Advertisement


Home > Politics - Gossip
లోకేష్ .. సునామీతో పెట్టుకుంటున్నాడా..!

ఎంత ముఖ్యమంత్రి తనయుడు అయితే మాత్రం.. ఎంత మంత్రిగారు అయితే మాత్రం.. తను ఏం చేసినా తనను ఎవరూ ఏమీ అనకూడదు.. తను తడబాట్లను పొరపాట్లను ఎవ్వరూ ప్రస్తావించకూడదు.. ఎవ్వరూ తప్పు పట్టకూడదు.. అంటే ఎలా? లోకేష్ బాబు ఒక ప్రజాప్రతినిధి. మంత్రి బాధ్యతల్లో ఉన్న వ్యక్తి. ఆయనను అడుగడుగునా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. ఆయన తీరును ఎండగడతారా? పొగుడుతారా? అనేది తర్వాతి కథ. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుని.. ప్రజల సొమ్ములతో హంగూఆర్బాటాలు అనుభవిస్తూ.. ప్రజల ఆస్తులపై హక్కులను కలిగి ఉండి.. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే శాసనాలు చేసే.. వ్యక్తిని విమర్శించే అధికారం, అతడి తప్పొప్పులను ఎత్తి చూపే అధికారం.. ప్రజలకు గాక మరెవరికి ఉంటుంది? సోషల్ మీడియా ద్వారా ప్రజలు ఈ విషయంలో తమ సంపూర్ణ హక్కును ఉపయోగించుకుంటున్నారు.

వ్యక్తిగత దూషణలు, అసభ్యమైన మాటలను మినహాయిస్తే.. వ్యంగ్యం విషయంలో, తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడం విషయంలో సోషల్ మీడియాలో నెటిజన్లను తప్పు పట్టే హక్కు ఎవ్వరికీ లేదు. అయితే లోకేష్ బాబు మాత్రం చాలా కోపంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇది వరకే ఒక సారి సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిందే అని .. మంత్రి వర్గ సమావేశంలో లోకేష్ బాబు అన్నారని ఆయన అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా కూడా అలాంటి వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాను కట్టడి చేయడం గురించి అరెస్టులు.. హెచ్చరికలు చేయాలని.. లోకేష్ అధికారులను ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే లోకేష్ బాబు గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక విషయం ఏమిటంటే.. సోషల్ మీడియా అంటే టీవీ మీడియాలో లేక ప్రింట్ మీడియానో కాదు.. దాని ఓనర్లను బతిమాలి, బెదిరించి, కొనేసి లొంగదీసుకోవడానికి వంగో పెట్టుకోవడానికి చాలా అవకాశాలుంటాయి. ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్టు తన అనుభవాలను వివరించారు. తను ఎన్టీవీ నుంచి బయటకు రావడానికి సంబంధించిన పరిణామాలను ఆయన వివరించారు.

అప్పటికే టీవీ చానళ్ల యాజమాన్యాలతో ప్రభుత్వ పెద్దల వ్యవహరణ తీరు ఎలా ఉందో అర్థం అయిపోయింది. మరి సోషల్ మీడియాను అలా ప్రభావితం చేయడానికి అవకాశం లేదు.. ఇక ఉన్నదల్లా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారిని బెదిరించడం, అరెస్టు చేయించడం, తమపై సూటిగా చురుక్కుమనేలా విమర్శలు చేసే వారిపై కేసులు నమోదు చేయించడం చేయగలడు లోకేష్ బాబు. లోకేష్ ను విమర్శించే వారైనా.. అబ్యూసివ్ కామెంట్స్ చేస్తే వారు శిక్షార్హులే అవుతారు. కానీ సోషల్ మీడియాలో కూడా సునిశితంగా, కన్ స్ట్రక్టివ్ గా స్పందించే వాళ్ల సంఖ్యే ఎక్కువ. వాళ్లపై కేసులు పెట్టడం కుదరదు.. వారిని లోకేష్ ఏ విధంగానూ అడ్డుకోలేడు! ఇక రెండో విషయం.. సోషల్ మీడియా మొత్తం తమకు వ్యతిరేకంగా ఉందని తెలుగుదేశం అధినేత తనయుడికి భయం పట్టుకుంది. కానీ.. ఇక్కడే తెలుగుదేశం పార్టీ చొక్కాలేసుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. వారు ప్రతిపక్ష పార్టీ మీద, తెలుగుదేశం వ్యతిరేక వర్గాల మీద ఎలాంటి పదజాలం ఉపయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే. టీడీపీ తీరును ఏ మాత్రం తప్పుపట్టినా.. ఆఖరికి రాజకీయ వ్యభిచార కాండలను ఖండించినా తెలుగుదేశం అనుకూలురు తట్టుకోలేకపోతున్నారు.

తమ కుసంస్కారాన్ని చాటుకొంటూ నీఛపు మాటలు మాట్లాడుతున్నారు. మరి మాకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టు చేస్తాం.. అనుకూలమైన పోస్టులు పెడుతూ మా వ్యతిరేకులపై నీఛపు భాషను మాట్లాడుతూ నీఛత్వాన్ని ప్రదర్శించినా వారినేం అనం.. అన్నట్టుగా చేసుకోవడానికి రాష్ట్రం ఎవడి జాగీరూ కాదు. ఇలా వ్యవహరిస్తే.. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. గ్రహించి, సోషల్ మీడియా అనే సునామీతో పెట్టుకోవడానికి ముందుకు రావాలి! పీఎస్: ఇప్పుడు సోషల్ మీడియాలో తన మీద సెటైరిక్ వీడియోలు అగుపిస్తుండే సరికి లోకేష్ తట్టుకోలేకపోతున్నట్టుగా ఉన్నాడు. మరి ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ ను తాగుబోతుగా అభివర్ణించిన పోస్టులున్నాయి. అలాగే జగన్ మీద కూడా బోలెడన్ని అనుచితమైన పోస్టులు ప్రచురితం అయ్యాయి. కేసులు పెట్టడం మొదలుపెడితే.. మొదటి నోటీసులు తెలుగుదేశం పార్టీకే వెళ్లాలి.