cloudfront

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్ కు మహిళలంటే ఇంకా చిన్నచూపేనా?

కేసీఆర్ కు మహిళలంటే ఇంకా చిన్నచూపేనా?

బహుశా యావత్ దేశంలోనే.. రాష్ట్ర కేబినెట్ లో ఒక్కరంటే ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా.. ఒక టర్మ్ పదవీకాలం పూర్తిచేసిన ఏకైక ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావుది మాత్రమే అయి ఉండొచ్చు. అయినా సరే.. మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గి తీరుతాం.. అధికారంలోకి వచ్చి తీరుతాం అనే ధీమాతో... కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చేశారు. టికెట్లు కూడా ప్రకటించేశారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తోంటే.. మహిళలంటే కేసీఆర్ ఇంకా అదేతరహా చిన్నచూపు కొనసాగుతోందని అర్థమవుతోంది. 119 స్థానాల అసెంబ్లీకి 105గురు అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు.. అందులో కేవలం నలుగురే మహిళలకు అవకాశమివ్వడం.. కేసీఆర్ వివక్షకు నిదర్శనం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేసీఆర్ తాను తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కొలువుదీరిన సమయంలోనే ఒక్క మహిళామంత్రి కూడా లేకుండా కేబినెట్ ఏర్పాటుచేశారు. అప్పటికి కేబినెట్ లో కొన్ని ఖాళీలు ఉండిపోయాయి. తర్వాత మహిళలకు అవకాశం కల్పిస్తారనే మాట ప్రబలంగా వినిపించింది. నెలలు గడిచాయి. చాలాకాలం తర్వాత.. మంత్రివర్గ విస్తరణ కూడా జరిగింది. ఆ సమయంలో చాలామంది మహిళా ఎమ్మెల్యేలు మంత్రి పదవుల మీద ఆశ పెట్టుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పూర్తయింది. మరోవైపు మహిళలకు మంత్రిగా అవకాశం ఇవ్వలేదంటూ.. కాంగ్రెస్ కు చెందిన డికె అరుణ కోర్టులో పిటిషన్ వేసినా కూడా కేసీఆర్ ఖాతరు చేయలేదు. ఆ కారణం మీద ఆయనకు మహిళల్లో చెడ్డపేరు తేవాలని కాంగ్రెస్ ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదు.

తీరా ఈసారి టికెట్లు ఇచ్చినప్పుడు కూడా ఆయన మహిళల పట్ల అదే వివక్షను చూపించారు. 105 టికెట్లు ప్రకటిస్తే.. అందులో కేవలం నలుగురికే చాన్సిచ్చారు. ఒకవైపు మహిళలకు చట్టసభల్లో 33శాతం కోటా ఉండాలంటూ చట్టం రూపొందే కసరత్తు జరుగుతుండగా.. కేసీఆర్ మహిళలకు మరీ ఇంత కనిష్టమైన శాతంలో టికెట్లివ్వడం విమర్శలకు దారితీస్తోంది.

ఇంకా 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నా.. అందులో కూడా రెండుకు మించి మహిళలకు దక్కవని అంచనాలు సాగుతున్నాయి.