Advertisement


Home > Politics - Gossip
'కుర్చీ' వారసత్వానికి సంకేతమా?

ఒక రాజకీయ నాయకుడి గురించి మీడియాలో సానుకూలంగా చర్చ, గొప్పగా ప్రచారం సాగిందంటే ముందు ముందు ఏదో జరగబోతోందనే సంకేతాలు అందినట్లే అనుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు కమ్‌ ఐటీ అండ్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ విషయంలోనూ  సంకేతాలు అందుతున్నాయి. ఇది కొత్త విషయం కాకపోయినా మరోసారి ఆయన చర్చనీయాంశమయ్యారు. ఇంతకూ ఈ మంత్రి గురించి అందిన సంకేతాలేమిటి? కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని, 'కుర్చీ'కి వారసుడు ఆయనేనని.

మెట్రో రైలు ప్రారంభోత్సవ సంరంభం, అంతర్జాతీయ సదస్సు ఉత్సాహంతో సమంగా కేటీఆర్‌ వారసత్వం గురించి ఇంగ్లిషు మీడియాలో పలు కథనాలొచ్చాయి. అత్యంత వైభవంగా జరిగిన ఈ రెండు కార్యక్రమాల్లోనూ కేసీఆర్‌ కంటే కేటీఆర్‌ పేరే మారుమోగింది. ఆయనే ప్రత్యేక ఆకర్షణగా, సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. జీఈఎస్‌లో భాగంగా జరిగిన చర్చా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన కేటీఆర్‌ చేసిన అద్భుత ప్రసంగానికి ఇవాంకా ట్రంప్‌తోపాటు అనేకమంది తెలుగు ప్రముఖులు, నెటిజన్లు ఫిదా అయిపోయారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బాధ్యతను మీదేసుకొని ఘన విజయం సాధించినప్పుడు ఈయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. మళ్లీ  మరోసారి కేటీఆర్‌ షో నడిచింది. ఇది మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సదస్సు అయినప్పటికీ అందులో మంత్రి కీలక పాత్ర పోషించడం విశేషం. నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి సైతం ప్రశంసలతో ముంచెత్తారు.

చాలామంది ఆయన్ని రాజకీయ నేతగా, మంత్రిగానే కాకుండా, ఐటీ సాంకేతిక నిపుణుడిగా కూడా గౌరవిస్తున్నారు. కేసీఆర్‌ సమక్షంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కేటీఆర్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేసీఆర్‌ వారసుడు కేటీఆరేనని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని అన్నారు పలువురు నాయకులు.

మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సిద్ధమై కత్తెర చేతిలోకి తీసుకున్న ప్రధాని మోదీకి మంత్రి  గుర్తొచ్చారు. 'కేటీఆర్‌ కహా హై' అంటూ ఆరా తీసి, అటూఇటూ చూసిన మోదీకి కేటీఆర్‌ కాస్త దూరంగా నిలబడి ఉండటం కనిపించింది. అలా దూరంగా నిలబడితే ఎలా అంటూ దగ్గరకు పిలిచారు. ఇదో విశేషంగా చెప్పుకోవచ్చు. మెట్రో రైల్లో ప్రయాణించేటప్పుడు మోదీ పక్కనే కూర్చోగా, కేసీఆర్‌ గవర్నర్‌ పక్కన కూర్చోవడం ఇంకో విశేషం.

మెట్రో విశేషాలను, ప్రత్యేకతలను కేటీఆర్‌ ప్రధానికి వివరించారు. ఇక కేటీఆర్‌ హైదరాబాదులో మెట్రో ప్రారంభోత్సవం, అంతర్జాతీయ సదస్సులో బిజీగా, ఆకర్షణగా ఉండగా, అదే సమయంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు ఢిల్లీలో ఉన్నారు. ఇరిగేషన్‌ మంత్రికి ఈ రెండు వ్యవహారాలతో సంబంధం లేదని, ఇందులో  నిర్వహించాల్సి పాత్ర ఏమీ లేదని, దీంతో ఆయన నీటిపారుదల ప్రాజెక్టుల విషయాలు కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్లారని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పారు. కాని అసలు విషయం రాజకీయమేనని కొందరన్నారు.

కేటీఆర్‌ కీలకపాత్ర పోషిస్తూ, ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సమయంలో అక్కడ ఉండలేక ఏదో సాకు చెప్పి ఢిల్లీ వెళ్లిపోయారని కొందరు గుసగుసలాడుకున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియకపోయినా మీడియాలో ఇదో చర్చనీయాంశమైంది. వారసత్వ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా హరీష్‌రావు విషయం తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తోంది.

ఇక కేటీఆర్‌ పాత్ర చూసి, ప్రసంగం విన్న ఇవాంక ట్రంప్‌ ఆయన్ని అమెరికాకు ఆహ్వానించారు. ఆయన ప్రసంగం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మంత్రిగా, రాజకీయ వ్యూహకర్తగా విజయం సాధించిన  కేటీఆర్‌కు, కవితకు వచ్చిన ప్రధాన వారసత్వం 'మాటకారితనం'. మరో మాటలో చెప్పాలంటే టాకింగ్‌ పవర్‌. నిజానికి పవర్‌ అనడం కూడా సరికాదు. సమ్మోహనంగా మాట్లాడే శక్తి అనొచ్చు. నాయకులంతా మాట్లాడతారు. కాని ప్రజలను సమ్మోహితులను చేసే శక్తి కొద్దిమందికే ఉంటుంది. అది అన్నాచెల్లెళ్లకు పుట్టుకతో బదిలీ అయింది.

కేటీఆర్‌ తన పనితీరుతోనే కాకుండా మాటలతోనూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. విచిత్రమేమిటంటే కేసీఆర్‌ను, ఆయన సంతానాన్ని రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా వారి ప్రసంగాలను మెచ్చుకుంటారు. కొంతకాలం కిందట యాపిల్‌ మాప్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో చేసిన ప్రసంగం దుమ్ము రేపింది. కొందరు ఆంధ్రా నెటిజన్లు 'మా రాష్ట్ర మంత్రులు నిద్రపోతున్నారు' అని కామెంట్‌ చేశారు. 'కేటీఆర్‌ వంటి మంత్రి ఆంధ్రప్రదేశ్‌లో లేడు' అని అక్కడివారు వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ తమ రాష్ట్రానికొచ్చి కొన్నాళ్లు ఉండాలని కొందరు కామెంట్‌ చేశారు. అదేదో యాడ్‌లో అన్నట్లుగా 'ఏమిటీ..కేటీఆర్‌కు ఇంత డిమాండా?' అనుకోవల్సివస్తోంది.

-మేనా