cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇలాగైతే.. కేసీఆర్ క్రెడిబిలిటీకి డేమేజి!

ఇలాగైతే.. కేసీఆర్ క్రెడిబిలిటీకి డేమేజి!

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఇద్దరు చంద్రులు కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేయాలని తెగ ఉత్సాహ పడుతూనే ఉన్నారు. అయితే ఇద్దరి ఎజెండా వేర్వేరు. చంద్రబాబు చెప్పేది ఒకమాట... ఒక తీరు! కేసీఆర్ చెప్పేది మరో తీరు! తాజా పరిణామాల విషయంలో మాత్రం కేసీఆర్ జాతీయ స్థాయిలో చిన్న పార్టీలను కూడగట్టే విషయంలో క్రెడిబిలిటీని కోల్పోతున్నారా? అనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే... చంద్రబాబునాయుడు కూటమి కట్టే విషయంలో మోడీ వ్యతిరేకత అనే ఎజెండాను మాత్రమే స్మరిస్తూ వస్తున్నారు. కేసీఆర్ విషయంలో అలా కాదు. ఆయన నిర్దిష్టంగా.. సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు. ఫెడరల్ ప్రభుత్వం రావాలంటున్నారు. పరిపాలనలో.. కేంద్రం పరిమితమైన శాఖలను మాత్రమే తన వద్ద ఉంచుకోవాలని, రాష్ట్రాలకు అధికారాలు పెరగాలని.. ప్రతి సంక్షేమ పథకంలోనూ కేంద్రం చొరబడాలనే ఉబలాటం తగ్గించుకోవాలని కేసీఆర్ అంటున్నారు. ఆ రకంగా ఆయన ఇతర ప్రాంతీయ పార్టీలను కూటమికట్టే ప్రయత్నాలు చేశారు.

ఆ ప్రయత్నాల్లో భాగంగా మమతాదీదీని కూడా కలిశారు. అలాంటప్పుడు.. తాజాగా మమతా బెనర్జీ ఒక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు.. కేసీఆర్ మౌనంగా ఉండిపోవడంలో ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. మమతా దీక్ష అనేది సీబీఐకు- రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన రచ్చ మాత్రమే కావొచ్చు గాక! కానీ సహచర ముఖ్యమంత్రి ఒక దీక్ష చేస్తున్నప్పుడు.. దేశంలోని తతిమ్మా రాజకీయ పార్టీలన్నీ దాని మీద ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు.. కేసీఆర్ మౌనం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది.

ఇప్పటికే.. మోడీతో కలిసి కేసీఆర్ లోపాయికారీ ఒప్పందాలతో అంటకాగుతున్నారంటూ చంద్రబాబు తనకు చేతనైనంత బురద చల్లుతూనే ఉన్నారు. అలాంటి ఆరోపణలను జనం నమ్మేలాగా.. కేసీఆర్ వ్యవహార సరళి కనిపిస్తోంది. తను సంకల్పించే కూటమికి మమత మద్దతు కూడా కీలకంగా భావించిన కేసీఆర్, ఆమెను కలిశారు కూడా!

మరి అదే సమయంలో ఆమె చేపట్టిన ఉద్యమానికి తాను దూరం ఉండిపోతే.. దేశంలోని ఇతర పార్టీల నమ్మకాన్ని చూరగొనగలిగే విషయంలో ఆయన క్రెడబిలిటీ దెబ్బతింటుంది కదా... అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?