cloudfront

Advertisement


Home > Politics - Gossip

అడుగులన్నీ రివర్స్ లో పడుతున్నాయ్

అడుగులన్నీ రివర్స్ లో పడుతున్నాయ్

పనులు జరగవలసిన క్రమం కంటె.. విరుద్ధంగా జరుగుతున్నప్పుడు దానిని రివర్స్ గేర్ అనాల్సిందే!
తెలంగాణ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం తెలిసిన విషయమే.. ప్రజామద్దతు పూర్తిగా తమకే ఉందన్న భరోసాతో ఏమోగాని.. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొంత వింత పోకడలు పోతున్నట్టు... ప్రజలు అనుకుంటున్నారు. రాజ్యాంగం ప్రకారం జరగవలసిన పద్ధతుల ప్రకారం కాకుండా.. ఇష్టంవచ్చిన రీతిలో నిర్ణయాలు జరుగుతుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికల తరువాత... ముందుగా సీఎం ప్రమాణం, కుదిరితే వెంటనే మంత్రుల ప్రమాణం, తర్వాత అసెంబ్లీ కొలువుదీరడం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం... కొండొకచో ఆ తరువాత మంత్రివర్గ విస్తరణ ఇలాంటి కార్యక్రమాలు సహజంగా జరుగుతుంటాయి.

కొత్తప్రభుత్వాలు ఏర్పడే నేపథ్యంలో నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టులు అన్నీ చివరి ప్రాధాన్యంగా ఉంటాయి. కానీ.. తెలంగాణాలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంటోంది. ఇంతవరకు ఎన్నికల ఫలితాలు వెలువడి.. దగ్గర దగ్గర  నెలరోజులు అవుతున్నప్పటికీ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగలేదు... కానీ మంత్రివర్గ ఏర్పాటు మాత్రం ఇద్దరితో జరిగిపోయింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు, హోంశాఖ మంత్రిగా మహమ్మద్ ఆలీ ఉన్నారు.

అంతేకాక ఇప్పుడు మంత్రిమండలి నిర్ణయంతో చేయాల్సిన పనులన్నింటినీ.. ఏక పక్షంగా తమ ఇస్టానుసారం చేస్తున్నారు. మంత్రివర్గం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏకపక్షంగా కేసీఆర్ ప్రకటించేస్తున్నారు. పార్లమెంట్ కార్యదర్శులను నియమించాలని కెసిఆర్ ఇప్పటికే ప్రకటించి... దానికి అనువైన విధి విధానాల కోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీచేశారు. గతంలో కూడా ఇదే ప్రయత్నాలు చేసినప్పటికీ.. కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తెలిసిన విషయమే.

అయినప్పటికీ.. ఇప్పుడు మరలా అదే నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అంత అవసరం లేని ఈ విషయంపై ఎందుకు హడావిడి పడుతున్నారో తెలియదు. ఇక కేటీఆర్ మంత్రి కాకపోయినప్పటికీ.. శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయనప్పటికీ.. ఆయన కూడా ప్రభుత్వ విధానాలను, పాలసీలను... అధికారికంగా ప్రకటించేస్తున్నారు. కేసీఆర్, తనతో పాటు ప్రమాణం చేసిన మహమ్మద్ ఆలీతో కలిసి మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పడం నిజంగా హాస్యాస్పదం.

మంత్రివర్గ విస్తరణ.. ఇంతవరకు చేపట్టకపోవడంపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మంత్రులుగా కొనసాగుతున్నప్పుడే.. పనులు జరగడం.. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కష్టమవుతున్న ఇటువంటి పరిస్థితులలో కేసిఆర్ మంత్రివర్గ విస్తరణ కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతుండటం ఆశ్చర్యకరమైన విషయంగా భావించవచ్చు. పంచాయతీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసినప్పటికీ.. శాసనసభను సమావేశపరిచి అందరి దగ్గర ప్రమాణాలు పూర్తిచేయించి మంత్రి మండలి ఇప్పటికే ఏర్పాటు చేయవలసి ఉండేది.

కానీ కేసీఆర్ తాను అనుకున్న రూట్ లోనే వెళుతున్నారు. అదేమంటే.. ముహూర్త బలం బాగా లేదని చెబుతున్నారు... ఒక ప్రభుత్వ అధినేతగా ఉండి జాతకాలపై నమ్మకం కలిగి ఉండడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు వెనుకబడుతుండటం శోచనీయమే. దాదాపు పంచాయతీ ఎన్నికల తతంగం ముగిసేంత వరకు మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు. చేపట్టే అవకాశం ఉండదు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేయలేక.. మంత్రివర్గంలో స్థానం సంపాదించలేకపోవడం చూస్తే... గెలిచిన ఎంఎల్ఎలను అయ్యో పాపం అనిపించకమానదు.

ఇంకొక విషయం... కేసీఆర్ ఎప్పటికో జరగవలసిన విషయాన్ని, మాత్రం ఇప్పుడే చేస్తూ... నిర్ణయాలను ప్రకటించేస్తున్నారు. ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేట్ చేయడానికి ఇంతకుముందు శాసనసభ్యులు అయిన స్టీఫెన్సన్ ను ఖరారు చేయడం కూడా ఇప్పుడు అంత అవసరమైన విషయం కాదని చెప్పవచ్చు. అలాగే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మారెడ్డి శ్రీనివాసరెడ్డికి కూడా అదేదో అర్జంటు పని అయినట్లుగా మంగళవారం నాడు పదవి కట్టబెట్టారు.

ప్రధానమైన పనులు ఎన్ని ఉన్నా... కేసిఆర్ అది ఏదో ప్రాముఖ్యం కలిగిన విషయంగా భావించి, ఈ విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోవడం విస్తుగొలుపుతోంది. మంత్రిమండలిని ఏదో కొన్ని మూఢనమ్మకాలు నమ్మి ఏర్పాటు చేయకపోవడం... తద్వారా ప్రభుత్వ పనితీరును నెమ్మదింప చేయడం ద్వారా కేసీఆర్ ఏం సాధించదలచుకున్నారో... ఆయనకే తెలియాలి. ప్రాధాన్యమైన విషయాలను పూర్తిగా పక్కన పెట్టేసి.. అప్రాధాన్య విషయాలను ముందుకు తీసుకు రావడంపై కేసీఆర్ కూడా ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుందని విమర్శకులు అంటున్నారు.

తాను తిరిగి ఎన్నికైన తరువాత ఇరిగేషన్ శాఖపై ఇప్పటివరకు సమీక్షలు చేసి, ప్రాజెక్టులను సందర్శించిన కేసీఆర్.. దానికి తగిన కసరత్తులో భాగంగా.. మినిస్టర్ లేకుండానే చేయడం జరిగింది. తెలంగాణలో ఎన్నికలలో ఎంత ప్రజామద్దతు పొందినప్పటికీ... చేయవలసిన పనులు రాజ్యాంగబద్ధంగా.. క్రమపద్ధతిలో చేయకపోగా.. రివర్స్ లో పనిచేయడం కేసీఆర్ లాంటి నాయకునికి తగిన పనికాదని పరిశీలకుల భావన.  తొందరలోనే శాసనసభ సమావేశపరిచి... కార్యక్రమాలు నిర్వహించాలని కెసిఆర్ తలుస్తున్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణ జరగకపోతే.. ఆయన అసెంబ్లీ సమావేశాలలో కార్యక్రమాలను తానే ముందుండి నడిపిస్తారా.. లేదా ఇతరులకు బాధ్యత ఇస్తారా.. అనేది తేలాల్సి వుంది. ఇతరులకు బాధ్యత అప్పగిస్తే... అది దేని కింద వస్తుందో కూడా ఆయన తెలియజేయాల్సి ఉంటుంది. లేకుంటే శాసనసభ వ్యవహారాలు కూడా ఇప్పటికే మంత్రిగా ఉన్న మహమ్మద్ అలీనే చూడవలసి ఉంటుంది. ప్రజలు గొప్ప మద్దతు  ఇచ్చి.. అధికారం చేపట్టినప్పటికీ... కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు.. తెలంగాణ మేధావులకు ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయని భావించవచ్చు.

కేసీఆర్ తన తొలి ప్రాధాన్యమైన తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటును  వదిలి పెట్టి... ఆయన గెలిచిన తొలినాళ్లలోనే... ఫెఢరల్ ఫ్రంట్ కోసం.. దేశవ్యాప్త పర్యటన చేపట్టడం కూడా వివాదాస్పదమైన విషయం.. ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్