cloudfront

Advertisement


Home > Politics - Gossip

కుమ్ముకోనున్న తెలుగు తమ్ముళ్ళు

కుమ్ముకోనున్న తెలుగు తమ్ముళ్ళు

ఎన్నికల బరిలోకి టీడీపీ సీనియర్లు
బాబుతో తాడోపేడో అంటున్న నేతలు

ఎన్నికలొస్తుండటంతో కుమ్మేసుకునేందుకు తెలుగు తమ్ముళ్ళు తెగబడుతున్నారు. బరిలోకి దిగేందుకు కదన కూతూహలంతో ఉన్న తెలుగుదేశం సీనియర్లు టిక్కెట్ల కోసం రంగంలోకి దిగారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు సన్నద్ధమవుతున్నారు. వీరిలో కొందరు ఎన్నో ఏళ్ళుగా ఎన్నికల్లో పోటీచేసేందుకు టిక్కెట్లు ఆశించి భంగపడిన వారున్నారు. ఎప్పటిలాగే వివిధ నియోజకవర్గాల్లో ఈదఫా టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు ఒకవేళ అధిష్ఠానం మొండిచెయ్యి చూపించిన పక్షంలో రెబల్స్‌గా దిగేందుకు సిద్ధమవుతున్నారు.

రాజకీయంగా సెంటిమెంట్‌ జిల్లాగా పేరొందిన తూర్పు గోదావరిలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్‌ నేతలు అసమ్మతి జెండాలు పాతారు. అధిష్ఠానానికీ బలమైన సంకేతాలు పంపుతున్నారు. 2019 ఎన్నికల్లో తమకు సీటివ్వని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలో కీలకస్థానంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సహా పలువురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం అధిష్ఠానానికి తీవ్ర శిరోభాగంగా మారింది.

ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప 2014 ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోనసీమ ప్రాంతానికి చెందిన చినరాజప్పకు అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు పెద్దాపురం టిక్కెట్‌ కేటాయించారు. ఇటీవలి కాలంలో మాజీ ఎమ్మెల్సీ, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బొడ్డు భాస్కర రామారావు పెద్దాపురం టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.

2019 ఎన్నికల్లో పెద్దాపురం నుండి తెలుగుదేశం అభ్యర్ధిగా తానే పోటీచేస్తానని ప్రకటించి బొడ్డు కలకం సృష్టించారు. దీంతో చినరాజప్ప రాజకీయ భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి. వచ్చే ఎన్నికల్లో బొడ్డుకు పెద్దాపురం సీటు కేటాయిస్తారని, ఫలితంగా చినరాజప్పకు స్థానచలనం తప్పదని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు.

అయితే కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని చినరాజప్పకు కేటాయించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదేకనుక జరిగితే ప్రస్తుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో తర్వాత రాజకీయ నిరుద్యోగిగా మారే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

తుని నియోజకవర్గానికి చెందిన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు యనమల కృష్ణుడులో ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే 1999, 2014 ఎన్నికల్లో యనమల సోదరులు తుని నియోజకవర్గం నుండి పోటీచేసి పరాజయం చెందారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పోటీకి యనమల రామకృష్ణుడు ఆసక్తి చూపనప్పటికీ ఆయన సోదరుడు పోటీకి సై అంటున్నారు. అయితే ఈ నియోజకవర్గం అభ్యర్ధి మార్పునకు చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి అర్భన్‌ డవలప్‌మెంట్‌ అధారిటీ (గుడా) ఛైర్మన్‌గా ఉన్న గన్నికృష్ణ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుండి అసెంబ్లీ లేక పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.

చాలాకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న తనకు ప్రతీసారీ ఎన్నికల్లో మొండిచెయ్యి చూపారని, ఈ సారైనా టిక్కెట్‌ ఇవ్వని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో సిటింగ్‌ పమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు వ్యతిరేకంగా తయారైన వరుపుల రాజా టిక్కెట్‌ ఆశిస్తున్నారు.

సిటింగ్‌ ఎమ్మెల్యే సుబ్బారావు వచ్చే ఎన్నికల్లో తానే టీడీపీ నుండి పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే ఇప్పటికే టిక్కెట్‌ విషయంలో అధిష్ఠానం ఆశీస్సులు అందుకున్న వరుపుల రాజా వచ్చే ఎన్నికల్లో తానే పోటీచేస్తానని చెబుతున్నారు.

దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ రసకందాయంలో పడింది. కాకినాడ రూరల్‌, పిఠాపురం ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, ఎస్వీఎస్సెస్‌ వర్మల స్థానే వేరేవారికి టిక్కెట్లు కేటాయించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలిసి పలువురు ఆశావహులు రంగంలోకి దిగారు.

తెలంగాణ ఓటరు నాడి... ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?... చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్