cloudfront

Advertisement


Home > Politics - Gossip

కేట్లు... డూప్లికేట్లు...!

కేట్లు... డూప్లికేట్లు...!

నేతలకు సిండికేట్ల ముడుపులు
ఎన్నికల్లో చక్రం తిప్పేది వాళ్ళే!

రాజకీయ నాయకుల్లో కొందరు కేటుగాళ్ళ కారణంగా మద్యం సిండికేట్లు చెలరేగిపోతున్నారు. కేట్ల అండతో డూప్లికేట్‌ మద్యాన్ని భారీస్థాయిలో తూర్పుగోదావరి జిల్లాలో ఏరులై పారిస్తున్నారు. అధికార టీడీపీ నేతల అండదండతో మద్య సిండికేట్లు సైతం నాయకులుగా చలామణీ అవుతున్నారు. స్థానిక రాజకీయాల నుండి ఎన్నికల్లోనూ సిండికేట్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ మాటకొస్తే పవరు నాయకుడో, ఎవరు లిక్కర్‌ వ్యాపారో తేడా తెలియని పరిస్థితులున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణం బెల్ట్‌ షాపుల్లేకుండా చేస్తామని బీరాలు పలికిన చంద్రబాబు ఇపుడు ఆ హామీ జోలికెళ్ళడం లేదు. అలాగే అక్రమ మద్య ప్యాపారంపై ఆయన దృష్టిసారించిన దాఖలాల్లేవు.

ఇదే అదనుగా కొందరు అధికార పార్టీ నాయకులు సిండికేట్లకు ఇతోథింగా సహాయ సహకారాలందిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా అక్రమ మార్గాల్లో మద్యం విక్రయాలకు దోహదపడుతున్నారు. మరోవైపు అధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో చీప్‌ లిక్కర్‌ నుండి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం వరకూ ఏరులై పారుతోంది. పొరుగు రాష్ట్రాల నుండి సుంకం చెల్లించని మద్యం దొడ్డిదారిలో రాష్ట్రంలో ప్రవేశిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడని ఆయావర్గాలు వాపోతున్నాయి.

నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యం జిల్లాలో ప్రవేశించకుండా చేయటంలో ఎక్సైజ్‌శాఖ వైఫల్యం చెందడంతో అక్రమ మద్యం అమ్మకాలు పెద్దఎత్తున సాగుతున్నట్టు సమాచారం! ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలకు చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యం ఇక్కడ ఏరులై ప్రవహిస్తోంది. ఇదంతా సంబంధిత శాఖల అధికారులకు తెలిసీ జరుగుతోందని, లిక్కర్‌ వ్యాపారులతో కొందరు అధికారులు, రాజకీయ నాయకులకు సన్నిహిత సంబంధాలుండటంతో ప్రేక్షకపాత్ర వహించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యానికి, జిల్లా మద్యానికి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటోంది. చీప్‌ లిక్కర్‌ ధరల్లోనైతే మరింత వ్యత్యాసం ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో చీప్‌ లిక్కర్‌ ధరతో పోల్చిచూస్తే ఇతర ప్రాంతాల మద్యం ధర 50శాతం తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో చీపుగా లభిస్తోన్న చీప్‌ లిక్కర్‌ను కొనుగోలు చేసేందుకు మందు బాబులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా ఆయా రాష్ట్రాల మద్యం బ్రాండ్లు ఇక్కడి మార్కెట్‌లో వెల్లువెత్తుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

గతంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు వంటి జిల్లాల్లో పలువురు నకిలి మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలు జరిగాయి. ఇటువంటి దారుణాలు లూజ్‌ సేల్స్‌ కారణంగా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. అనేక బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల వద్ద మద్యం లూజ్‌ సేల్స్‌ విచ్చలవిడిగా జరుగుతోంది. బ్రాండెడ్‌ మద్యంలో చీప్‌ లిక్కర్‌ కలిపి విక్రయించేందుకు ఈ లూజ్‌ సేల్స్‌ బాగా పనికివస్తోంది.

ఈ అక్రమ చర్య ద్వారా మద్యం వ్యాపారులు రెండు చేతులా అర్జిస్తున్నప్పటికీ, అమాయకులు మాత్రం బలవుతున్నారు. దీనివలన ఓ వైపు జేబులు గుల్లకావడం, మరోవైపు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా మద్యం కల్తీలో జరగరాని తేడా ఏమైనా జరిగితే ప్రాణాలు గాలిలో కలిసిపోవల్సిందే! ముఖ్యంగా చీపు లిక్కరు తాగి మృత్యువాత పడుతున్న సంఘటనలు బయటకు రావడంలేదని, జిల్లాలోని పలుచోట్ల మద్యం దుకాణాల్లో చీపు లిక్కర్‌ను నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యంలో కలిపి విక్రయిస్తున్నట్టు తెలిసింది.

ఇదిలావుండగా ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తరచూ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే సహించేది లేదని స్పష్టంచేస్తోంది. అయితే ఈ రెండూ జిల్లాల్లో ప్రస్తుతం నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మద్యం వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటుచేసి ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.