
ఏపీపై కాంగ్రెస్ పార్టీకి ఆశలు చావలేదు. తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా ఇస్తున్న కొత్త హోప్స్ కాంగ్రెస్‌పార్టీ వాళ్లను ఉత్సాహ పరుస్తున్నట్టుగా ఉంది. లేకపోతే రాహుల్‌గాంధీ ఏపీకి రావడం విచిత్రం కదా. కాంగ్రెస్ పార్టీతో జతకలవడానికి చంద్రబాబు నాయుడు ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ విషయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు కొంతమంది వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం తెలుగుదేశం పార్టీతో జతకలిస్తే.. పొత్తులో భాగంగా తమకు సీట్లు వస్తే.. తెలుగుదేశం ఓట్లతో భయటపడొచ్చేమో అని ఆశిస్తున్నారు.
చంద్రబాబుకు వేరే సమీకరణాలున్నాయి. కాంగ్రెస్‌కు పడే పదో పరక ఓట్లు కలిసివచ్చినా మేలే కదా అనేది చంద్రబాబు లాజిక్కు. ఎలాగూ తను కచ్చితంగా ఓడిపోయే నియోజకవర్గాలనే చంద్రబాబు కాంగ్రెస్‌కు కేటాయిస్తాడు. కాబట్టి కొత్తగా వచ్చే లాస్ లేదనేది బాబు లెక్క. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మీద. అలాంటిది కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ జతకలిస్తే ఆ పార్టీని జనాలు చీదరించుకుంటారు కదా.. అనే సందేహం ఉన్నా, చంద్రబాబు మాత్రం దేన్నీ లెక్క చేసేట్టుగా లేడు.
తను మ్యానిపులేట్ చేయగలను అనేది చంద్రబాబు నాయుడి విశ్వాసం కావొచ్చు. ఎలాగూ మీడియా అండ ఉంది కాబట్టి.. కాంగ్రెస్‌తో జత కలవడం రాష్ట్రాన్ని ఉద్ధరించడమే అని బాబు ప్రచారం చేసుకోగలడు. ఇక ఈ మేరకు ఇప్పటికే పచ్చమీడియా పని మొదలుపెట్టింది. ఇదివరకూ మోడీని చూపించి మోసంచేశారు, ఇప్పుడు రాహుల్‌ను చూపించి కొత్త నాటకం మొదలుపెట్టారు. గత ఎన్నికల ముందేమో మోడీ వచ్చి రాష్ట్రానికి హోదా ఇస్తారని అన్నారు. నాలుగేళ్ల పాటు హోదా కన్నా మించి కేంద్రం ఎంతో చేసిందని ప్రచారం చేశారు, ఇప్పుడు మాత్రం హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని చెబుతున్నారు.
రాహుల్ వస్తే హోదా అని అంటున్నారు. ఈ విధంగా కొత్త నాటకం మొదలైంది. ఈ వ్యవహారం అలా సాగుతుండగా.. ఇదే సమయంలో రాహుల్‌ను ఏపీలో దింపారు. దింపడం అయితే దింపారు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌గాంధీ సభను సక్సెస్ చేయడం అంటే కాంగ్రెస్ నేతలకు తలకు మించిన భారమే. కొద్దో గొప్పో బెటర్మెంట్ కోసం కర్నూలులో సభను నిర్వహిస్తున్నారు. అక్కడ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నాడు కాబట్టి.. కొంతవరకూ జనాలను రప్పించగలడని అంచనా.
గత ఎన్నికల్లో ఈయనకు కొన్ని ఓట్లు వచ్చాయి. అయితే నాలుగేళ్ల తర్వాత జనాలను సభలకు రప్పించేంత శక్తి ఉందా అనేది ప్రశ్నార్థకమే. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అతి తెలివి కూడా ఉంది. కర్నూలులో సభను నిర్వహించడం ద్వారా కర్ణాటక నుంచి జనాలను తోలే అవకాశం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలో ఉంది. అక్కడ కూటమిలో కాంగ్రెస్ నేతలది ముఖ్యపాత్ర. ఇప్పుడు ఏపీలో పార్టీ పరిస్థితి వాళ్లకూ తెలుసు. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ ఏపీకి వస్తున్నాడంటే జనాలను తోలడానికి వాళ్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇది కాంగ్రెస్‌కు కొత్త ఏమీకాదు. రెండున్నర సంవత్సరాల కిందట అనంతపురం జిల్లాలో ఉపాధిహామీ పథకం పదేళ్లు పూర్తి చేసుకుందంటూ ఒక సభను నిర్వహించారు. అప్పుడు కర్ణాటక నుంచి జనాలను భారీఎత్తున తరలించారు. ఇప్పుడు కర్నూలుకు కూడా కర్ణాటక పెద్దదూరం ఏమీకాదు. సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలకు జనాలను తరలించే బాధ్యతను అప్పగించారని తెలుస్తోంది. ఏపీలో సభను నిర్వహిస్తూ కర్ణాటక నుంచి జనాలను తరలిస్తూ కాంగ్రెస్ పార్టీ తమ వాపును చూపించాలని చూస్తోంది.