిమా నిర్మాత దిల్‌ రాజును టీఆర్‌ఎస్‌ పోటీకి పెడుతుందని కొంతకాలం క్రితం ఓ సమాచారం వచ్చింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన దిల్‌ రాజు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడట.

కవిత మళ్లీ ఎంపీగానే పోటీ చేసినా దిల్‌ రాజు రంగప్రవేశానికి ఇబ్బందేమీ ఉండదు. ఆయన్ని మరోచోటు నుంచి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేయించి గెలిపించుకోవడం కష్టం కాదు. పార్టీని, ప్రభుత్వాన్ని వంశపారంపర్యంగా గుప్పిట్లో పెట్టుకోవడం, పరిపాలించడం ప్రజాస్వామిక లక్షణం కాదని, కుటుంబ రాజకీయాలు డెమోక్రీసీకి విరుద్ధమని కొందరు మేధావులు అంటుంటారు.

కాని ఇది తప్పుకాదని, ఇదొక వాస్తవం కాబట్టి దాన్ని నిరసించకుండా ఒప్పుకొని తీరాల్సిందేనని కవిత అభిప్రాయం. తండ్రి, అన్నయ్య, బావ మాదిరిగానే చాలా తెలివిగా మాట్లాడగల సామర్థ్యమున్న నాయకురాలు. ఒకవేళ ఆమె ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయితే మాత్రం టిఆర్‌ఎస్‌ రాజకీయాల్లో అనుకోని మార్పులొస్తాయని పరిశీలకుల అంచనా.