Advertisement


Home > Politics - Gossip
ఇదేం పితలాటకం కేసీఆర్ గారూ!

అన్నదాతల పాలిట కేసీఆర్ దేవుడు అనే పేరు ఆల్రెడీ వచ్చేసింది. పైగా ప్రభుత్వ ఖజానా మీద పెద్ద భారం లేకుండానే సదరు కీర్తి సంప్రాప్తించింది. దేశమంతా ఇప్పుడు మనల్నే కీర్తిస్తోంది. ఇంకా రైతుబాంధవుడిగా పేరు తెచ్చుకోడానికి... ఖజానా మీద ఖర్చు పెంచే పథకాలు ఎందుకు అనే పునరాలోచన కేసీఆర్ కు కలిగిందో ఏమో తెలియదు గానీ.. మొత్తానికి ఆయన కొత్త పితలాటకం పెడుతున్నారు.

రాష్ట్రంలో రైతులందరికీ ఎకరాకు నాలుగువేల రూపాయల వంతున ఆర్థిక సహాయం చేయబోతున్నట్లుగా చాలా ఆర్బాటంగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు కొత్తగా ఆ పథకంలో మడత పేచీలు పెడుతున్నారు. అందరికీ కాదు కొందరికే అనే తీరుగా అది సాగుతోంది. పైపెచ్చు మీరు సేద్యానికి దూరంగా ఉన్న ధనిక రైతులు అయితే.. ఎకరానికి నాలుగువేల రూపాయల సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకోండి.. అని కూడా కేసీఆర్ పిలుపు ఇస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ మీద ఇస్తున్న సబ్సిడీని వదులుకోవాల్సిందిగా దేశవ్యాప్తంగా ప్రజలకు , సంపన్నులు అనుకునే వారికి ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు ఇటు కేసీఆర్ కూడా స్ఫూర్తి ఇచ్చినట్లుంది. సాయం చేసినట్టే ఉండాలి. కానీ ఖజానాపై భారం పడకూడదు. ‘కుండలో కూడు అలాగే ఉండాలి.. బిడ్డ కుడుములాగా ఉండాలి’ అన్న సామెత చందంగా వీరి ఆలోచనలు సాగుతున్నాయి.

కేసీఆర్ ఎకరాకు 4వేల రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని చాలా ఆర్భాటంగా ప్రకటించారు. తనకు రైతు బాంధవుడనే డిజిగ్నేషన్ దానితోనే వచ్చేస్తుందని ఆయన కలగన్నారు. కానీ భూయజమానులకే తప్ప కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చే ఏర్పాటు అందులో లేకపోవడంతో.. తొలి దెబ్బ పడింది. తెలంగాణలో సగానికి పైగా మారుమూల ప్రాంతాల్లో పేదలు కౌలు మీదనే సేద్యం చేస్తుంటారు. గ్రామాల్లో భూములు కలిగిఉన్న ధనికులు.. వాటిని కౌలుకు ఇచ్చేసి.. పట్టణాల్లో నివాసం ఉండడం జరుగుతోంది. అయితే కౌలు రైతులకు సాయం గురించి కాంగ్రెస్ ఎంత రభస చేసినప్పటికీ.. అది అసాధ్యం అని శాసనసభ సాక్షిగా కేసీఆర్ తేల్చి చెప్పేశారు కూడా.

తీరా ఇప్పుడు 4వేలసాయం పథకం అమల్లో ప్రారంభించాల్సిన సమయం వచ్చేసరికి.. దానికి మడతపేచీలను ఆశ్రయిస్తున్నారు. రాళ్లు రప్పలతో నిండి సేద్యానికి యోగ్యంగా లేని భూమి ఉన్నదని గుర్తించి ఓ పదిలక్షల ఎకరాల భూ యజమానులకు సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేస్తున్నారు. మరోవైపు -సేద్యం చేయకుండా ఉంటున్న ధనికులు స్వచ్ఛందంగా ప్రభుత్వ సాయాన్ని వదులుకుని తమ పెద్ద మనసు చాటుకోవచ్చు కదా అని కేసీఆర్ పిలుపు ఇస్తున్నారు.

తెరాస ప్రాపకం కోరుకునే కొందరు దీనికి స్పందించవచ్చు. ఈ రకమైన ఏర్పాటు మంచిదే గానీ.. ఇన్ని మార్గాలను అనుసరిస్తున్న ప్రభుత్వం.. కౌలురైతులను గుర్తించి.. కౌలు చేస్తున్న వారికి సాయం అందేలా ఒక వ్యవస్థను, యంత్రాంగాన్ని రూపొందించలేదా..? అనే ఆవేదన పలువురిలో కలుగుతోంది. నిజానికి నష్టాలు పలకరిస్తే ఆత్మహత్యల దాకా వెళుతున్నది కౌలురైతులే ఎక్కువ.. ధనికులకు కోత పెట్టడానికి కొత్త ఆలోచన చేసినట్టే కౌలుదార్లకు మేలు చేయడానికి ఇంకాస్త సరికొత్త ఆలోచన చేస్తే.. కేసీఆర్ కు మంచిపేరు దక్కుతుంది.