cloudfront

Advertisement


Home > Politics - Gossip

ప్రేమ.. పెళ్లి.. సెక్స్‌.. ఇంత సింపులా..!

ప్రేమ.. పెళ్లి.. సెక్స్‌.. ఇంత సింపులా..!

ఇవతల ప్రేమ కోసం జీవితాలే నాశనం చేసుకుంటున్న వాళ్లు...

అవతల ఒకే జీవితంలో ఎన్నో ప్రేమలు చూస్తున్న వాళ్లు...

ఇవతల ఒక అబ్బాయి కోసమో, ఒక అమ్మాయి కోసమో ఆలోచిస్తూ జీవితమంతా బాధపడుతున్న వాళ్లు, జీవితాన్నే ముగిస్తున్న వాళ్లు..

అవతల ఒక అమ్మాయి వదిలేస్తే ఇంకో అమ్మాయిని అంతే వేగంగా వెదుక్కొంటూ.. ఒక అబ్బాయి కాదంటే, మరో అబ్బాయిని టక్కున పడేస్తున్న వాళ్లు.. 

వీళ్లలో ఎవరు గొప్ప?
ప్రేమ, పెళ్లి, జీవితమంతా ప్రేమ అంటున్నది సామాన్యులు. సినిమాల్లో చూపించినంత ఈజీగా కొత్త ప్రేమకథను మొదలుపెడుతున్న వాళ్లు సెలబ్రిటీలు.

వీరిలో ఎవరు గొప్ప?
భారతదేశంలో అన్నీ అంతరాలే. అన్నీ తేడాలే. ఆఖరికి ప్రేమ, పెళ్లి, సెక్స్‌, విలువలు.. వీటిలో కూడా. ఒక్కోరికి ఒక్కో ప్రమాణం. ఆలోచించే తీరులోనే ఈ తేడాలున్నాయా? లేక ఎవరి ప్రమాణాలు వారివా?

సెలబ్రిటీల జీవితాలను గమనిస్తే.. ఏవైతే విలువలు అని మన సమాజం ఒక ప్రామాణికాన్ని ఏర్పాటు చేసిందో వీటితో సెలబ్రిటీల జీవితాలను పోలిస్తే... కొన్ని సమకాలీన ప్రేమకథలను పరిశీలిస్తే... చాలారకాల అభిప్రాయాలు మారిపోతాయి. ఏదైతే తప్పు అని సామాజికంగా ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేసుకున్నామో దానికే జనామోదం కూడా కనిపిస్తుంది. మన పక్కన ఉన్నవాడు అలా చేశాడంటే.. వాడిని పురుగులా చూస్తాం. అదే తెరపై కనిపించేవాడు అలా చేశాడంటే.. అబ్బా... అంటాం! మొత్తం డబుల్‌ స్టాండర్డ్స్‌. ఇలాచూస్తే ఎవరికీ విలువలులేవు! నడుస్తున్న కొన్ని ప్రేమకథల, పెళ్లి కథలపై ఒక లుక్‌ వేస్తే...

కుమారస్వామి పదవి పోతుందా?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పదవి పోవాలంటే కాంగ్రెస్‌ పార్టీ మద్ధతును ఉపసంహరించుకోవాల్సిన అవసరంలేదు, రాధికా కుమారస్వామి ఒక కంప్లైట్‌ చేస్తేచాలు. ఈమె నటి. ఇప్పుడొక తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నట్టుగా ఉంది. ఇంతకు మించి చెప్పాలంటే రాధిక.. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి భార్య. అలాగని దీనికి అధికారిక ధ్రువీకరణ లేదు. ఆమె పేరు వెనుక కుమారస్వామి పేరుంది. ఆమెకు పుట్టిన కూతురుకు తండ్రిగా కుమారస్వామి పేరుంది. అలాగని రాధికా కుమారస్వామి కర్ణాటక సీఎంకు అధికారిక భార్య కాదు. అనధికార భార్య.

ఈమె కుమారస్వామి భార్య అయితే.. ఆయనది అనైతికం. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండోపెళ్లి చేసుకున్నందుకు కుమారస్వామి నేరం చేసినట్టే. అందుకు మూల్యంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మొదటిభార్య బతికి ఉండగానే రెండోపెళ్లి చేసుకున్నందుకు ఈయన నేరం చేసినట్టే. దీన్నే పట్టుకుని కొన్నాళ్ల కిందట కుమారస్వామి రాజకీయ ప్రత్యర్థులు కోర్టుకు ఎక్కారు. అదేం చిత్రమో.. కోర్టు వాళ్లిద్దరి పెళ్లికీ సాక్ష్యాలు లేవని అంది.

కుమారస్వామి రెండోపెళ్లి చేసుకుంటే నేరమే, అతడిని పదవీచ్యుతుడిని చేయవచ్చు. అయితే వాళ్లిద్దరికీ పెళ్లి అయినట్టుగా సాక్ష్యం చూపండని కోర్టు అడిగింది. కలిసి దిగిన ఫొటోలు, కూతురు ఇవేవీ వారి పెళ్లికి సాక్ష్యాలు కాలేకపోయాయి. ఒకవేళ రాధికా కుమారస్వామి వెళ్లి ఫిర్యాదు చేసినా.. ఆమె కూడా బలమైన సాక్ష్యాలు చూపాల్సి ఉంటుంది. అప్పటివరకూ కుమారస్వామికి ఎదురులేదు. అందుకే ఆయన ఎంచక్కా మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు.

సాంకేతికంగా కుమారస్వామి నేరస్తుడు ఏమీకాదు. నైతికంగా? అయినా జనాలకే నైతికత లేదు. లేకపోతే కుమారస్వామిని మళ్లీ ఎమ్మెల్యేగా ఎలా ఎన్నుకుంటారు? కుమారస్వామి తన వయసులో సగం వయసున్న అమ్మాయిని చేపట్టి, కూతురును కన్నాడు. అనైతికం కదా. అలాగని అతడికి ఓట్లేయకుండా ఆగలేదు. అతడిని కర్ణాటక సీఎంగా అవకుండా జనాలు అడ్డుకోలేదు. కాబట్టి.. చిన్నిళ్లును జనాలు కూడా సమర్థిస్తున్నట్టే. కుమారస్వామికి ఓటేసిన వాళ్లలో మహిళలు కూడా ఉన్నారు. మరి వారి భర్తలు ఇలా చిన్నిళ్లు మెయింటెయిన్‌ చేస్తే వాళ్లు ఒప్పుకుంటారా?

కుమారస్వామి ప్రేమకథను, పెళ్లికథను చాలా అందంగా సమర్థిస్తారు అభిమానులు. కుమారస్వామి ఏదో ఆవేశంలో కమిట్‌ అయ్యాడని వీరు అంటారు. 50యేళ్లు దాటాకా అప్పటికీ ఆవేశమా? అంటే.. అదేదో అలా జరిగిపోయిందని ముసి ముసినవ్వులు నవ్వుతారు. అంతేకాదట.. కుమారస్వామి రెండోపెళ్లిని ఆయన తండ్రి వ్యతిరేకించాడట. కుమారస్వామి మొదటి భార్య అనితను దేవేగౌడ కూతురులా చూసుకుంటాడట. బాగుందికదా.. కొడుకు మొదటి భార్యను తండ్రి కూతురులా చూసుకుంటాడు, కొడుకేమో వేరే పెళ్లి చేసుకున్నాడు.

న్యాయం జరిగినట్టే, అంతేకాదు.. రాధికా కుమారస్వామితో ఇప్పుడు కుమారస్వామికి అస్సలు సంబంధాలు లేవట. ఆమెదారి ఆమెదే, కుమారస్వామి దారి కుమారస్వామిదే. ఇది ఇంకో క్రైమ్‌. ఇది మరో అనైతికత. ఇప్పుడు కుమారస్వామి వెంట రాధిక ఎక్కడా కనిపించదు. అన్నింటా అనితా కుమారస్వామి కనిపిస్తుంది. రాధిక ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది.

ఈ కథంతా పాతదే అయినా కుమారస్వామి కర్ణాటక సీఎం కావడంతో వ్యవహారం మళ్లీ ఫ్రెష్‌గా తెరపైకి వచ్చింది. లేటు వయసులో ఘాటు ప్రేమకథ నడిపి సామాన్యుల భాషలో  చెప్పాలంటే స్త్రీ లోలుడు అయిన కుమారస్వామి సీఎం కావడం విశేషమే కదా.