cloudfront

Advertisement


Home > Politics - Gossip

లగడపాటి సన్నాయి నొక్కులు

లగడపాటి సన్నాయి నొక్కులు

పాత పౌరాణిక సినిమాల్లో బాణాల ఆటలు భలేగా వుంటాయి. వీళ్లు పాము బాణం వేస్తే, వాళ్లు గరుక్మంతుడు బాణం వేస్తూ వుంటారు. తెలంగాణ ఎన్నికల వ్యవహారం అలాగే వుంది.

నిన్నటికి నిన్న ఓ పాపులర్ చానెల్ టీఆర్ఎస్ కు అనుకూలమైన సర్వే వండి వార్చింది. దానికి విరుగుడు అన్నట్లుగా ఇప్పుడు లగడపాటి తన చాతుర్యం అంతా వాడి, కాంగ్రెస్ కు ఎడ్జ్ వుంది అనేటట్లుగా ఓ సర్వే వదిలారు. ఈ సర్వే ఓ బ్రహ్మ పదార్థం లా వుంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అన్వయించుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. 

ఆఫ్ కోర్స్ తెలుగుదేశం అను'కుల'మీడియా అప్పుడే కూటమిదే విజయం అని లగడపాటి తీర్మానించేసినట్లు వార్తలు ప్రసారం చేయడం ప్రారంభించేసింది అనుకోండి. అసలు ఇంతకీ లగడపాటి చెప్పిన దానికి లాజిక్ లు పక్కన పెడితే, కనీసపు ఈక్వేషన్లు ఏమన్నా వున్నాయా?

నాలుగు జిల్లాలో కూటమి, మూడు జిల్లాల్లో టీఆర్ఎస్, రెండు జిల్లాల్లో హోరా హోలీ, ఒక జిల్లాలో మజ్లిస్ లీడ్ లో వున్నాయన్నది ఆయన పాయింట్.

దీని ప్రకారం కూటమికి నాలుగు జిల్లాలు, టీఆర్ఎస్ ప్లస్ మజ్లిస్ కు నాలుగు జిల్లాలు. రెండు హోరా హోరీ అంటే సమానం. అంటే టోటల్ గా ఫలితాలు సమానంగా వుంటాయని అనుకోవాలా?

సరే, ఈ సంగతి పక్కన పెడితే కొత్తగా ముగ్గురు అభ్యర్థులు గెలుస్తారని పేర్లతో ప్రకటించేసారు. ఇది ఆయా చోట్ల ఓటర్లను ప్రభావితం చేసినట్లు కాదా?న్యూట్రల్ ఓటర్లను ప్రభావం చేసే ప్రయత్నం కిందకు రాదా?

ఆయన స్నేహితులు పోటీ చేస్తున్నారట. అక్కడ మాత్రం సర్వే ఫలితాలు చెప్పరట. అంటే ఈయన స్నేహితులు అయితే ఒకలాగా, వేరే చోట అయితే మరొకలాగానా? వాళ్లు మనుషులు కాదా? అభ్యర్థులు కాదా? ఈయన స్నేహితులే అభ్యర్థులా? 

ఇప్పుడు ఈయన ఫలానా చోట్ల ఫలానా వాళ్లు గెలుస్తున్న చోట, వాళ్ల ఫ్రత్యర్థులు నిరాశతో ఏదైనా చేసి, దానికి బాధ్యత లగడపాటిదే అంటే ఆయన బాధ్యత వహిస్తారా? లగడపాటి ఇలాచేయడం సబబేనా? తప్పు కాదా?

సరే, ఇవన్నీ కూడా అలా వుంచుదాం. లగడపాటి మరో ముచ్చట చెప్పారు. గత ఎన్నికలంత శాతం ఓట్ల పోల్ అయితేనే తన జోస్యం ఫలిస్తుందట. లేకపోతే లేదట. ఏమన్నా అర్థం వుందా? పోలింగ్ శాతం పక్కాగా అంతే వుంటుందనడానికి ఎక్కడయినా ఆస్కారం, లాజిక్ వుందా? ఇదంతా గోడమీద పిల్లి వాటం మాదిరిగా, అన్యాపదేశంగా కేసిఆర్ అండ్ కో విజయానికి ఎదురు ఈదుతున్నారని చెప్పడం తప్ప వేరు కాదు కదా?

సరే, లగడపాటి ముచ్చట పక్కన పెడదాం. 

ఇప్పుడు ఈ సర్వే చెబుతున్నది ఏమిటి? తెలంగాణలో స్వీప్ అనేది రావడం లేదు అని. అంతే కదా? స్వీప్ అనేది రాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కష్టసాధ్యం. ఎందుకంటే, కూటమి లో ఇప్పటికే చేరాల్సిన పార్టీలు చేరిపోయాయి. కొత్తగా చేరేవి లేవు. భాజపా ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించదు. మజ్లిస్ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించేసింది. ఆ రెండింటికి 15 సీట్లు వచ్చినా చాలు. ఓ నలభై సీట్లు టీఆర్ఎస్ కు వచ్చి గట్టెక్కిపోవడానికి.

ఇదే భయం వుంది లగడపాటికి కావచ్చు, ఆంధ్ర తరపున మనసులో వకాల్తా తీసుకునే బిజినెస్ సర్వేయర్లకు కావచ్చు. అందుకే గట్టిగా మాట్లాడడం లేదు. మళ్లీ లగడపాటి లాంటి వాళ్లు హైదరాబాద్ లో వ్యాపారాలు సాగించాలి కదా? మామూలు జనాలకు కేసిఆర్ కు ఓటు వేసినా, వేయకున్నా పంచాయతీ లేదు. ఈ బడా బాబులకే సమస్య. అందుకే గట్టిగా మాట్లాడకుండా, సన్నాయి నొక్కులు నొక్కుతూ, కూటమి విజయం కోసం తాము చేయగలిగింది చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

చూడాలి ఏడున లగడపాటి ఇంకెన్ని కబుర్లు చెబుతారో?