Advertisement


Home > Politics - Gossip
కేసీఆర్ కు ఝలక్ మీద ఝలక్!

కేసీఆర్ తనంత తాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం తనలక్ష్యం అంటూ.. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేస్తా అంటూ దేశమంతా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ప్రతి రాష్ట్రానికి పర్యటిస్తూ నానా హడావుడి చేస్తున్నారు. అయితే కేసీఆర్ ను ఎవరూ పట్టించుకుంటున్నట్లుగా మాత్రం కనిపించడం లేదు. ఆయన నాయకత్వాన్ని అందరూ ఆమోదించే సంగతి తరువాత.. అసలు, ఆయన ప్రతిపాదన పట్లే పెద్దగా మొగ్గు కనిపించడం లేదు.

ఆయన సంకల్పిస్తున్న కూటమి నుంచి దేవెగౌడ జారిపోయారని తాజాగా అనుకుంటూ ఉంటే, అదే కర్నాటక పరిణామాల సాక్షిగా మమతాబెనర్జీ కూడా జారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బెంగుళూరుకు వచ్చిన మమతా బెనర్జీ, చంద్రబునాయుడుతో జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపు ఇవ్వడం విశేషం.

కేసీఆర్ భాజపా, కాంగ్రెస్ వ్యతిరేక శక్తిగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే పిలుపు ఇచ్చిన తరువాత.. తొలుత కోల్ కత వెళ్లి మమతాదీదీని కలిశారు. ఆమెసహకారం అడిగారు. ఆమె అవునూ కాదూ అని తేల్చి చెప్పకుండానే.. కేసీఆర్ మాట వదిలేసి.. మూడో ఫ్రంట్ కోసం ఢిల్లీలో తన ప్రయత్నాలు తాను చేయడం ప్రారంభించారు. మరోవైపు కేసీఆర్ కర్నాటక వెళ్లి దేవెగౌడను కలిశారు. ఆయన కనీసం కేసీఆర్ ను ప్రచారానికి కూడా పిలవలేదు.

చివరికి మూడోఫ్రంట్ ప్రయత్నాలతో ఉపయోగంలేదని, భాజపా వ్యతిరేకతతో కాంగ్రెస్ తో కలిసిన కూటమి మాత్రమే నిలబడుతుందని చెప్పారు. కేసీఆర్ చెన్నై వెళ్లి డీఎంకేను కలిస్తే.. వారు తమ వద్దకు వచ్చింది మూడోకూటమి గురించి మాట్లాడడానికి కానేకాదని తేల్చేశారు. తీరా తొట్టతొలుత కేసీఆర్ భేటీ అయిన మమతా దీదీ కూడా చంద్రబాబును మూడోకూటమి ఏర్పాటు చేయడానికి సారథ్యం వహించాల్సిందిగా కోరుతుండడం విశేషం. మరి ఇన్నాళ్ల కేసీఆర్ ప్రయత్నాలు ఏమైనట్టు? ఆయన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరేనా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్ కు జైకొట్టిన వారిలో ప్రస్తుతం నికరంగా ఆయన సారథ్యానికి ఓకె చెప్పిన వారు హేమంత్ సోరెన్ తప్ప మరెవ్వరూ లేరు. అఖిలేష్ యాదవ్ నిర్ణయం కూడా అచ్చంగా ఆయనకు మద్దతు అనడానికి వీల్లేదు. కాంగ్రెస్ తో కలిసిన కూటమి మాత్రమే ఉండాలని ఇతర పార్టీలన్నీ పట్టుబట్టేట్లయితే గనుక.. అలాంటి కూటమిలో కేసీఆర్ ఏమాత్రం ఇమడలేడు. ఎందుకంటే.. తెలంగాణలో ఆయనకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే... ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కూటమి సందేహాస్పదంగా మారుతోంది.