cloudfront

Advertisement


Home > Politics - Gossip

'మహా' చేతిలోకే కోదండాస్త్రం!

'మహా' చేతిలోకే కోదండాస్త్రం!

రెండు రోజుల కిందట పరిణామాలు అంత సానుకూలంగా కనిపించలేదు. కానీ తమ బలం సరిపోదనే సంగతి తెలుగుదేశానికి చాలా బాగా తెలుసు. అందుకే తెదేపా నాయకులు, సీపీఐతో కలిసి మడమతిప్పని ప్రయత్నాలను కొనసాగించారు. ఎట్టకేలకు తెలంగాణ జనసమితిని ఒప్పించారు. మొత్తానికి తెలంగాణలో అంతోఇంతో ప్రజానీకంలో గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెజస మహా  కూటమిలో సభ్య పార్టీగా మారింది. ‘మహా’ చేతికి కోదండాస్త్రం దక్కింది.

రెండురోజుల కిందట కాంగ్రెస్, సీపీఐ, తెదేపా కలిసి సాగించిన మంతనాలకు తెజస అసలు రానేలేదు. కానీ, తెదేపా, సీపీఐ నాయకులు మాత్రం కోదండరాంతో చర్చలు కొనసాగించారు. సీట్ల సంగతి ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ.. కోదండరాం ఈ కూటమిలోకి రావడానికి అంగీకరించారు. మరో మూడు చిన్న పార్టీలు కూడా ఈ జట్టులో ఉండబోతున్నాయి. ఆర్ఎస్పీ, తెలంగాణ ఇంటిపార్టీ, ఎమ్మార్పీఎస్ పార్టీలు కూడా.. మహా కూటమిలోనే ఉండి తెరాస ఓటమికి కృషి చేస్తాయని నేతలు ప్రకటించారు.

గురువారం నాడు తెదేపా అధ్యక్షుడు రమణ ఇంట్లో తెజస నాయకులతో సమావేశం జరిగింది. ఈ భేటీలో సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి, తెజస తరఫున కపిలవాయి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. మొత్తానికి సానుకూల నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ఉద్యమం నాటి తెలంగాణ పౌరుల, అమరవీరుల ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా పాలన సాగించడం లేదని ఈ నాయకులు ప్రకటించారు. అందుకే అమరవీరుల స్ఫూర్తితో సరైన తెలంగాణ పాలనను సాగించుకోవడానికి కేసీఆర్ ను గద్దెదించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

అయితే ఈ భేటీలో కాంగ్రెస్ తరఫున ప్రతినిధులెవరూ లేరు. కాకపోతే ఈ నిర్ణయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియజేసినట్లు చెప్పారు. మొత్తంగా ఈ ఆరుపార్టీల  కూటమి.. తెలంగాణలో ఉన్న 119 సీట్లను ఎవ్వరికీ అలక లేకుండా పంచుకునేంత వరకు నమ్మలేం మరి!