Advertisement


Home > Politics - Gossip
కేసీఆర్ ‘ఇంటింటికీ నోటు’ పథకం!

అఫ్ కోర్స్... గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తన తాజా ఆలోచనకు పెట్టిన పేరు ఇదికాదు. కానీ.. ఆ ఆలోచన తీరుతెన్నులు తెలుసుకుంటే మాత్రం ఈ పేరే కరెక్టని అనిపిస్తుంది. ‘ఓటుకు నోటు’ అనే రెండు పదాలు.. ఒక పార్టీని మొత్తం సర్వభ్రష్టత్వం పట్టించేసి, ఒక ప్రభుత్వాన్ని హైదరాబాదు నగరం నుంచి తరిమితరిమి కొట్టిన సంగతి మనందరికీ తెలుసు.

అయితే.. కేసీఆర్ చాలా తెలివిగా చాలా శాస్త్రోక్తంగా.. ‘ఓట్లకు నోట్లు’ పంచడాన్ని ఒక ప్రభుత్వ పథకం కిందకు మార్చేయబోతున్నారు. ఎటొచ్చీ.. తెలంగాణలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మంచి చెడుల గురించి ప్రశ్నించే దిక్కులేదు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టబోయే ముఠాతగాదాల ఆలోచనలతోనే సతమతం అవుతున్నది. గద్దె ఎక్కిన తొలినాటినుంచి ఆడింది ఆటగా పాడింది పాటగా పాలన సాగిస్తున్న కేసీఆర్ తాజాగా రేషన్ షాపులు, నిత్యావసరాల దుకాణాలు అనే పదాలకు అర్థాన్ని పునర్నిర్వచించడానికి సిద్ధం అవుతున్నారు.

తెలంగాణలో రేషన్ షాపుల డీలర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ బాగా గుస్సా అయినట్లుంది. దీంతో అసలు ఏకంగా ‘రేషన్’ అనే వ్యవస్థనే తుడిచిపెట్టెయ్యాలని ఆయన అనుకున్నట్లుగా కనిపిస్తోంది. ‘ఫస్ట్ బ్రాండ్ ది డాగ్ మాడ్, ఇఫ్ యూ వాంట్ టూ కిల్ ఇట్’ అనే సామెత చందంగా.. తనకు కోపం తెప్పించిన రేషన్ వ్యవస్థను నిర్మూలించే ముందు.. ఆ వ్యవస్థ మొత్తం అవినీతి మయం అయిపోయిందంటూ ఆయన సెలవిస్తున్నారు.

బియ్యం పంపిణీ సక్రమంగా జరగడం లేదట. అక్రమ బియ్యం రవాణాకు ఒక మాఫియా ఏర్పడిందట. వేలకోట్లు ఖర్చు చేస్తున్నా ఆశించిన ప్రయోజనాలు దక్కడం లేదట. అందుకని.. రేషన్ షాపులకు బదులుగా.. నేరుగా కార్డుదారులకు డబ్బులే ఇచ్చే పద్ధతిని తీసుకురావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.

అంటే బియ్యం రేషన్ కార్డులున్న వారికి నెలనెలా అకౌంట్లో సర్కారు వారినుంచి డబ్బులొచ్చి పడతాయన్నమాట. బియ్యం తదితర సరుకుల్ని సబ్సిడీపై సరఫరా చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నదో అదే దామాషాలో సొమ్ములు ఇచ్చేస్తారు. దాన్ని వారు ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. నిత్యావసర సరుకులు సబ్సిడీపై పేదలకు ఇవ్వడంలో నాటి ప్రభుత్వాల ఆలోచన వేరు.

ఎన్ని ఇబ్బందులు ఉన్నా..  కనీసం కొన్ని పూటలు అయినా.. నికరంగా భోజనం గడుస్తుందని వారి భావన. అయితే కేసీఆర్.. సొమ్ములిచ్చేస్తే చాలు.. వారు తనపట్ల కృతజ్ఞలై, సదా తమ పార్టీకే ఓట్లు సమర్పించుకుంటూ ఉండగలరని యోచిస్తున్నట్లుంది. చూడబోతే.. ఓట్లకు నోట్లు పంచే ప్రక్రియను ప్రభుత్వం పథకం రూపంలో, ప్రభుత్వ ఖజానా ఖర్చుతో.. రాబోయే ఎన్నికల సంవత్సరం పొడవునా కేసీఆర్ నిర్వహించబోతున్నట్లుంది.