Advertisement


Home > Politics - Gossip
మహిళా ఎంపీగారు భలే సెలవిచ్చారే

‘‘ఆధారాలు లేకుండా.. ఆందోళనలు చేయలేం’’ ఈ డైలాగు మేధావులు, సామాజిక ఉద్యమ కారులు చెప్పవలసినది. రాజకీయ నాయకులు చెప్పవలసినది కాదు. కారణం ఉన్నా లేకపోయినా కూడా.. ప్రజల్లో గుర్తింపు, ఆదరణ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేయడం అనేదే సాధారణంగా రాజకీయ నాయకుల ఎజెండాగా ఉంటుంది. 

అయితే వైసీపీ టికెట్ మీద గెలిచి ప్రస్తుతం తెలుగుదేశం వారి సేవలో తరిస్తున్న ఎంపీ కొత్తపల్లి గీత మాత్రం.. చిత్రమైన భాష్యం చెబుతున్నారు. ‘ఆధారాలు లేకుండా ఆందోళనలు చేయలేం’ అని ఆమె అంటున్నారు. అటు తెదేపా, ఇటు వైకాపాలకు చెందిన ఎంపీలంతా.. ఇటీవలి లోక్ సభ సమావేశాల్లో తీవ్రస్థాయిలో.. విరుచుకుపడగా.. తన సీటునుంచి కదలకుండా కూర్చుండిపోయిన ఈ ఎంపీగారు.. ఆందోళనకోసం ఆధారాల గురించి మాట్లాడడం చిత్రంగానే ఉంది.

ఎందుకంటే..

నిధుల కేటాయింపు, విడుదల- అందుబాటు, ఖర్చు, బకాయిలు ఈ రెండు విషయాల్లో కొన్ని రోజులుగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య చర్చోపచర్చలు నడుస్తూనే ఉన్నాయి. పార్లమెంటులో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి వారు తాము రాజీనామాలు చేసేస్తాం అంటూ.. ప్లకార్డులు పట్టుకుని.. కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రయత్నించారు.

అయితే వైకాపానుంచి తెదేపాలోకి ఫిరాయించి.. తాము కూడా వారితో జతకలిసి ఆందోళన చేస్తే అనర్హత వేటు పడుతుందేమో అనే భయంతో.. కుర్చీల్లో కదలకుండా కూర్చున్న ప్రముఖులు కొత్తపల్లిగీత, బుట్టా రేణుక మాత్రమే. వారిద్దరూ కనీసం పార్లమెంటు వెలుపల మీడియాతో కూడా బడ్జెట్ లో అన్యాయం గురించి పెదవి విప్పలేదు. 
మళ్లీ ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లాలని అనుకున్నారో గానీ.. ఇప్పుడు ఆమె ఆందోళన చేయడానికి సరైన ఆధారాలు లేవని అంటున్నారు. అయినా.. ఆందోళనకు రాష్ట్రానికి జరిగిన అన్యాయం చాలదా అనేది ప్రజల ప్రశ్న. మరి ఎంపీగారు రాష్ర్టానికి జరిగిన అన్యాయానికి కూడా ఆధారాలు లేవని అన్నా ఆశ్చర్యం లేదు.

మహిళా ఎంపీ ఇస్తున్న ట్విస్టు ఏంటంటే.. ప్రస్తుతం లెక్కలు కడుతున్న కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో ఏ విషయం తేల్చి.. ప్రకటనలు చేసిన తర్వాత.. క్లారిటీ తెచ్చుకుని అప్పుడు చంద్రబాబుకు లేఖ రాస్తారుట. కేంద్రం ప్రకటన చేసిన తర్వాత.. చంద్రబాబుకు లేఖ రాయడం ఏమిటో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు. కాకపోతే... విశాఖకు రైల్వే జోన్ మాత్రం వచ్చి ఉండాల్సిందే అని ఈ అరకు ఎంపీ అంటున్నారు. మరి ఇదేమాట పార్లమెంటు జరుగుతున్నప్పుడు అని ఉంటే.. నీ నోటి ముత్యాలు రాలిపోయి ఉండేవా అమ్మా అని జనం ఆమెకు విన్నవించుకుంటున్నారు.