cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

కులం కుంపట్లో ఆంధ్రప్రదేశ్!

కులం కుంపట్లో ఆంధ్రప్రదేశ్!

ఇంకా ఎక్కడి వరకూ వెళతారు? కాపులూ, బీసీలు రచ్చకు ఎక్కి కొట్టుకునేంత వరకూ వచ్చేశారు. ఈ రెండు వర్గాల మధ్య ఇప్పుడు ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. టీవీ చర్చా కార్యక్రమాల్లో కాపు సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు దూషించుకుంటున్నారు. ‘రిజర్వేషన్ల’ విషయంలో వీళ్ల మొదలైన చిచ్చు అతి తక్కువ కాలంలోనే తీవ్ర స్థాయికి చేరింది. బహిరంగంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వచ్చింది వ్యవహారం. ఒకరి పోరాటాన్ని మరొకరు కించపరుచుకుంటున్నారు. ఒకరి కోరికలను మరొకరు తప్పుపడుతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఒకరికి ఒకరు శత్రువులయిపోతున్నారు.

మరి ఇంకా రెండేళ్లే అయ్యాయి.. ముందు ముందు వీళ్ల పరిస్థితి ఎక్కడకు వెళుతుంది? ఎలాగూ ఈ రిజర్వేషన్ల అంశం ఇప్పుడప్పుడే తేలదని మాత్రం స్పష్టం అవుతోంది. ఈ అంశం తేల్చడానికి ప్రభుత్వం ఇష్టపడదు. కాపులకు రిజర్వేషన్లు అనే అంశాన్ని చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో వాడుకున్నాడు. రేపటి ఎన్నికల్లో మళ్లీ కాపులనే వాడుకోవాలా.. కాపులను విలన్లుగా చూపుతూ బీసీలను వాడుకుంటాడా.. అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే కాపులకు, బీసీలకు మధ్య బాబు పెట్టిన చిచ్చు.. ఎక్కడి వరకూ వెళుతుంది.. ఎంతమందిని ఆహుతి చేస్తుంది అనేది ఆందోళన కలిగిస్తున్న అంశం. 

ప్రధాన కులాల మధ్య చిచ్చు ఒకవైపు
మా కులరాజ్యమే ఉండాలనడం మరోవైపు
రిజర్వేషన్ల అంశంతో కాపులు, బీసీలకు చిచ్చు పెట్టిన బాబు
పరస్పర దాడులు చేసుకునేంత వరకూ దిగజారిన పరిస్థితి
అప్పుడు ఎస్సీ వర్గీరణ చిచ్చు.. ఇప్పుడు రిజర్వేషన్ల మంట
ఏదో ఒకటి ఎగదోసి చలి కాచుకోవడమే చంద్రన్న పని!

2014 ఎన్నికల్లో గట్టెక్కడానికి తన దగ్గర ఉన్న సమస్త ఆయుధాలనూ వాడేశాడు చంద్రబాబు నాయుడు. పవన్ కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకున్నాడు, మోదీని, బీజేపీని వాడుకున్నాడు, అమలుకు సాధ్యం కాని అడ్డమైన ఉచిత హామీలు ఇచ్చేశాడు.. ఇదే సమయంలో కాపులకు ఒక ఉపముఖ్యమంత్రి పదవి, బీసీలకు మరో ఉపముఖ్యమంత్రి పదవి అంటూ పంపకాలు చేసిన బాబు.. అదే ఎన్నికలతో ఆ రెండు వర్గాల మధ్య ‘రిజర్వేషన్ల’ మంటపెట్టాడు.

కాపులు బీసీలు అయిపోయి.. తమ రిజర్వేషన్లను ఎక్కడ పంచుకుంటారో, జనాభాపరంగా భారీ పరిమాణంలో ఉన్నవాళ్లు తమలోకి వస్తే.. పోటీ ఎక్కువైపోయి, ఇప్పటికే బీసీలుగా ఉన్న తమ అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయో అని ఆ కులాలు భయపడుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాపులు పోరాడుతుంటే బీసీలు వారికి వ్యతిరేకంగా రంగంలోకి దిగుతున్నారు. కాపులను బీసీల్లోకి చేర్చితే సహించేది లేదని బీసీసంఘాల నేతలు బహిరంగ ప్రకటనే చేస్తున్నారు.

వాస్తవంగా చూస్తే.. ఈ సమస్య బీసీలది కాదు, కాపులదీ కాదు. చంద్రబాబు సష్టించినది. కాపులు ఉన్నట్టుండి ఏమీ తమను బీసీల్లోకి చేర్చాలని డిమాండ్ చేయడం లేదు. బాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు అంటున్నారు. ఓట్లు వేస్తే రిజర్వేషన్లు అన్నారు కదా.. అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. దీని ప్రకారం బీసీలు డైరెక్టుగా కాపుల మీద అటాక్ చేయడం సబబు కాదు. చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడే బీసీలు అభ్యంతరం చెప్పాల్సింది. ఎన్నికల ముందే ఈ అంశంపై బీసీలు పోరాటం మొదలుపెట్టాల్సింది. ఇప్పుడు కాపులపై విరుచుకుపడితే.. వాళ్లేం చేస్తారు? తిరిగి దాడులు మాత్రం చేయగలరు. దీనివల్ల ఏమవుతుంది? కాపులూ, బీసీలూ ఇద్దరూ నష్టపోతారు. శాశ్వత శత్రువులు అయిపోతారు. 

రిజర్వేషన్ల హామీని ఎరగా వేసి.. కాపుల ఓట్లను పొంది.. చంద్రబాబు హ్యాపీగా ఉన్నాడు. కానీ తమకు ఆయన హామీని నెరవేర్చడం లేదని కాపులు బాధపడుతున్నారు. అశాంతికి గురి అవుతున్నారు. అయితే ఉన్నట్టుండి ప్రమాదం ముంచుకు వస్తుందని బీసీలు భయపడుతున్నారు. బీసీల్లోకి చేర్చడం లేదని కాపులు, చేరుస్తారేమో అని భయంతో బీసీలు.. అశాంతికి గురి అవుతున్నారు. వీళ్ల మధ్య మంటపెట్టి బాబు ఆ విధంగా ముందుకు పోతున్నాడు.

చంద్రబాబు సంస్కరణ వాది... ప్రత్యేకించి ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడిని తనే అని చెప్పుకునే రకం! ఇలాంటి విషయాలన్నింటినీ ఆయన తన ‘మనసులో మాట’ పుస్తకంలో కూడా రాసుకొచ్చారు. అయితే.. ఓట్ల కోసం ఉచిత హామీలను ఇవ్వడంలో, అనుచితంగా ఉచిత పథకాలకు, ‘చంద్రన్న కానుక’లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఎందుకూ కొరగాని పనులు చేయడంలో ముందున్నది ఆయనే!

చంద్రబాబు ఒక సంస్కర్త.. హద్దులు తొలగించుకొంటూ దూసుకుపోతున్న సమాజానికి తనే స్ఫూర్తి దాతను అని చెప్పుకునే రకం! ఈ విషయంలోనూ ఆయన మనసులో మాటలు బయటపడుతూ ఉంటాయి. ఎవరూ ఎస్సీల్లో పుట్టాలని కోరుకోరు.. అని అనడం ద్వారా తన అంతర్గత విజనేమిటో ఆయన అందరికీ అర్థమయ్యేలా చేశాడు. అంతేనా.. సమాజాన్ని కులాల వారీగా విడగొట్టడంలో కూడా ఆయనకు ఉన్నంత ప్రావీణ్యం అంతా ఇంతా కాదు!

నాడు ఎస్సీల మధ్య.. నేడు వీళ్ల మధ్య!

ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎంత రాజకీయం చేయాలో అంతా చేసి.. మాల, మాదిగల మధ్య మంట పెట్టిన ఘనత మన చంద్రన్నదే! ఎన్టీఆర్‌ను దించేసి బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై జరిగిన రాజకీయం మాల, మాదిగలను శాశ్వత శత్రువులను చేసింది. బాబు సీఎంకాక ముందు కూడా ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఉన్నా.. దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి, మాల మాదిగలను చెరో వర్గంగా విడదీసి.. ఆ పోరాటాన్ని హత్యలు చేసుకునేంత వరకూ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది.1997లో ఎస్సీ వర్గీకరణ గురించి జీవో ఇచ్చారు. 

అయితే.. అది రాజ్యాంగబద్ధంగా లేకుండా చేశారు! జీవో ఇచ్చినట్టే ఇచ్చి.. కోర్టు వద్ద అది చెల్లదనేలా తీర్పు వచ్చే గేమ్ ఆడారు చంద్రబాబు. షెడ్యూల్ కులాలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లతో లాభపడుతున్నది మాలలే అనేది మాదిగల వాదన. జనాభా పరంగా తమ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మాలలు.. అవకాశాలను తన్నుకుపోతున్నారని, తమను తక్కువ చూసే మాలలు ఈ విధంగా తమ పొట్ట కొడుతున్నారనేది మాదిగల ఆందోళన. 

దీంతో వర్గీకరణ చేయాలని.. వారు అంటారు. షెడ్యూల్ కులాలకు ఉన్న వాటాను న్యాయబద్ధంగా పంచాలని కోరతారు. అయితే మాలల అవకాశాలను దెబ్బతీసే ఈ వర్గీకరణకు తాము ఒప్పుకోమని ఆ కులస్తులు అంటారు. ఇలా సాగుతున్న పోరాటానికి బాబు ఆజ్యం పోశాడు. ఎస్సీ వర్గీకరణ అంటూ ఇచ్చిన జీవోలో బోలెడు లొసుగులున్నాయి. జాతీయ ఎస్సీ కమిషన్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా ఎస్సీ రిజర్వేషన్ల అంశం గురించి ఇచ్చిన ఆ జీవో చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఈ విషయంలో మాలల న్యాయపోరాటం చేసి.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయించుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మాలమాదిగలు.. రెండు కులాల వారూ ఉన్న జిల్లాల్లో వారి మధ్య భౌతిక దాడులు జరిగాయి. ఈ గొడవల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మాలలు ప్రధానంగా కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఉంటారు. 

మాదిగలు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో అధికం. ఒక కులం సాంద్రత ఎక్కువగా ఉన్న చోట మరో కులం వారు లేకపోవడంతో పరిస్థితి కొంత వరకూ సద్దుమణిగింది. సుప్రీంకోర్టు ముందు నిలబడలేకపోయిన జీవోను అంతటితో వదిలేసింది చంద్రబాబు ప్రభుత్వం. వర్గీకరణ చేశామంటే చేశామన్నట్టు వ్యవహరించారు.. మాలలు, మాదిగల మధ్య భౌతిక దాడులకు కారణం అయ్యింది ఆ జీవో. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎస్సీల్లో బాబు పెట్టిన చిచ్చు.. అలా కొనసాగుతూనే ఉంది.

అలా ఆయన రైజ్ చేసిన ఎస్సీ వర్గీకరణ చిచ్చుకు.. ఈ కాపుల రిజర్వేషన్ అంశానికి మధ్య చాలా పోలికలే ఉన్నాయి. వర్గీకరణ అంశం లాగే కాపుల రిజర్వేషన్ అంశం కూడా చాలా పాత డిమాండ్. వర్గీకరణ అంశాన్ని రాజకీయంగా వాడుకున్నట్టుగానే బాబు కాపుల రిజర్వేషన్ అంశాన్ని కూడా ఎన్నికల సమయంలో వాడుకున్నాడు. శాస్త్రీయత లేకుండా వర్గీకరణకు జీవో ఇచ్చినట్టుగా.. కాపులకు కూడా ఒక హామీని పడేశాడు. దీన్ని అమలు ఎలా చేయాలో ఆయనకూ తెలీదు, తెలిసినా.. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లడం లేదు. మంజునాథన్ కమిషన్ అంటూ.. పొద్దు పుచ్చుతున్నాడు. అసంతప్తితో రగులుతున్న కాపులను చల్లార్చాల్సింది పోయి... దీని వెనుక జగన్ ఉన్నాడు అంటూ రాజకీయం చేయిస్తున్నాడు చంద్రన్న. హామీ ఇచ్చింది చంద్రబాబు.. దాన్ని నెరవేర్చమంటున్నది కాపులు. మాట నిలబెట్టుకునే ఉద్దేశం లేని బాబు రాజకీయం చేయడానికే కంకణం కట్టుకున్నాడని స్పష్టం అవుతోంది.

మాలలు, మాదిగల మధ్య మొదలైన తరహా యుద్ధమే ఇప్పుడు కాపులకు, బీసీలకు మధ్య రగులుకుంటోంది. దీన్ని చల్లార్చే ఉద్దేశం బాబుకు లేదు. దీన్ని వచ్చే ఎన్నికలకు వాడుకునే వ్యూహంతోనే ఆయన ఉన్నట్టున్నాడు. కాపులకు రిజర్వేషన్ల అంశం ప్రస్తుతానికి పక్కన పెట్టి.. రేపటి ఎన్నికల సమయంలో తిరిగి, అదే హామీతో కాపులను ఆకట్టుకోవడం లేదా.. బీసీలను మరింతగా రెచ్చగొట్టి ‘నేనొస్తే బీసీల ప్రయోజనాలు కాపాడతా..’ అంటూ కాపుల ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరిస్తానని పరోక్షంగా చెప్పి లబ్ధిపొందే ప్రణాళికతో బాబు ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కులం.. బాబుకు నచ్చిన సమీకరణం!

రేపొద్దునే పోలింగ్ అనే సమయంలో కూడా కులం ఆధారిత హామీలనే ఇచ్చిన ఘనత చంద్రబాబుది. ఏపీ రాజకీయ చరిత్రలో కుల రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘనత బాబుదే! అవతల రాజకీయ పార్టీలోని నేతల్లో ఎవరినైనా తిట్టించాలంటే... తన వైపున ఉన్న అదే కులానికి చెందిన వ్యక్తితో తిట్టించడం బాబు కనుగొన్న ఒక టక్కుటమార విద్య. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో అదే పద్ధతి కొనసాగుతోంది. జగన్‌ను తిట్టడానికి, జగన్ విషయంలో తీవ్రంగా విరుచుకుపడటానికి తెలుగుదేశంలో కొంతమంది ‘రెడ్డి’ సామాజికవర్గీయులు ఉపాధి పొందుతున్నారు. ఐటీమంత్రి పల్లె రఘునాథరెడ్డి అయితే.. ఉన్నది కేవలం జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడటానికే అనేది బహిరంగ రహస్యం. బొత్సను తిట్టాలంటే తెలుగుదేశంలోని కాపు నేతే తిట్టాలి. 

పార్టీ సంగతి ఆయన ఇష్టం.. కానీ.. అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ఇప్పుడు పూర్తిగా కులోన్మాదం పతాక స్థాయికి చేరడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక సామాజికవర్గం ప్రముఖులకు మాత్రమే అందలం దక్కుతోందనేది బహిరంగ రహస్యం. మొన్నటి వరకూ పోలీస్ బాస్‌గా ఉండిన వ్యక్తిని.. తెలుగుదేశం పార్టీ అధికారిక సామాజికవర్గం నేతలు ‘మామ..బాబాయ్’ని వరసలు పెట్టుకుని మరీ సంబోధించుకునే వాళ్లు. ఇక రాజధాని అంశం గురించిన నిర్ణయం కేవలం ఒక సామాజికవర్గ ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే తీసుకున్నదనే మాట రెండేళ్ల నుంచి వినిపిస్తున్నదే. 

స్పీకర్ హోదాలోని వ్యక్తి మాట్లాడిన మాటలు వింటే.. ఇది రాష్ట్రాన్ని బాగు పరచడానికి ఏర్పడిన ప్రభుత్వమా లేక ఒక కులం కోసం మొత్తం వ్యవస్థను వాడుకుంటున్న ప్రభుత్వమా అనే సందేహం రాక మానదు. నా కులం.. మన కులం.. మనమే అధికారంలో ఉండాలి, మనమే ఏలాలి.. అంటూ బహిరంగంగానే మాట్లాడే మనుషులకు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే అర్హత ఉంటుందా? ఆ పదవుల్లో కూర్చుని వీళ్లు నీతిమంతమైన, నిస్పాక్షికమైన పనులు చేయగలరా? ఎవరికైనా ఇది సులభంగానే అర్థం అయ్యే అంశం ఇది.

ఎన్నడూ లేని ఐక్యత..

గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న కులంలో ఐక్యత అల్లాటప్పాగా లేదు! కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో అధికారంలో ఉన్న సమయంలో క్యాబినెట్‌ను చూసినా, ఆ పార్టీ ఎంపీల జాబితాను చూసినా.. అన్ని కులాల కలగాపులగంగా ఉండటంతో పాటు, తెలుగుదేశానికి అనుకూలంగా నిలబడే సామాజికవర్గానికి చెందిన ఎంపీలు అరడజను మంది పైనే ఉండే వాళ్లు! ఆంధ్రలో వీరి జనాభాకు అనుగుణంగా వీళ్లకు కాంగ్రెస్ తరపున సీట్లు దక్కాయి.. గెలిచారు.. 

కేంద్రమంత్రులు కూడా అయ్యారు!

అయితే.. ఒక్కసారి విభజన జరగడం, కాంగ్రెస్ పతనానంతరం మొత్తం పరిస్థితి మారిపోయింది. చంద్రబాబుపై తీవ్రస్థాయి పదజాలాన్ని ఉపయోగించి తిట్టిన స్వగోత్రీయులు దశాబ్దాల వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టి అంతా ఒక దరికి చేరుతున్న విధానాన్ని రాష్ర్టం మొత్తం గమనిస్తోంది. ఏం ఐక్యంగా ఉండకూడదా? అనొచ్చు. కానీ.. ‘మన కులమే అధికారంలో ఉండాలి..’ అని బహిరంగంగానే ప్రకటించేస్తున్న స్థితిలో ఇలాంటి పరిణామాలు మొత్తం రాష్ట్రాన్నే ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతున్నాయనే ఆందోళన కలుగుతోంది. 

ఒకవైపు కులాల మధ్య చిచ్చు.. మరోవైపు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనేస్తూ ఫిరాయింపులు చేయించడం.. ఇంకోవైపు పాలనా వ్యవహారాల్లో పూర్తిగా ఒకకులం వారికే పట్టం, వారిదే ఆధిపత్యం, మా కులమే అధికారంలో ఉండాలని.. నిర్భీతిగా బహిరంగంగానే ప్రకటించేసుకోవడం.. వీటిలో ఏ ఒక్కటీ ప్రజాస్వామ్యిక లక్షణం కాదు. కొన్నాళ్ల కిందట వరకూ ఏపీ ప్రజానీకం.. ఉత్తర భారతదేశంలో జరుగుతున్న కుల రాజకీయాలను చూసో.. పక్క రాష్ర్టం కర్ణాటకలో పార్టీల బలాబలాల మధ్య ప్రధాన పాత్ర పోషించే ‘కులం’ అంశం గురించినో చూసి ఆశ్చర్యపోయే వాళ్లు. 

అయితే విభజన తర్వాత కులం విషయంలో ఏపీ పరిస్థితి యూపీలో, బీహార్‌కో తీసిపోనట్టుగా తయారైంది. మిగతా కులాలను అడ్డం పెట్టుకుని.. ఆ కులం ప్రముఖులను వాడుకొంటూ.. ఒక కుల సామ్రాజ్యం నడిపించుకోవాలని ఆ కుల ప్రముఖులు భయం భక్తి లేకుండా ప్రకటించుకునేంత వరకూ వచ్చారు. ఏపీని కులాంధ్రప్రదేశ్‌గా చేసేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే.. మరో రెండేళ్లకు ఎన్నికలు.. అవి దగ్గర పడినప్పుడు ఈ ఉన్మాదం ఏ స్థాయికి చేరుతుందో.. ఎలాంటి వినాశనాలను సష్టిస్తుందో! 

ఇక త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంది, మరోవైపు ముద్రగడ పద్మనాభం పాదయాత్ర, పోరాటం అంటున్నాడు. ఇదే సమయంలో కొంతమంది కాపునేతలు.. ముద్రగడ మీద విరుచుకుపడుతున్నారు. మరి తాము పదవులు పొందాం కాబట్టి.. ఇక రిజర్వేషన్ల అవసరం ఏముంది? అని వీరు వాదిస్తారో ఏమో! చంద్రబాబు మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉంది వీళ్ల తీరు. మంత్రివర్గ విస్తరణలో బాబు వేసే కుల సమీకరణాల లెక్కలు ప్రస్పుటం కానున్నాయి. ఏతావాతా.. ప్రపంచం పురోగమిస్తుంటే, సాధారణ ప్రజానీకం కూడా కులాలను, కట్టుబాట్లను వదిలి.. కులాంతార వివాహాలు చేసుకునే దశకు వస్తుంటే, చంద్రన్న ఆధ్వర్యంలో ఏపీ మాత్రం.. తిరోగమనం దిశగా, కులం కుళ్లులో కుళ్లిపోయే దిశగా వెళుతోంది. ఈ పతనానికి పరాకాష్టలే ఇకపై!

-వెంకట్ ఆరికట్ల

 


×