Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేటీఆర్ కేబినెట్.. పూర్తిగా సెప‌రేటా?

కేటీఆర్ కేబినెట్.. పూర్తిగా సెప‌రేటా?

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి మార్పు త‌థ్యంగా క‌నిపిస్తూ ఉంది. త‌న బాధ్య‌త‌ల‌ను త‌నయుడికి అప్ప‌గించి కేసీఆర్ ముఖ్య‌మంత్రి హోదా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టుగా స్ప‌ష్టం అవుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు, కేసీఆర్ మంత్రుల మాట‌లు ఈ అభిప్రాయాన్ని గ‌ట్టిగా క‌లిగిస్తూ ఉన్నాయి. అన్నీ కుదిరితే వ‌చ్చే నెల‌లోనే తెలంగాణ‌కు రెండో ముఖ్య‌మంత్రి, కొత్త ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

కేటీఆర్ సీఎంగా బాధ్య‌తలు తీసుకుంటార‌నే ఊహాగానాలు పాత‌వే, ఇప్పుడు నిజం కాబోతూ ఉండ‌వ‌చ్చు. అయితే.. మొత్తం కేబినెట్ కూడా పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ అవుతుంద‌నే వార్త‌లే ఆస‌క్తిదాయ‌కంగా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కేబినెట్లో పార్టీకి కానీ, ఆయ‌న‌కు కానీ ఎదురుతిరిగే వాళ్లు బ‌హుశా లేరు. ముఖ్య‌మంత్రిపై అప‌రిమిత విధేయ‌త‌నే చూపే వాళ్లున్నారు.

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. వీళ్లే ముందుగా కేటీఆర్ జ‌పాన్ని అందుకుంటున్నారు. కేటీఆర్ సీఎం కావాలి, కేటీఆర్ సీఎం అయితే త‌ప్పేంటి, కేటీఆర్ కు అన్ని అర్హ‌త‌లూ ఉన్నాయంటూ.. కేసీఆర్ మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు.

కేటీఆర్ ఆ బాధ్య‌త‌లు తీసుకోవాలంటూ వీరు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉన్నారు.  ఈ నేప‌థ్యంలో.. ఇలాంటి వారిని కేటీఆర్ అయినా ప‌క్క‌న పెట్ట‌గ‌ల‌రా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యం. అయితే త‌న‌కంటూ ప్ర‌త్యేక టీమ్ ఉండాలంటూ కేటీఆర్ భావించ‌డంలో మాత్రం విచిత్రం లేదు.

త‌న తండ్రి కేబినెట్లో ఉన్న ప‌లువురిపై ఇప్ప‌టికే కేటీఆర్ కు కొన్ని నిశ్చిత‌మైన అభిప్రాయాలు ఉండ‌వ‌చ్చు. త‌న కేబినెట్ కూర్పుచేర్పుల్లో ఇప్ప‌టికే ఏర్ప‌డిన అభిప్రాయాలు క‌చ్చితంగా ప్ర‌భావితం చేసే అవ‌కాశాలున్నాయి.

మ‌రి కేటీఆర్ కేబినెట్ పూర్తి కొత్త‌గా ఉంటుందా, లేక పాత‌కొత్త‌ల క‌ల‌బోతలా ఉంటుందో ఆయ‌న సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాతే తెలియ‌వ‌చ్చు.  ఒక‌వేళ ప్ర‌స్తుత సీనియ‌ర్లు, మంత్రుల్లో ఎవ‌రైనా అప్రాధాన్య‌త‌కు గురైతే వారెలా స్పందిస్తార‌నేది కూడా రాజ‌కీయంగా ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌య‌మే!

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?