cloudfront

Advertisement


Home > Politics - Gossip

కొడంగల్‌ ఫైట్‌: కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌

కొడంగల్‌ ఫైట్‌: కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌

రావు (దొర) వర్సెస్‌ రెడ్డి ఫైట్‌ అనాలా.? రాజకీయ ఆధిపత్య పోరు అనాలా.? ఇంకేమన్నా అనాలా.? గడచిన కొన్నేళ్లుగా గులాబీ బాస్‌కీ, రేవంత్‌రెడ్డికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీలో వున్నప్పుడూ అదే దూకుడు, కాంగ్రెస్‌లోకి వచ్చాక కూడా అదే దూకుడు.. రేవంత్‌ రెడ్డి, ఏమాత్రం తగ్గడంలేదు. ఆ మాటకొస్తే, తెలంగాణలో కేసీఆర్‌కి ధీటుగా వాగ్ధాటి ప్రదర్శించడంలోనే కాదు, అవసరమైతే కేసీఆర్‌ని మించి 'తిట్లు తిట్టడంలో' కూడా రేవంత్‌ రెడ్డి సిద్ధహస్తుడేనన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

అసలు, కేసీఆర్‌కి రేవంత్‌రెడ్డి మాత్రమే ఎందుకు టార్గెట్‌ అవుతున్నట్టు.? టీఆర్‌ఎస్‌ని విమర్శించే రాజకీయ నాయకులు ఎందరో వున్నారు తెలంగాణలో. కానీ, రేవంత్‌ రెడ్డిని చూసినట్లుగా కేసీఆర్‌ ఇంకెవర్నీ 'రాజకీయ ప్రత్యర్థి'గా భావించడంలేదు. చంద్రబాబు విషయంలో అయినా కేసీఆర్‌ తగ్గుతారేమోగానీ, రేవంత్‌రెడ్డి విషయంలో మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. ఏం.? ఎందుకిలా.? కేసీఆర్‌, ఇంత సీరియస్‌గా రేవంత్‌రెడ్డిని తీసుకుని వుండకపోతే.. రేవంత్‌రెడ్డి ఈస్థాయి నాయకుడు అయి వుండేవాడు కాదేమో.!

'కొడంగల్‌కి రా.. నా సత్తా ఏంటో చూపిస్తా..' అని పలుమార్లు కేసీఆర్‌కి, రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఎన్నికల వేళ, మరింతగా రెచ్చిపోయారు. అంతే, కేసీఆర్‌ పర్యటనకు ముందురోజు రాత్రి.. పోలీసులు, రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేశారు. అర్థరాత్రి, పోలీసులు బెడ్రూమ్‌లోకి వెళ్ళి మరీ రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదమవుతోంది.

ఎన్నికల కమిషన్‌ ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందా.? పోలీసులకు ఆ దిశగా ఆదేశాలు ఇస్తుందా.? అన్న చర్చ యావత్‌ దేశమంతటా జరుగుతోందిప్పుడు. నిజానికి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి భారీగా ఖర్చు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే, టీఆర్‌ఎస్‌ నేతల బంధువుల ఇళ్ళల్లో భారీగా నగదు కూడా బయటపడింది.

అయితే, అది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే. ముందు ముందు ఏదో ఉపద్రవం జరగబోతోందన్న అనుమానాలకు అది అవకాశం కల్పించింది. అది కొడంగల్‌ ఎన్నిక రద్దుకోసమా.? లేదంటే, రేవంత్‌రెడ్డిపై మరింత కఠిన చర్యల కోసమా.? అన్న అనుమానాలు వెల్లువెత్తాయి.. ఆ అనుమానాలే నిజమయ్యేలా వున్నాయిప్పుడు.

ఎన్నికల సమయంలో ఓ అభ్యర్థి అరెస్ట్‌ అన్నది చిన్న విషయం కాదు. పైగా, కాంగ్రెస్‌ పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆయన. గృహ నిర్బంధంతో సరిపోయేదానికి, ముఖ్యమంత్రికి అదనపు భద్రత కల్పిస్తే సరిపోయేదానికి.. వ్యవహారం అరెస్టుల దాకా ఎందుకు వెళ్ళింది.? అంటే, పోలీసుల వెనుక.. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల సంగతెలా వున్నా, గులాబీ పెత్తనం సుస్పష్టమన్నది మెజార్టీ అభిప్రాయం.

సోషల్‌ మీడియా పోటెత్తుతోంది.. రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఆయన అభిమానులు నినదిస్తున్నారు. కేసీఆర్‌ కొరివితో తలగోక్కుంటున్నారా.? ఆ కొరివిని ఆయనే బలోపేతం చేస్తున్నారా.? లేదంటే, ఇదంతా రేవంత్‌రెడ్డి ఓవరాక్షన్‌ ఫలితమేనా.? అసలు కొడంగల్‌లో ఏం జరుగుతుంది.?

ఇప్పటికే తెలంగాణలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా (ఎన్నికల ప్రచార ఖర్చుపరంగా) రికార్డులకెక్కిన కొడంగల్‌, ఇంతకు మించిన 'రణరంగం'గా మారబోతోందా.? వేచి చూడాల్సిందే.

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్