Advertisement


Home > Politics - Gossip
‘అబద్ధం’ కాస్తా.. ‘అవగాహనలోపం’ అవుతుందా?

పవన్ కల్యాణ్ ప్రతిసారీ ‘నా బలం చాలడంలేదు’ అంటూ ఉంటారు. తద్వారా ‘లేదు లేదు అలా అనకండి.. తమరు మహా బల సంపన్నులు’ అని అందరూ ఒకసారి శ్లాఘించాలనేది ఆయన అంతరార్థమో ఏమో మనకు తెలియదు. అయితే.. ఆ మాటను ఆయన చాలా నిజాయితీగా చెబుతుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ హీరోకు లేని రీతిలో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్.. అలా అంత తేలికగా తన గురించి తాను మాట్లాడేస్తే.. ఏంటబ్బా అని మనకు అనుమానం కలుగుతుంది. 

బలం చాలకపోవడం సంగతి ఏమోగానీ.. ఆయనకు క్లారిటీ మాత్రం చాలడలేదు. ‘ప్రభుత్వాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి’ అని ఆయన అన్నారు గానీ.. ఎవరూ ఏమీ చేయకపోయినా.. తానే కన్ఫ్యూజ్ అయిపోయే టైపుగా ఆయన కనిపిస్తున్నారు. పైగా ఇప్పుడు భిన్న భావజాలాలకు ప్రతినిధులు అయిన వేర్వేరు నాయకులతో మాట్లాడుతూ.. ఆయన మరింత కన్ఫ్యూజన్ కు గురవతున్నట్లుంది. నిన్నటిమాటకు- ఇవాళ్టి మాటకు పొంతన లేకపోవడం పవన్ విషయంలో కొత్తకాదు.. కానీ.. ఇదే మాదిరి వ్యవహారం పదేపదే జరిగితే మాత్రం ప్రజల ఎదుట పరువుపోతుంది. ఆ సంగతి ఆయన తెలుసుకోవాలి.

నిన్న : నేడు :
1) ‘ప్రత్యేకహోదా గురించి పోరాటం సాగించడానికి నా గొంతుచాలదు. మేధావుల బృందం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’
‘హోదా సంగతి కాదు.. ప్యాకేజీ చాలా బాగుంటుందని చెప్పారు.. ప్యాకేజీలో కేంద్రం ఏం తేడా చేస్తోందో తేలాలి’ (హోదా సంగతి పక్కకు పోయింది)

2) ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జేఏసీ రూపంలోనే ఆంధ్రప్రదేశ్ కు కూడా విభజన హామీలను సాదించడానికి ఒక జేఏసీ లాంటిది ఉండాలి.’
‘మనకు కావాల్సింది ఇప్పుడు జేఏసీ కాదు. జేఎఫ్‌సీ. జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ .. నిజనిర్ధరాణ కమిటీ కావాలి. ఏం జరుగుతోందో, వాస్తవాలు తెలుసుకోవాలి’

3) ‘పోరాడితే తప్ప సాధించేది లేదు. బంద్ లతో జనజీవితాన్ని ఇబ్బంది పెట్టడంకాదు.. ఎంపీ ఇళ్ల ముందు పోరాడుదాం.. వారిని ఘెరావ్ చేద్దాం.. సాధిద్దాం..’
‘పోరాటాలకు పిలుపు ఇచ్చి యువతరాన్ని రోడ్ల మీదకు తీసుకురావడం నాకు ఇష్టం లేదు.. మంచిగా ఉండే అన్నీ సాధించుకోవాలి.’

4) (తాజాగా)
‘అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్టప్రభుత్వం కూడా అబద్ధాలు చెబుతున్నాయి. ఇద్దరూ అబద్ధాలు చెబుతున్నారు. కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.’
‘ఒకరు అబద్ధం చెబుతున్నారు.. ఇద్దరిలో అబద్ధం చెబుతున్నది ఎవరో తేల్చాలి’

 ...ఇవన్నీ కేవలం కొన్ని ఉదాహరణకు చెబుతున్న డైలాగులు మాత్రమే. దాదాపుగా ప్రతి విషయంలోనూ ఒకసారి చేసిన ప్రకటనకు తర్వాత చేసే ప్రకటనకు పవన్ మాటల్లో పొంతన ఉండడంలేదు. జనసేన సెకండ్ ఇన్నింగ్స్ సభలు ప్రారంభించిన తరువాత.. పోరాటం అనేదానిని కాస్తా.. అధ్యయనం కిందకు మార్చేసిన పవన్ కల్యాణ్.. అంతిమంగా ఏం చేయదలచుకుంటున్నారనేది బోధపడడంలేదు. నిన్న ఇద్దరు అబద్ధాలు చెబుతున్నారనే మాటచెప్పి.. ఇవాళ అబద్ధం ఒకరే చెబుతున్నారని పవన్ అంటున్నారు. 

రేపు15వ తేదీ ఆయన ఏర్పాటుచేసిన మేధావులు నివేదిక ఇచ్చిన తర్వాత.. ఎవ్వరూ అబద్ధాలు చెప్పడంలేదు. ఇరు ప్రభుత్వాల మధ్య అవగాహన లోపం మాత్రమే అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.