cloudfront

Advertisement


Home > Politics - Gossip

తిరుగుబాటుకు కోమటిరెడ్డి నేతృత్వం!

తిరుగుబాటుకు కోమటిరెడ్డి నేతృత్వం!

కాంగ్రెస్ నుంచి ఎన్ని సీట్లు పుచ్చుకోవాలా అనే విషయంలో నిన్నటిదాకా మూడు పార్టీలే ఎడాపెడా కొట్టుకుంటూ ఉండిపోయాయి. వారిలో ఎవ్వరికీ తాము కోరినన్ని స్థానాలు దక్కలేదు. అయితే తీరా సీట్ల పంపకం ఫైనలైజ్ అయ్యే సమయానికి... హఠాత్తుగా ఎక్కడినుంచో ఊడిపడ్డట్లుగా తెలంగాణ ఇంటిపార్టీ పేరుతో మరో పార్టీ వచ్చి.. ఓ సీటును తమ వాటాగా తీసుకుంది. ఆ పార్టీకి నకిరేకల్ సీటు కేటాయించాలని, కాకపోతే హస్తం గుర్తు మీదే పోటీచేసేలా.. పార్టీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇదే సీటును తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా చిరుమర్తి లింగయ్య తరఫున, కోమటిరెడ్డి చాలా అఫెన్సివ్ గా బ్యాటింగ్ చేస్తున్నారు.

మహా కూటమిలో ఉన్న పార్టీలకు సరిగా సీట్లు కేటాయించడానికి దిక్కులేదు గానీ.. కాంగ్రెస్ తమ కూటమిలోకి కొత్తగా ఇంటిపార్టీని కూడా కలుపుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ భార్య, చెరుకు లక్ష్మికి సీటు కేటాయించి, కాంగ్రెస్ బీఫాంపై పోటీచేయించాలని భావిస్తున్నారు.

అయితే చిరుమర్తి లింగయ్యకు ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే గనుక.. తాను కూడా నల్గొండ నుంచి పోటీచేయను అంటూ కోమటిరెడ్డి ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఒకవైపు వేముల వీరేశం అరాచకాలకు అంతం పలకాలని అంటూనే, చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే తాను పోటీచేయననేంతగా కోమటిరెడ్డి పట్టుపడుతున్నారంటే.. మతలబు అర్థంకావడం లేదు.

పైగా టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ బడా నాయకుల్ని చిరుమర్తి లింగయ్య ఓడిస్తారని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మాటల ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తదితరులకు పరోక్షంగా హెచ్చరికలు పంపుతున్నాడని పార్టీలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తానికి మూడు పార్టీలకు 25 సీట్లు ఇస్తే.. కాంగ్రెస్ ఓ మోస్తరుగా వ్యవహారాలను చక్కబెట్టుకున్నది గానీ, ఇంటిపార్టీకి ఒక టికెట్ ఇచ్చి, ఇంట్లో ముసలం పెట్టుకునేలా కనిపిస్తోంది.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్