cloudfront

Advertisement


Home > Politics - Gossip

కొడాలి నానికి మెజార్టీపైనే ఫోకస్‌

కొడాలి నానికి మెజార్టీపైనే ఫోకస్‌

కృష్ణాజిల్లా గుడివాడలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని గెలుపు వైఎస్సార్సీపీకి ఎలాంటి అనుమానాల్లేవు. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలో కొడాలి నానికి వ్యతిరేకంగా బలోపేతమయ్యేందుకు గత కొన్నేళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఎన్ని పిల్లిమొగ్గలేస్తున్నా ఉపయోగంలేదు. నిజానికి, కొడాలి నానిని దెబ్బతీసేందుకు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, అధికార పార్టీ ఆగడాల్ని తట్టుకుని గట్టిగానే నిలబడ్డారు కొడాలి నాని.

గతంలో నాని తెలుగుదేశం పార్టీ నుంచే గుడివాడ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అయితే టీడీపీలో ఎదురైన అవమానాలు, మరీ ముఖ్యంగా టీడీపీలో ఎన్టీఆర్‌ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి, చంద్రబాబు దృష్టిలో టీడీపీ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ఆ తర్వాత కొడాలి నాని టీడీపీని వీడటం, వైఎస్సార్సీపీలో చేరడం తెల్సిన విషయాలే. వైసీపీలో వున్నా, స్వర్గీయ ఎన్టీఆర్‌ కుటుంబమంటే కొడాలి నానికి ఇప్పటికీ అభిమానమే.

ఇటీవల హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబానికి వెన్నంటే వున్నారు కొడాలి నాని. జూనియర్‌ ఎన్టీఆర్‌కి కొడాలి నాని అత్యంత సన్నిహితుడు కూడా. అలా, నందమూరి అభిమానుల దృష్టిలో కొడాలి నానికి మంచి ఇమేజ్‌ వుంది. ఈసారి గుడివాడలో కొడాలి నానిపై దేవినేని అవినాశ్‌ని బరిలోకి దింపుతోంది టీడీపీ. కానీ, ప్రస్తుత సమీకరణాలు చూస్తే, కొడాలి నాని గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు.

'కొడాలి నాని గెలుపు ఖాయం.. మెజార్టీ గురించి మాత్రమే ఆయన ఆలోచించాలి..' అంటున్నారు గుడివాడలో కొడాలి నాని అభిమానులు. బంపర్‌ మెజార్టీతో విజయం సాధిస్తాననీ, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తానని కొడాలి నాని చెబుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన గుడివాడ, గత కొంత కాలంగా వైసీపీకి కంచుకోటగా మారింది. ఆ కోటని మరింత బలోపేతం చేసే క్రమంలో కొడాలి నాని ఈసారి ఎంత మెజార్టీ సాధిస్తారనేదానిపై జిల్లాలో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!