Advertisement


Home > Politics - Gossip
మంత్రి అంటే లోకేష్ ఒక్కరే!!

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి అంటే లోకేష్ బాబు ఒక్కరే అన్నట్టుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది లోకేష్ మాత్రమే. మిగిలిన మంత్రులు ఏం పని చేస్తున్నారో కూడా తెలియడం లేదు. న్యూస్ ఛానెల్ ఆన్ చేస్తే చంద్రబాబు, లేదా లోకేష్ బాబు వీరిద్దరే కనిపిస్తారు. మిగిలిన మంత్రులు ఏ పనీ చేయకపోవడమో లేదా మీడియా ఆ మంత్రులకి కవరేజ్ ఇవ్వకపోవడమో జరిగుండాలి.

లోకేష్ ఐటీ కంపెనీల ప్రారంభాలూ, కిగా అవార్డ్, దావోస్ సమావేశానికి వెళ్ళడం ఐదేళ్ళల్లో ఐదు లక్షల ఉద్యోగాలు (ఇప్పటివరకూ ఎన్ని ఇచ్చారని అడగొద్దు) అంటూ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అయితే గత నవంబర్ నెల నుండి చూసుకుంటే మిగిలిన ఏ మంత్రి కూడా తమ శాఖలపై తమదైన ముద్ర చూపినట్టు కనబడదు. తమ శాఖలను పర్యవేక్షిస్తున్న దాఖలాలూ లేవు.

ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థులు మంత్రి కామినేని తమని మోసం చేసారని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపిస్తే ఆయన నుండి ఎటువంటి రియాక్షనూ లేదు. దుర్గ గుడి  క్షుద్రపూజల వ్యవహారంలో దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుది నిమిత్తమాత్రుని పాత్రే. పైగా తన స్వంత నియోజకవర్గంలో పనులే తాను చేసుకోలేకపోతున్నానని పబ్లిక్ గా వాపోతున్నారు.

ఇక అఖిలప్రియ అయితే బోటు మునక వ్యవహారం తరువాత అసలు సచివాలయానికే రావడం మానేసారని టాక్. మిగిలిన ముగ్గురు ఫిరాయింపు మంత్రులూ జగన్ ను విమర్శించడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్నా వారు చేస్తున్న పనులేంటో తెలియదు. తమ దగ్గరకు వచ్చిన ఫైళ్ళు క్లియర్ చేసి వెంటనే పంపించడమే వారి డ్యూటీ. కనీసం హోంగార్డ్ ని కూడా నియమించలేని దుస్థితి హోంమంత్రిది.

దేవినేని ఉమా అయితే ఎంతో ముఖ్యమైన నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్రం నిర్వహించిన సమావేశానికే వెళ్ళలేదు. శిద్ధా రాఘవరావు అంటే ఆయన శాఖలో అధికారులకే లెక్కలేదు. ఆయనకు తెలియకుండానే కడప డీఎఫ్ఓ ను నియమిస్తూ జీవో రిలీజ్ చేస్తే అవాక్కవడం ఆయన వంతైంది. సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, జవహర్, కాల్వ శ్రీనివాసులు ఈ ఐదుగురు మంత్రులూ ప్రతిపక్షనేతను దూషిస్తూ మాత్రమే తమ ఉనికిని కాపాడుకొంటున్నారు.

శాఖ మార్చిన తరువాత పత్తిపాటి పుల్లారావు పెద్దగా ఏక్టివ్ గా లేరు. అదే విధంగా రాజధాని నిర్మాణ వ్యవహారంలో అన్నీ తానే అయి వ్యవహరించిన నారాయణ,  లోకేష్ ఎంట్రీ తరువాత తన శాఖకు పరిమితమైపోయారు. ఆరు శాఖల మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పోర్ట్ కు సంబంధించిన లాండ్ పూలింగ్ వ్యవహారాలు, తన నియోజక వర్గం వరకే పరిమితం అయ్యారు.

ఇక గంటా, అయ్యన్న పాత్రుడులు తమ శాఖల కార్యకలాపాల కంటే, ఒకరిపైఒకరు కత్తులు దూసుకోవడం ద్వారానే పాపులర్ అయ్యారు. గంటా ఒక ఫైలు క్లియర్ చేయడానికి సగటున 73 రోజులు తీసుకొంటున్నారు. పరిటాల సునీత, అప్పుడప్పుడూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కాస్త ఏక్టివ్ గా ఉంటున్నారు. పితాని తన నియోజక వర్గానికీ, యనమల బడ్జెట్ తయారీకి మాత్రమే పరిమితమయ్యారు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. మంత్రులందరికీ తమ నియోజక వర్గాలలో అసమ్మతి, తమ కేడర్ ను కాపాడుకోవడం సమస్యలుగా ఉన్నాయి. బాబు, లోకేష్ లకు ఆ సమస్య లేదు. పైగా ఏ మంత్రైనా ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక్క అడుగు కదిపినా, కేబినెట్ సమావేశంలో వారిపై బాబు గారు సీరియస్ అయినట్లు మీడియాలో వస్తుంది. ఒక్క లోకేష్ బాబుకి మాత్రం మినహాయింపు ఉంది. ఆయన సర్వ స్వతంత్రుడు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మంత్రి అంటే లోకేష్ ఒక్కరే. ఎంతైనా తన తదుపరి 2050 వరకూ లోకేష్ నే ముఖ్యమంత్రిగా చూడాలని అనుకొంటున్నారు కదా... ఆ రేంజి లో ప్రొజెక్ట్ చేయకపోతే ఎలా?