cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇక రాష్ట్రమంతా చినబాబు టూర్!

ఇక రాష్ట్రమంతా చినబాబు టూర్!

తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు ఎవరిలోనైనా.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ నాయకత్వం పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? ఏ వేదిక మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా సరే.. ఏదో రకంగా పార్టీ పరువు తీస్తూ ఉండే.. ఈ మంత్రిగారు... పార్టీకి సర్వం తానే అయి సారథ్యం వహించే పరిస్థితి వస్తే ఏ గంగలో ముంచుతాడో అనే భయాలు ఉన్నాయా? వారందరూ కూడా తమ అభిప్రాయాలను మార్చుకుని, చినబాబు ఏకఛత్ర నాయకత్వాన్ని ఆమోదించి తీరాల్సిందే. ఆమోదించేదాకా వారిని వదలిపెట్టేది లేదు. పార్టీలో లోకేష్ పట్ల అంగీకారాన్ని ప్రోది చేయడమే లక్ష్యమా అనిపించేలాగా.. ఆయన ఇప్పుడు రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు.

లోకేష్ నాయకత్వం పట్ల పార్టీలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది సీనియర్ నాయకులు మంత్రులు, లోకేష్ తెలివితేటల గురించి.. తమ ప్రెవేటు సంభాషణల్లో జోకులు వేస్తుటారనే ప్రచారం కూడా పుష్కలంగా ఉంది. చంద్రబాబునాయుడు మాత్రం ఇలాంటి ప్రతికూలతలు అన్నింటినీ... వ్యూహాత్మకంగా తొక్కేసుకుంటూ.. తన కొడుకును నాయకుడిగా ఆవిర్భవింపజేయాలని మహా తపన పడుతున్నారు.

ఆ తపనలో భాగంగానే.. గత ఎన్నికల సమయంలో పార్టీ ఎన్నికల నిర్వహణ మొత్తం లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా ఒక బిల్డప్ ఇచ్చారు. నిజానికి ఎన్నికల్లో తలలు పండిన అనేకమందిని బృందంగా ఏర్పాటుచేసి.. ఆ బృందం లోకేష్ సారథ్యంలో పనిచేస్తున్నట్లుగా భ్రమింపజేసి.. వ్యూహాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం లోకేష్ కు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. సామాన్య తెలుగుదేశం కార్యకర్తలు నిజమే కాబోలు అనుకున్నారు.

కానీ ఆయనను మంత్రి పదవిలో కూర్చోబెట్టిన తర్వాత.. అసలు బండారం బయటపడుతోంది. ఎంత అవగాహన రాహిత్యం ఆయనలో ఉన్నదో ప్రతిసారీ తేలిపోతోంది. పార్టీ శ్రేణులు.. చినబాబు వేస్ట్ అనుకోకుండా.. మరో వ్యూహం ఇప్పుడు సిద్ధమవుతోంది. లోకేష్ రాష్ట్రమంతా తిరిగి ప్రతిజిల్లాలో పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి.. ఎన్నికలకు సమాయత్తం చేస్తారట. చంద్రబాబు పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే.. లోకేష్ రాష్ట్రమంతా తిరిగి స్ఫూర్తి నింపుతారట.

చూడబోతే ఈ స్కెచ్ అంతా.. లోకేష్ వల్లనే మేం గెలుస్తున్నాం.. అనే భావనను రాష్ట్రమంతా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కలిగించడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉంది. చూడాలి.. వారి పాచికలు ఎంత మేరకు ఫలిస్తాయో?