cloudfront

Advertisement


Home > Politics - Gossip

కర్నూలు టీడీపీలో గ్రూపుల గోల!

కర్నూలు టీడీపీలో గ్రూపుల గోల!

కేఈ వర్గం, ఇప్పుడు కోట్ల వర్గం ఎంట్రీ, ఇంకోవైపు టీజీ వెంకటేష్‌ హంగామా, ఆపై భూమావర్గం, ఇంకోవైపు ఏవీ సుబ్బారెడ్డి, ఇంకా ఎస్పీవై రెడ్డి, వీళ్లందరూ గాక మిగతా నియోజకవర్గాల వారీగా వేర్వేరు గ్రూపులు! ఒక వర్గాన్ని అణచడానికి మరోవర్గం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ముందుగా భూమా వర్గానికి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనకు ఆళ్లగడ్డ లేదా, నంద్యాల ఎమ్మెల్యే టికెట్లలో ఏదో ఒకటి కావాలని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు. అంతేకాదు.. ఈ విషయంలో పార్టీలో మద్దతు సంపాదిస్తున్నారీయన.

ఎస్పీవై రెడ్డి నుంచి ఏవీ సుబ్బారెడ్డి మద్దతు పొందారట. నంద్యాల ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో ఎస్పీవై మద్దతు ఏవీకే అని తెలుస్తోంది. ఇలా భూమా వర్గానికి కూడా వైరిగా మారుతున్నారు ఎస్పీవై. ఇక కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో కొత్త పోరు మొదలైంది. ఇప్పటివరకూ ఈ సీటు విషయంలో ఎస్వీ మోహన్‌ రెడ్డి వర్సెస్‌ టీజీ వెంకటేష్‌ అన్నట్టుగా సాగింది పోరు.

కోట్ల టీడీపీలోకి ఎంట్రీ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ను కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలనే ప్రతిపాదన తెస్తున్నారట కేఈ బ్రదర్స్‌. ఆమె డోన్‌ సీటు జోలికి రాకుండా ఉండటానికి కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ప్రతిపాదన పెడుతున్నారట. ఈ దెబ్బతో అటు ఎస్వీ, టీజీ ఇద్దరికీ చెక్‌ చెప్పొచ్చనేది కేఈ సోదరుల లెక్క అట.

ఇప్పటికే కర్నూలులో టీడీపీ పాత వారికి, ఫిరాయింపుదారులకు మధ్యన అతుకులబొంతలా తయారైంది. కోట్ల ఎంట్రీ ఇస్తే.. ఈ గ్రూపుల గోల మరింత పెరుగుతుందని.. రచ్చలు తీవ్రస్థాయికి చేరడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా