Advertisement


Home > Politics - Gossip
చివరి సిఎం రీఎంట్రీ ఖరారైపోయిందా?

చివరి సిఎం అంటే ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి, ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడమే కాకుండా, కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామా చేసి వెళ్లిపోయిన కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజకీయ రీఎంట్రీపై వచ్చినన్ని కథనాలు, ఊహాగానాలు మరో నాయకుడిపై రాలేదని చెప్పొచ్చు. విభజన తరువాత మౌనంగా అజ్ఞాతంలో ఉండిపోయిన కిరణ్‌ బిజెపిలో చేరతారని, మళ్లీ కాంగ్రెసులోకే వస్తారని వివిధ రకాలుగా ప్రచారం జరిగింది.

ఇప్పుడు తాజాగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి రీఎంట్రీపై ఓ వార్త ప్రముఖ పత్రికలో తళుక్కుమంది. వార్తనుబట్టి చూస్తే ఇది ఇక ఊహాగానం కాదని, పక్కాగా ఖరారైందని అర్థమవుతోంది. కాని కిరణ్‌కుమార్‌ స్పందిస్తేగాని అసలు విషయం తెలియదు. రీఎంట్రీపై మీడియాలో పలుమార్లు వచ్చిన వార్తలపై కిరణ్‌ స్పందించలేదు. అవునని, కాదని చెప్పలేదు. కాని ఒకటిరెండుసార్లు తనకు తానై రీఎంట్రీ గురించి మాట్లాడారు. అప్పుడు కూడా ఫలాన పార్టీ అని చెప్పకుండా మళ్లీ యాక్టివ్‌ అవుతానని అర్థం వచ్చేలా మాట్లాడారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన కాంగ్రెసులో మళ్లీ అడుగు పెట్టబోతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త్వరలో ఏపీకి వస్తారని, ఆయన సమక్షంలో తీర్థం పుచ్చుకుంటారని, అలా పుచ్చుకోగానే ఎఐసిసి కార్యదర్శి పదవి ఇస్తారని తెలుస్తోంది. కిరణ్‌ కుమార్‌ మౌనంగా ఉన్నప్పటికీ బిజెపి, కాంగ్రెసు నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపే ఉండొచ్చు. బిజెపిలో చేరాలన్నా, సొంత గూటికి మళ్లీ రావాలన్నా బేరాలు కుదరాలి కదా.

ఈ క్రమంలో ఆయన కాంగ్రెసు అయితేనే బాగుంటుందని అనుకున్నారేమో...! అందులోనూ ఆయన తండ్రి హయాం నుంచి ఆయనలో ఉన్నది కాంగ్రెసు రక్తమే కదా. ఏపీలో కాంగ్రెసుకు భవిష్యత్తు లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గత ఎన్నికల పరిస్థితే పురావృతమవుతుందని, వస్తే గిస్తే నామమాత్రంగా కొన్ని సీట్లు రావొచ్చేమోనని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ కాంగ్రెసులో చేరాలనుకోవడం పార్టీపై ఆయనకున్న భక్తి కారణం కావొచ్చు.

గత ఏడాది ఓ సందర్భంలో ఆయన తన సన్నిహితుల వద్ద రీఎంట్రీ గురించి మాట్లాడుతూ  మాటా ముచ్చట అయ్యాయని, పెళ్లికూతురు పేరు గోప్యంగా ఉంచామని  చెప్పారు. తాళిబొట్టు కట్టే తేదీ ఖరారైతే అందరికీ శుభలేఖలు పంపుతానని, తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ఇలా చెప్పి చాలాకాలమైంది. ఆ తరువాత మౌనంగా ఉండిపోయారు.

విభజన తరువాత ఏర్పడిన కొత్త ప్రభుత్వాల పరిపాలనపై, ఇప్పటివరకు జరిగిన ఏ రాజకీయ పరిణామాల మీదా అభిప్రాయాలు చెప్పలేదు.  మధ్యలో ఒకటి రెండుసార్లు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సంకేతాలిచ్చారు. టీవీ ఛానళ్లలోనూ కథనాలొచ్చాయి. మొదట్లో బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో మాట్లాడారని, ముహూర్తం ఖరారైందని ఒక దశలో వార్తలొచ్చాయి.

కాని ఆ ప్రచారం క్రమంగా కనుమరుగైంది. పెద్ద పదవి అడిగారని, అందుకు కమలం నాయకత్వం అంగీకరించలేదని తెలిసింది. అప్పట్లో కిరణ్‌తోపాటు బొత్స సత్యనారాయణ పేరు కూడా ప్రచారంలోకి వచ్చినా ఆయన వైసీపీలో చేరిపోయారు. కిరణ్‌ జగన్‌ పార్టీలో చేరతారని ఎన్నడూ ప్రచారం కాలేదు. ఆ తరువాత కొంత కాలానికి కాంగ్రెసు నాయకులు ఈ మాజీ సీఎంతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొచ్చాయి.

ఏపీలో చతికిలబడిన కాంగ్రెసును బలోపేతం చేయడంలో భాగంగా కిరణ్‌ను తీసుకురావాలని అనుకున్నారు. విభజన విషయంలో ఆయన కాంగ్రెసుతో విభేదించినా అధ్యక్షురాలు సోనియా గాంధీనిగాని, పార్టీనిగాని ఎన్నడూ తూలనాడలేదు. అనుకోని పరిస్థితుల కారణంగా పార్టీకి దూరమయ్యారంతే. దీంతో సోనియాకు, ఇతర ఢిల్లీ నాయకులూ కిరణ్‌ పట్ల సానుభూతి ఉంది. అందుకే మళ్లీ రావాలన్నారు. ఇప్పుడు సమయం వచ్చినట్లుగా ఉంది.

చాలాకాలం క్రితం కిరణ్‌ జన్మదినం సందర్భంగా ఓ న్యూస్‌ ఛానెల్లో ప్రత్యేక కథనం ప్రసారమైంది. కిరణ్‌ పాలనను ఆకాశానికెత్తేసిన ఆ కథనం సారాంశం ఏమిటంటే... కిరణ్‌ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అధికారంలో ఉండగా ఆయన సమర్థతను అపార్థం చేసుకున్నారు. కాని ఆయన సమర్థత ఏమిటో రాష్ట్రం విడిపోయాక ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. విభజన వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయని ఆయన చెప్పారో అవన్నీ ఏపీలో కనబడుతున్నాయి.

ఆయన సమర్ధతకు, పాలనకు తగిన గుర్తింపు రాకపోవడానికి కారణం కిరణ్‌ మీడియాను మేనేజ్‌ చేయకపోవడమే. ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఆయన అవసరం ఇప్పుడు ఎంతగానో ఉందని ప్రజలు భావిస్తున్నారు...ఇలా సాగింది గత ఏడాది కథనం. కాంగ్రెసులో చేరాక  ఏపీ రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.