Advertisement


Home > Politics - Gossip
ఆన్ లైన్ అడ్డాలో దర్శకేంద్రుడి యావ!

తిరుమల తిరుపతి దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కానుంది. మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల కానుందనేది అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టబోతున్నారనేది సమాచారం. అయితే ఈ పదవి మీద కన్ను ఉన్న చాలా మంది ప్రముఖుల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఉన్నారు.

సంక్రాంతికి సొంతూర్లో గడిపిన సీఎం తిరిగి అమరావతికి వచ్చిన వెంటనే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెళ్లి కలిశారు. టీటీడీ బోర్డు త్వరలో ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రెండు రోజులుగా ఆన్ లైన్ ప్రపంచంలో.. సోషల్ మీడియాలో రాఘవేంద్రరావునే టీటీడీ ఛైర్మన్ చేయబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం యావత్తూ... పనిగట్టుకుని చేయిస్తున్న పెయిడ్ ప్రచారంగా పలువురు పేర్కొంటున్నారు.

నిజానికి సచివాలయ వర్గాలనుంచి కూడా ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఏ రకంగా అయితే... తమ పార్టీలో చేర్చుకోదలచుకున్న ఇతర పార్టీల నాయకుల గురించి ముందుగానే మీడియాలో లీకులు ఇచ్చేసి.. మైండ్ గేమ్ ఆడుతూ వారిమీద ఒత్తిడి పెంచుతారో.. అదే తరహాలో.. రాఘవేంద్రరావు కోటరీ కూడా ఆన్ లైన్ లో పదవి ఆయనకే కట్టబెట్టేస్తున్నట్లుగా ఓ ప్రచారాన్ని ప్రారంభించి.. చంద్రబాబునాయుడుతోనే మైండ్ గేమ్ ఆడుతున్నారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

రాఘవేంద్రునికి తిరుమల వేంకటేశ్వరుని సేవలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. టీటీడీ అధ్యక్ష పదవి అలంకరించలేదు తప్ప.. బోర్డులో సభ్యుడిగా పలు పర్యాయాలు ఆయన ఉన్నారు. ఇటీవల పదవీకాలం పూర్తయిన బోర్డులో కూడా ఉన్నారు. అయితే... ఇటీవలి కాలంలో ఎస్వీబీసీ భక్తి ఛానెల్లో జరుగుతున్న అక్రమాలకు రాఘవేంద్రరావుకు ఉన్న అక్రమ సంబంధాల గురించి నానా గొడవా అయిపోయింది.

సభ్యుడిగా ఉంటూనే.. ఎస్వీబీసీ భక్తి ఛానెల్ ను రాఘవేంద్రరావు స్వార్థం కోసం బజార్లో పెట్టినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి నేపథ్యంలో ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత.. మళ్లీ ఆయనకు సభ్యత్వం ఇచ్చినా కూడా పరువు పోతుందని, ప్రజలు ఛీత్కరించుకుంటారని చంద్రబాబునాయుడు భయపడుతున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తన సభ్యత్వానికే ఎసరు వస్తున్న సమయంలో.. ఆన్ లైన్ ప్రచారం అనేది రాఘవేంద్రరావు కోటరీ పన్నిన వ్యూహంగా పలువురు భావిస్తున్నారు. బోర్డు పదవిని అడ్డు పెట్టుకుని అన్ని అక్రమాలకు పాల్పడిన తర్వాత.. ఈసారి బోర్డులో చోటు దక్కదని అనుకుంటున్న సమయంలో.. ఏకంగా ఆయనను ఛైర్మన్ చేసేస్తున్నారంటూ జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం వ్యూహత్మకమే అని పలువురు కొట్టి పారేస్తున్నారు.