cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఏంటీ వేలంపాటలు? టెండరు పాటలు?

ఏంటీ వేలంపాటలు? టెండరు పాటలు?

ఒక చిన్న కథ చెప్పుకోవాలి. ఈ కథ కొంత కొత్తరూపాలు సంతరించుకుని ఇటీవలి కాలంలో వాట్సప్ లో కూడా జోకుగా తిరుగుతూ ఉంది. వెనకటికి ఇద్దరు రుషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఎట్టకేలకు ఓ రోజు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలి అని మొదటి రుషిని అడిగాడు.

‘‘ముందు రెండో వాడి దగ్గరకెళ్లు... వాడేం అడిగితే.. ‘‘ప్లస్ 1’’ చేర్చి నాకు ఇవ్వు..’’ అని కోరాడు రుషి. రెండో రుషి దగ్గరికెళ్లాడు దేవుడు. మొదటి రుషి డిమాండ్ ఏంటో కూడా చెప్పాడు. రెండోవాడు వెంటనే.. ‘‘నాకు ఒక కన్ను, ఒక చేయి, ఒక కాలు పోవాలి’’ అని కోరుకున్నాడు. దాంతో ఆటోమేటిగ్గా... మొదటి రుషికి రెండు కళ్లు, రెండు కాళ్లు, రెండు చేతులూ పోయాయి.

ఇందులో అసూయను, తన అవసరాలు తెలియకుండా.. పక్కవాడికంటె ఎక్కువగా ఉండాలని కోరుకునే దుర్బుద్ధిని  తెలియజెప్పే నీతి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇంచుమించుగా అదే జరుగుతోంది. కేసీఆర్ తెరాస మేనిఫెస్టోను ఆవిష్కరించిన తర్వాత.. అందులో ప్రకటించిన అంశాలన్నీ.. కూరగాయల బేరాల్లా.. వేలం పాటల్లా కనిపిస్తున్నాయి.

ఇదే కేసీఆర్  కొన్నాళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అలవిమాలిన వాగ్దానాలు చేస్తోంటే... అతి భయంకరంగా దెప్పిపొడిచారు. కాంగ్రెస్ వాగ్దానాలు నెరవేర్చాలంట.. మొత్తం సౌతిండియా అన్ని రాష్ట్రాల బడ్జెట్ కావాలంటూ ఎగతాళి చేశారు.

కానీ నెమ్మదిగా తెరాసకు భయం పుట్టినట్టుంది. ఎంత భయం అంటే.. మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు అంటూ ప్రకటించి.. కాంగ్రెస్ పాడిన వేలంపాటకు 16 రూపాయలు పెంచి పాట పాడారు. 2000 ఇస్తామని వారంటే.. 2016, 3000 ఇస్తా అంటే 3016.. ఇలా కేసీఆర్ వేలం పాట పాడారు.

తాజాగా మేనిఫెస్టో ప్రకటించిన సమయానికి అందులో వేలం పాటలతో పాటు, బేరాలు- టెండరు పాటలు కూడా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ... ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 చేస్తాం అని ప్రకటిస్తే.. కేసీఆర్ 61 చేస్తాం అంటూ వేలం పాట పాడారు. అదే సమయంలో.. వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సు 58 చేస్తాం అని కాంగ్రెస్ అంటే... కేసీఆర్ 57 చేస్తాం అంటూ టెండరు పాట పాడారు.

చూడబోతే.. ప్రభుత్వాన్ని రద్దుచేసిన నాటికి.. తాము చేపట్టిన సంక్షేమమే మళ్లీ తమను అధికారంలోకి తెస్తుందని మహ ధీమాగా ఉన్న కేసీఆర్ లోని నమ్మకం ఇప్పుడు సడలిపోయినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇలాంటి వేలంపాటలకు, టెండరు పాటలకు దిగుతున్నారని అనిపిస్తోంది. 

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?