cloudfront

Advertisement


Home > Politics - Gossip

వలస వెళ్లదలచుకుంటే తస్మాత్ జాగ్రత్త!

వలస వెళ్లదలచుకుంటే తస్మాత్ జాగ్రత్త!

105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి.. అసంతృప్తుల బెడద కూడా అంతే ఎక్కువగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో అసంతృప్త తెరాస నాయకులకు , పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు మధ్య పొసగడం లేదు. ఇంకా చెప్పాలంటే యుద్ధవాతావరణం నెలకొని ఉంది. కొన్నిచోట్ల తిరుగుబాటు అభ్యర్థులు ఇప్పటికే పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరారు. కొందరు ఇంకా ఆశ చావక అదే పార్టీలో ఉండి, తమ తమ నియోజకవర్గాల్లో అంతర్యుద్ధాన్ని తలపించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరికొందరు... తాము ఇండిపెండెంటుగా పోటీచేస్తాం అని తొడకొడుతున్నారు. ఒక నాయకుడైతే ఏకంగా.. సాక్షాత్తూ కేసీఆర్ వచ్చి పోటీచేసినా తన మీద నెగ్గలేడని, తాను ఎమ్మెల్యేగా బరిలోకి దిగడం ఖరారు అని తేల్చేయడం కూడా జరిగింది.

ఒక రకంగా చెప్పాలంటే.. ఇప్పుడు వ్యక్తం అవుతున్నన్ని తిరుగుబాట్లు ఇలాగే కొనసాగితే గనుక.. అంటే.. ఈ తిరుగుబాటు నాయకులను పూర్తిస్థాయిలో మమేకం అయి పనిచేసే విధంగా పార్టీ అధిష్టానం బుజ్జగించలేకపోతే గనుక.. తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ ఎన్నికల్లో సింపుల్ మెజారిటీకి తగిన సీట్లు రాకపోయినా ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు.

అలాంటి నేపథ్యంలో.. తమకు నష్టం జరగకుండా ఉండేందుకు తెరాస అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? కేటీఆర్, హరీశ్ రావు తమ వంతుగా అసంతృప్తులందరినీ రకరకాల తాయిలాలతో బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే చాలా కేసులు వారి లెవెల్ లో లొంగడం లేదు. అలాంటి వాటిని వారు , కేసీఆర్ కు రెఫర్ చేస్తున్నారు.

మరో ట్విస్టు ఏంటంటే.. తెరాస నాయకులందరి జాతకాలు, వారు చేసే అన్ని రకాల తప్పుడు పనులు, ఆ రూపేణా వారి జాతకాలన్నీ కేసీఆర్ వద్ద వేర్వేరు ఫైల్స్ గా భద్రంగా ఉన్నాయని... ఎవరు తోకజాడించినా.. ఒక్కొక్కరి మీద కేసుల్ని బయటకు తీస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అసలే ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కు చెందిన వారి మీద.. ఎడాపెడా కేసులు బనాయించేస్తున్నారు. ఇక సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసి.. మరో గూటికి చేరితో అంత ఈజీగా వదలిపెడతారా? అనే చర్చ జరుగుతోంది. పార్టీని వీడిపోవడానికి నిర్ణయించుకున్న కొందరు నాయకులు కూడా.. తర్వాత సైలెంట్ అయిపోవడానికి వెనుక ఇలాంటి భయాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే, వలస వెళ్లదలచుకున్న నాయకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పలువురు భావిస్తున్నారు.